Kajol Deepfake Video: మరో డీప్ ఫేక్ వీడియో.. ఈసారి కాజోల్‌పై
Kajol Deepfake Video: రష్మికపై రూపొందించిన ఫేక్ వీడియోపై ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కీర్తిసురేశ్, నాగచైతన్య, విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kajol Deepfake Video: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నవేళ దానిని దుర్వినియోగం చేస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇటీవల డీప్ ఫేక్ వీడియోతో సినీ నటి రష్మికపై రూపొందించిన వీడియోను మరువకముందే పలువురు ఆకతాయిలు ఇప్పుడు బాలీవుడ్ నటి కాజోల్‌పై మరో వీడియో రూపొందించడం చర్చనీయాంశంగా మారింది. ‘కాజోల్ డ్రెస్ ఛేంజింగ్ వీడియో’ అంటూ దీనిని నెట్టింట షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
’గెట్ రెడీ విత్ మీ’ అంటూ ఓ సోషల్ మీడియా నటి పోస్ట్ చేసిన వీడియోకు కాజోల్ ముఖాన్ని ఉపయోగించి ఈ ఫేక్ వీడియో సృష్టించారు. దీనిపై పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ వీడియోలతో సినీ తారలను టార్గెట్ చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో టిక్‌టాక్ వేదికగా ఓ సోషల్ మీడియా స్టార్ దీనిని పోస్ట్ చేశారని, దానిని ఉపయోగించి కాజోల్ ఇమేజ్‌కి ఇబ్బంది కలిగించేలా ఈ వీడియో చేశారని మండిపడుతున్నారు.
కొత్త సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ పలువురు ఆకతాయిలు ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. రష్మికపై రూపొందించిన ఫేక్ వీడియోపై ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కీర్తిసురేశ్, నాగచైతన్య, విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కేంద్ర ఐటీ శాఖ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై రష్మిక సైతం ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందన్నారు. ఆ ఘటనను మరువకముందే ఇప్పుడు ఈ వీడియో నెట్టింట విడుదల చేయడంపై సినీ తారలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.