Telugu Global
Cinema & Entertainment

అలనాటి నటి వహీదా రెహమాన్‌కు.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

1956లో వచ్చిన సీఐడీ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన వహీదా.. ప్యాసా, గైడ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

అలనాటి నటి వహీదా రెహమాన్‌కు.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
X

ఒకప్పటి గ్లామర్ క్వీన్, బాలీవుడ్‌లో ఇప్పటికీ నటిస్తున్న ప్రముఖ నటి వహీదా రెహమాన్‌కు 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు వరించింది. సినిమా రంగంలో దశాబ్దాలుగా ఆమె చేసిన సేవలకు గుర్తించి కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అఛివ్‌మెంట్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. భారతీయ సినిమా పరిశ్రమకు వహీదా రెహమాన్ ఐదు దశాబ్దాలుగా చేసిన సేవలకు గాను ఈ అవార్డుకు ఎంపికయినట్లు ప్రభుత్వం పేర్కొన్నది.

మద్రాసు రాష్ట్రంలోని రాజమండ్రిలో (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్)లో వహీదా రెహమాన్ జన్మించారు. విజయవాడ, హైదరాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1955లో తొలి సారిగా 'రోజలు మారాయి' అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలోని 'ఏరువాకా సాగారో రన్నో..' అనే పాట చాలా పాపులర్. దాంట్లో నటించిన హీరోయిన్ వహీదానే. ఆ చిత్రంలోని పాట హిట్ అవడంతో ఆ తర్వాత ఆమె బాలీవుట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

1956లో వచ్చిన సీఐడీ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన వహీదా.. ప్యాసా, గైడ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఇప్పటి వరకు 90కి పైగా చిత్రాల్లో నటించిన వహీదా.. 1971లో జాతీయ అవార్డును అందుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి పురస్కారాలు కూడా వహీదాను వరించాయి. ఇటీవల కాలంలో రంగ్ దే బసంతి, ఢిల్లీ 6 వంటి బాలీవుడ్ చిత్రాల్లో తన నటనతో మెప్పించారు. నటుడు శశి రేఖిని వివాహం చేసుకొని చాలా కాలం బెంగళూరులో జీవితం గడిపారు. 2000లో భర్త మరణం తర్వాతే తిరిగి సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ వచ్చారు.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించడం పట్ల వహీదా రెహ్మాన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సమయంలో తన నటనకు మరొక గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అంకిత భావం, నిజాయితీతో పని చేస్తే ఎవరికైనా, ఎప్పటికైనా గుర్తింపు వస్తుందని ఈ అవార్డు ద్వారా మరోసారి రుజువయ్యిందని అన్నారు. చిత్ర పరిశ్రమలో నా విజయం నా ఒక్కరిదే కాదని.. ఒక టీమ్‌గా పని చేయడం వల్లే నేను కూడా గుర్తింపు తెచ్చుకున్నానని అన్నారు. నేను నటించిన చిత్రాల్లో 'గైడ్' సినిమానే చాలా ఇష్టమని పేర్కొన్నారు.


First Published:  26 Sept 2023 5:47 PM IST
Next Story