Telugu Global
Cinema & Entertainment

నార్త్ లో సంక్షోభం : సినిమాలు ఆడక, షోలు పడక...

ఉత్తరాది రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పెద్ద సినిమాలు విడుదల కాక, విడుదలైన సినిమాలు ఆడక షోలు పరిమితం చేసి థియేట్రికల్ వ్యాపారాన్ని కనాకష్టంగా నెట్టుకొస్తున్నారు.

నార్త్ లో సంక్షోభం : సినిమాలు ఆడక, షోలు పడక...
X

ఉత్తరాది రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పెద్ద సినిమాలు విడుదల కాక, విడుదలైన సినిమాలు ఆడక షోలు పరిమితం చేసి థియేట్రికల్ వ్యాపారాన్ని కనాకష్టంగా నెట్టుకొస్తున్నారు. దీన్ని మూడు రకాలుగా విశ్లేషిస్తున్నారు : కొత్త సినిమాల విడుదలలు తగ్గిపోవడమని కొందరు, ఎన్నికల ప్రభావమని మరి కొందరు, బ్యాడ్ కంటెంట్ సరఫరా అని ఇంకొందరూ థియేటర్ల యజమానులు వాపోతున్నారు. కొన్ని థియేటర్లు మూసివేశారు కూడా. ఏప్రెల్ 11 న విడుదలైన స్టార్ సినిమాలు రెండూ అట్టర్ ఫ్లాపయ్యాయి. అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్ నటించిన ‘బడే మియా- చోటే మియా’, అజయ్ దేవగణ్ నటించిన ‘మైదాన్’ బడ్జెట్లో సగం కూడా వసూలు చేయలేక పోయాయి. మొదటిది రూ. 350 కోట్లతో నిర్మిస్తే రూ. 94.53 కోట్లు, రెండోది రూ. 235 కోట్లతో నిర్మిస్తే రూ. 65.23 మాత్రమే వసూలు చేశాయి.

ఈ పరిస్థితి ఎగ్జిబిటర్‌లని అయోమయంలో పడేస్తోంది. థియేటర్లు మూసి వేస్తున్నారు, లేదా తక్కువ షోలు రన్ చేస్తున్నారు. నిర్వహణ ఖర్చులు రావడం లేదు. కోవిడ్ మహమ్మారి రెండేళ్ళ కాలంలో ఎదుర్కొన్న పరిస్థితినే మళ్ళీ ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. కొత్త విడుదల వరుణ్ ధావన్ - కీర్తి సురేష్ నటించిన ‘బేబీ జాన్’ మే 31 న విడుదల కావాల్సి వుండగా జూన్ లేదా జూలైకి వాయిదా పడింది. మే 9న విడుదల కావాల్సిన ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ నటించిన మల్టీ స్టారర్ ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27 కి వాయిదా పడింది.

ఇప్పుడు ఉన్న సినిమాల షోస్ ని తగ్గించడమో, లేదా కొన్ని స్క్రీన్స్ ని మూసివేయడమో చేస్తున్నారు. స్టార్‌వరల్డ్ సినిమాస్ లో నిర్వహిస్తున్న నాలుగు ఆడిటోరియంలలో రెండింటిని మూసివేశారు. నార్త్ లో ఇలా వుంటే, సౌత్ లో ఏప్రిల్ 20న సినిమా 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మళ్ళీ విడుదలైన విజయ్ నటించిన ‘ఘిల్లి’ ఒక్క తమిళనాడులోనే 15 రోజుల్లో రూ.22 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు రూ. 3.5 కోట్ల వసూలు చేసింది. నార్త్ లో ఇలా పాత హిట్స్ ని రీరిలీజ్ చేయవచ్చు. ఈ ఆలోచన చేయడం లేదు.

దేశంలో అతిపెద్ద మల్టీప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్ - ఐనాక్స్ కూడా సినిమాల బలహీనమైన కంటెంట్ సరఫరా కారణంగా కష్టాల్లో వుంది. ఈ ఏడాది ఇప్పటివరకు పీవీఆర్ -ఐనాక్స్ షేర్లు 20 శాతానికి పైగా పడిపోయాయి. ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి ఈ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్- ఐనాక్స్ పాస్‌పోర్ట్ వంటి ఆఫర్స్ ని ప్రమోట్ చేస్తోంది. పరిస్థితి భయంకరంగా వుందని నిర్మాత, సినిమా ట్రేడ్ నిపుణుడు గిరీష్ జోహార్ అన్నారు.

తాము సర్వైవల్ మోడ్‌లో వున్నామని బీహార్‌లోని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమాని ఒకరు చెప్పారు. ఆడించడానికి సినిమాల్లేవనీ, సినిమాల్లేకపోతే థియేటర్లు మూతేసుకోవ

డమేననీ తెగేసి చెప్పారు. పాట్నాలో రెండు సినిమా థియేటర్లు మూతపడ్డాయని, తన ప్రాంతంలో (పూర్నియా) రెండు సినిమా హాళ్ళూ మూతపడ్డాయనీ చెప్పారు. కంటెంట్ సరఫరా పెరిగేవరకూ చాలా సినిమాహాళ్ళని తాత్కాలికంగా మూసివేయక తప్పదని వివరించారు. ప్రస్తుతం తన 300 సీట్ల కెపాసిటీ వున్న సినిమా హాల్లో కేవలం 50-60 మంది మాత్రమే వస్తున్నారని, ఇది ఖర్చులకు సరిపోయేంతగా లేదని చెప్పారు.

రోజువారీ ఖర్చులు సింగిల్ స్క్రీన్‌కి దాదాపు రూ. 25,000-30,000; మూడు లేదా నాలుగు స్క్రీన్స్ గల ప్రాపర్టీకి రోజుకు దాదాపు రూ. 40,000-50,000 అవుతుందనీ, ఈ ఖర్చుని కవర్ చేయడానికి కనీసం రూ. 50,000-60,000 వసూలు చేసే సినిమాలు కావాలనీ లెక్కలు చెప్పారు.

సినిమా ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు థియేటర్లు కూడా డిస్కౌంట్లని ఆఫర్ చేస్తూ టిక్కెట్ ధరల్ని తగ్గించడం కూడా చేశాయి. ముక్తా ఏ 2 సినిమాస్ లో ఏప్రిల్ 10న విడుదలైన అజయ్ దేవగణ్ స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’ కి అన్ని షోలకూ రూ. 99 ని అమలు చేశారు. తగ్గింపు టిక్కెట్ ధరని భర్తీ చేయడానికి మరింత ఎక్కువ మంది ప్రేక్షకులు అవసరం. రోజుకు కనీసం 300-400 మంది ప్రేక్షకులు హాజరైతేనే గిట్టుబాటవుతుంది. ఎగ్జిబిటర్ల ఈ పోరాటం మే, జూన్‌ రెండు నెలలూ కొనసాగేట్టుంది. ఎన్నికల కారణంగా సినిమాల విడుదలలు వాయిదా పడ్డంతో ప్రస్తుతం నార్త్ లో థియేటర్ల పరిస్థితి దారుణంగా వుంది. ఏప్రిల్ పూర్తిగా తుడిచిపెట్టుకు

పోయింది - మే కూడా ఇంతే.

దేశంలో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతు న్నాయి. దేశం ఎన్నికల మూడ్ లో వున్నప్పుడు సినిమాల్ని విడుదల చేస్తే మార్కెటింగ్ బడ్జెట్ పెంచి పబ్లిసిటీ ఇవ్వాల్సుంటుంది. దీనికి నిర్మాతలు సిద్ధంగా లేరు. ఎన్నికలే కాకుండా స్కూల్స్ కి సెలవులు, దీంతో విమానాలు ఫుల్ అవడం, జనాలు ట్రిప్‌కి వెళ్ళడం చేస్తూంటే సినిమాలెవరు చూస్తారు. టాలీవుడ్ లో ఇదే పరిస్థితి. ఎన్నికలు, ఎండలు, క్రికెట్ కారణాలుగా చెప్పి సమ్మర్ రేసులో పాల్గొనకుండా పెద్ద సినిమాలని వాయిదావేశారు- ఈ అవకాశం చూసుకుని చిన్న సినిమాలతో టోకున సమ్మర్ సీజన్ ని సార్ధకం చేస్తున్నారు ఇతర నిర్మాతలు - నష్టపోతామని తెలిసినా సరే!

First Published:  12 May 2024 8:56 AM GMT
Next Story