Telugu Global
Cinema & Entertainment

అయోమయంలో తమిళ ఫీల్ గుడ్ సినిమా

తమిళ చలనచిత్ర పరిశ్రమ యాక్షన్ సినిమాల మోజులో పడి ఫీల్ గుడ్ సినిమాల్ని అందించడంలేదన్న అసంతృప్తితో ప్రేక్షకులు మలయాళం సినిమాల వైపు మొగ్గు చూపుతున్న దృశ్యం కనబడుతోంది.

అయోమయంలో తమిళ ఫీల్ గుడ్ సినిమా
X

తమిళ చలనచిత్ర పరిశ్రమ యాక్షన్ సినిమాల మోజులో పడి ఫీల్ గుడ్ సినిమాల్ని అందించడంలేదన్న అసంతృప్తితో ప్రేక్షకులు మలయాళం సినిమాల వైపు మొగ్గు చూపుతున్న దృశ్యం కనబడుతోంది. విజయ్, అజిత్, సూర్య, విక్రమ్ లాంటి స్టార్లు నటిస్తున్న యాక్షన్ సినిమాలు మంచి బాక్సాఫీసు విజయాల్ని కొనసాగిస్తూండడంతో, చిన్న రేంజిలో ఫీల్ గుడ్ సినిమా అనేది చచ్చిపోయిందని ప్రేక్షకులే కాదు, చిన్న సినిమాలు తీసే నిర్మాతలు, దర్శకులు కూడా ఆవేదన చెందుతున్నారు. నిన్న ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రకని చిన్న-బడ్జెట్ తమిళ సినిమాలకి ఆదరణ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పరిశ్రమల సినిమాలకి ప్రాధాన్యమివ్వకుండా స్థానిక సినిమాలనే చూసి ప్రోత్సహించాలని కోరారు. సముద్రకని విన్నపాన్ని అభిమానులు కొందరు ప్రశంసించారు, మరికొందరు ఖండించారు.

ఖండించడం ఎందుకంటే, భారీ యాక్షన్ సినిమాలు మార్కెట్ ని ఆక్రమించుకుంటున్నప్పుడు చిన్న సినిమాలకి బయ్యర్లు ఎక్కడ్నుంచి దొరుకుతారు. దొరకనప్పుడు చిన్న సినిమాలు ఎలా విడుదలవుతాయి. విడుదల కానప్పుడు ప్రేక్షకులెలా చూసి ప్రోత్సహిస్తారు. ఈ వాదనతో నిర్మాతలు చిన్న సినిమాలని తీసేందుకు సాహసించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఫీల్ గుడ్ సినిమా అనే చిన్న సినిమాల విడుదలలు ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయాయి. తమిళ సినిమా అభిమానులు ఇప్పుడు కుటుంబాలతో కలిసి నాణ్యమైన సినిమాల్ని చూడడానికి ఇష్టపడుతున్నారని ఒక పరిశీలనలో వెల్లడైంది. అయితే ఫీల్ గుడ్ సినిమాల నుంచి యాక్షన్ సినిమాల వైపు సినిమాల నిర్మాణం మారడం వల్ల ఫీల్ గుడ్ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లు గణనీయంగా తగ్గాయంటున్నారు. అయితే సముద్రకని లాగే, నిర్మాతల అభిప్రాయం కూడా కరెక్ట్ కాదని చెప్పొచ్చు.

ఇటీవలి రోజుల్లో మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు, బ్రహ్మయుగం, ఆడుజీవితం వంటి అనేక మలయాళ సినిమాలు తమిళనాడులో హిట్టయ్యాయి. కానీ పరిమిత బడ్జెట్ తో ఒక్క తమిళ సినిమా కూడా కేరళలో హిట్ కాలేదు. ఇది ఫీల్ గుడ్ సినిమాల్ని తీయలేని తమిళ నిర్మాతల అశక్తతని తెలియజేస్తోంది. భారీ తమిళ యాక్షన్ సినిమాలు విజృంభిస్తున్న రోజుల్లోనే పై మలయాళం సినిమాలు తమిళనాడులో విడుదలై హిట్టయ్యాయి. కాబట్టి భారీ సినిమాలతో పోటీ పడలేక ఫీల్ గుడ్ సినిమాలు చచ్చిపోతున్నాయనడం సరి కాదు. చిన్న సినిమాలు ఎప్పుడూ చచ్చిపోవు. ఒక మూసలో తీసిందే తీస్తూ వుంటే చచ్చిపోతాయి. మార్పు చెందుతూ వుంటే బతికే వుంటాయి. మలయాళంలో ఇదే జరుగుతోంది.

పోతే, రానున్న రోజుల్లో పరిస్థితి మాలూలుగా వుండేట్టు కనబడడం లేదు. తమిళ యాక్షన్ సినిమాలు ఫీల్ గుడ్ సినిమాల్ని చంపేస్తున్నాయని ఒక పక్క వాపోతూంటే, మరోపక్క తమిళ స్టార్స్ ఒకటి కాదు, ఒకేసారి రెండు మూడు సినిమాలు నటించేస్తూ సంఖ్య పెంచేస్తున్నారు. ఇలా సంఖ్య పెరిగితే మలయాళం ఫీల్ గుడ్ సినిమాల్ని కూడా తమిళనాడులో విడుదల చేసుకునే అవకాశం దొరకదు. ఇదంతా తీయబోయే చిన్నసినిమాల సంగతి. పరిస్థితులు చూసి నిర్మాతలు వెనుకంజవేసేందుకు వీలు కల్పిస్తున్న సన్నివేశం. అయితే ఇప్పటికే పూర్తయి విడుదల కోసం ఎదురుచూస్తున్న చిన్న సినిమాల సంగతేమిటి?

గత రెండేళ్ళలో దాదాపు 300 నుంచి 320 చిన్న సినిమాలు తమిళంలో నిర్మించారు. వీటిలో కేవలం 70 సినిమాల్ని మాత్రమే ఏవో కష్టాలు పడి విడుదల చేసుకోగల్గారు నిర్మాతలు. మిగిలిన 250 సినిమాల సంగతేమిటి? ఒక్కో చిన్న సినిమా మూడు నుంచి 5 కోట్ల రూపాయల మధ్య బడ్జెట్‌తో సినిమా నిర్మించారని లెక్కిస్తే, చిన్న సినిమాల రూపంలో మార్కెట్‌లోకి ప్రవేశించడానికి దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడి ఎదురు తెన్నులు కాస్తోంది. ఇందులో కోటి కూడా వెనక్కి రావడం కల్ల.

ప్రేక్షకులందరూ కూడా ఉత్తమాభిరుచులు అకస్మాత్తుగా పెరిగిపోయి ఫీల్ గుడ్ సినిమాలు డిమాండ్ చేస్తున్నారనడానికి లేదు. ఎక్కువ మంది ప్రేక్షకులు ఫీల్ గుడ్ /చిన్న సినిమా అంటే ఓ టీటీ సినిమా అనే అభిప్రాయానికొచ్చేశారు. వాటి మీద ఓటీటీ ముద్ర వేసి పెద్ద సినిమాలు వచ్చినప్పుడు థియేటర్లకి కదులుతున్నారు. కాబట్టి చిన్న సినిమాలు బ్రతకడానికి చుట్టూ సమస్యలే. మలయాళంలో వందల కోట్లు పెట్టి భారీ సినిమాలు తీయరు కాబట్టి (మమ్ముట్టి వంటి టాప్ స్టార్ సైతం రూ. 15-30 కోట్ల రేంజి బడ్జెట్ సినిమాలతో వుండాల్సిందే), చిన్న సినిమాలే దిక్కు కాబట్టీ వాటిని క్వాలిటీతో తీసి హిట్ చేసుకుంటున్నారు. అయితే అక్కడా అన్ని చిన్న సినిమాలూ హిట్ కావడం లేదు. పాతిక శాతం కూడా హిట్ కావడం లేదు. కానీ అక్కడ భారీ యాక్షన్ సినిమాలతో పోటీ, చిన్న సినిమాలంటే ఓటీటీ సినిమాలనే అనే అభిప్రాయమూ లేవు. స్టార్ల భారీ యాక్షన్ సినిమాలని తట్టుకుని నిలబడాలంటే చిన్న సినిమాల్ని కూడా గుండెలదిరే యాక్షన్ సినిమాలుగా తీయాల్సిందే. ఈ పని స్కాండినేవియా సినిమాలు చేస్తున్నాయి. భారీ హాలీవుడ్ యాక్షన్ సినిమాల్ని తట్టుకోవడానికి, అక్కడి స్వీడిష్ భాషలో చిన్న సినిమాల్ని ఉన్న బడ్జెట్ లోనే బలమైన యాక్షన్ / థ్రిల్లర్ సినిమాలుగా తీస్తూ సినిమా పరిశ్రమని కాపాడుకుంటున్నారు.

First Published:  13 Jun 2024 10:39 AM GMT
Next Story