Visweswara Rao | కమెడియన్ విశ్వేశ్వరరావు కన్నుమూత
Comedian Visweswara Rao - టాలీవుడ్ కు మరో నటుడు దూరమయ్యాడు. 300కు పైగా చిత్రాల్లో నటించిన కమెడియన్ విశ్వేశ్వరరావు కన్నుమూశారు.
నటుడు డానియల్ బాలాజీ మరణాన్ని మరువకముందే మరో విషాదం చోటు చేసుకుంది. కమెడియన్ విశ్వేశ్వరరావు కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వవిశ్వేశ్వరరావు, ఈరోజు తుదిశ్వాస విడిచారు.
కమెడియన్లలో బ్రహ్మానందం, బాబూమోహన్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకోలేకపోయినా.. తనకంటూ ఓ స్టయిల్, ఇమేజ్ సంపాదించుకున్నారు విశ్వేశ్వరరావు. ఆయన డైలాగ్ డెలివరీ, గొంతు వింటే కామెడీ కోసమే పుట్టారేమో అనిపిస్తుంది.
కాకినాడలో జన్మించిన విశ్వేశ్వరరావు, చిన్నప్పుడే కుటుంబంతో పాటు చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, తెలుగు-తమిళ భాషల్లో 300కి పైగా సినిమాలు చేశారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి నటులతో కూడా నటించిన అనుభవం ఆయన సొంతం. 3 తరాల నటీనటులతో ఆయన నటించారు.
అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు కమెడియన్ గా ఆయనకు స్టార్ స్టేటస్ రాలేదు. అయినప్పటికీ ఆయన ఎప్పుడూ బాధపడలేదు. చేసిన పాత్రలతోనే సంతృప్తి చెందాలని, ఏదో మిస్సయిందనే బాధ కంటే, ఉన్నదానితో తృప్తిగా ఉండడం ఇష్టమని.. తను స్వయంగా నడిపే యూట్యూబ్ ఛానెల్ లో ఒకానొక సందర్భంలో చెప్పుకున్నారు విశ్వేశ్వరరావు. కేవలం కామెడీనే కాకుండా.. కొన్ని చిత్రాల్లో ఆయన క్యారెక్టర్ రోల్స్ కూడా చేశారు.
విశ్వేశ్వరరావు పార్థివ దేహాన్ని చెన్నైలోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు.