Telugu Global
Cinema & Entertainment

ఓటీటీలదో దారి, రీమేకులదో దారి!

ఓటీటీ కంపెనీలు గానీ, రీమేకులు చేసే నిర్మాతలుగానీ రీమేకులు అవసరమా అని ఆలోచించడం లేదు, ప్రేక్షకులే విసిగిపోయి ప్రశ్నిస్తున్నారు. మేం థియేటర్లోనో ఓటీటీల్లోనో చూసేసిన సినిమాల్నే రీమేక్ చేసి మళ్ళీ థియేటర్లలో, ఓటీటీల్లో పడేస్తే ఎలా చూడాలని విమర్శిస్తున్నారు.

ఓటీటీలదో దారి, రీమేకులదో దారి!
X

కోవిడ్ మహమ్మారి కాలంలో వినోద పరిశ్రమలో పాగావేసి పాతుకుపోయిన ఓటీటీ కంపెనీలు వివిధ భాషల సినిమాల్ని కొని సార్వజనీనం చేస్తూంటే, ఇంకా రీమేకులు అవసరమా అన్న ప్రశ్న ఎదురవుతోంది. ముఖ్యంగా ప్రేక్షకుల్లో విసుగు కన్పిస్తోంది. ఏ సినిమా చూసినా ఏదో భాష నుంచి రీమేకవుతూ తమ భాష నుంచి వచ్చే ఒరిజినల్ సినిమాలని వెతుక్కోవాల్సి వస్తోందని ఫిర్యాదు. అసలు ఓటీటీలు ఒక భాషలో కొన్న సినిమాని సబ్ టైటిల్స్ వేసి ప్రపంచ వ్యాప్తంగా ఇతర భాషల వారికి అందుబాటులో వుంచుతున్నప్పుడు, రీమేకుల అవసరం ఏమిటనేది వ్యాపార దృష్టితో చూసినా పాయింటే.

కానీ రీమేకులు చేయకపోతే బాలీవుడ్ కి మనుగడ లేదన్నట్టు తయారైంది పరిస్థితి. దక్షిణ సినిమాల రీమేకుల మీద భారీగా ఆధారపడ్డ బాలీవుడ్, ఓటీటీ ట్రెండ్ లోనూ రీమేకులకి వెనుకడుగు వెయ్యడం లేదు. జెర్సీ, హిట్, మాస్టర్, సూరరై పొట్రు, విక్రమ్ వేదా, ఖైదీ, రాట్ససన్, అల వైకుంఠ పురంలో, ఎఫ్2, క్రాక్, నాంది, బ్రోచేవారెవరూరా ...ఇవి కొన్ని మాత్రమే హిందీలోకి రీమేక్ చేసిన, చేస్తున్న తెలుగు, తమిళ సినిమాలు. ఇవన్నీ మూల భాషలో వివిధ ఓటీటీల్లో విడుదలైనవే. వివిధ భాషల్లో సబ్ టైటిల్స్ తో పరిచయమైనవే. అయినా హిందీ రీమేకులుగానూ తిరిగి ఓటీటీల్లో దర్శమిస్తున్నాయి. సబ్ టైటిల్స్ తో మళ్ళీ ఇతర భాషల ముందుకొస్తున్నాయి!

అలాగే అయ్యప్పనుం కోషియమ్, లూసిఫర్, కప్పెలా, డ్రైవింగ్ లైసెన్స్, హెలెన్ మొదలైన ఓటీటీల్లో విడుదలైన మలయాళ సినిమాలు తెలుగులో రీమేకవుతున్నాయి. ఈ మలయాళం ఒరిజినల్స్ ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో ఓటీటీలో చూసేశారు. ఓటీటీలో విడుదలైన హిందీ అంధాధున్ కూడా తెలుగులోనూ (మాస్టర్), మలయాళంలోనూ రీమేక్ అయింది. తమిళ అసురన్ కూడా తెలుగులో నారప్పగా రీమేక్ అయింది. అయితే నారప్ప లాక్ డౌన్ కాలంలో థియేటర్ రిలీజ్ కాకుండా ఓటీటీలో విడుదలైంది. ఒరిజినల్ అసురన్ ని విడుదల చేసిన అమెజానే నారప్పని కూడా ఓటీటీలో రిలీజ్ చేసింది. ఒక సినిమాని ఒరిజినల్ గా దాని ఒరిజినాలిటీతో సబ్ టైటిల్స్ తో చూసే అవకాశం ఓటీటీలు కల్పిస్తున్నాక, మళ్ళీ ఆ స్థాయిలో వుండని దాని నకిలీ (రీమేక్) ని చూడమని మా మీద భారం ఎందుకు మోపుతున్నారన్నది ప్రేక్షకుల ప్రశ్న.

ఓటీటీ కంపెనీలు గానీ, రీమేకులు చేసే నిర్మాతలుగానీ రీమేకులు అవసరమా అని ఆలోచించడం లేదు, ప్రేక్షకులే విసిగిపోయి ప్రశ్నిస్తున్నారు. మేం థియేటర్లోనో ఓటీటీల్లోనో చూసేసిన సినిమాల్నే రీమేక్ చేసి మళ్ళీ థియేటర్లలో, ఓటీటీల్లో పడేస్తే ఎలా చూడాలని విమర్శిస్తున్నారు. మేం చందాలు కట్టింది ఓటీటీల్లో చూసిన సినిమాల రీమేకులే మళ్ళీ ఓటీటీల్లో చూడ్డానికేనా అని విరుచుకు పడుతున్నారు. ఇవే ప్రశ్నలు వేస్తూ ప్రింట్, వెబ్ మీడియాల్లో ఆర్టికల్స్ కూడా రాస్త్తున్నారు సినిమా జర్నలిస్టులు.

ఈ కామన్ సెన్సు నిర్మాతలకి, ఓటీటీలకి తట్టడం లేదు. తమ ధోరణి తమదే అన్నట్టు తోచిన రీమేకులు చేసుకుంటూ, ప్రేక్షకుల మీద డంప్ చేస్తూ పోతున్నారు. అయితే మలయాళ రంగం దాని ప్రత్యేకతని అది చాటుకుంటోంది. ఎన్నో మలయాళ సినిమాలు ఇతర భాషల్లో రీమేకవుతున్నా, ఏ ఇతర భాషల సినిమాల్నీ మలయాళ రంగం రీమేకే ఛేయడం లేదు. తమదైన ఒరిజినల్ కంటెంట్ తోనే సినిమాలు తీస్తున్నారు. ఓటీటీలకి, రీమేకులకి అమ్ముకుంటున్నారు. ఇలా మలయాళ పరిశ్రమలోకి బయటి నుంచి రెవెన్యూ రావడమేగానీ, మలయాళ పరిశ్రమలోంచి సొమ్ములు బయటికి పోవడం జరగడం లేదు. ఈ బిజినెస్ మోడల్ని ఇతరులూ అనుసరిస్తే ఒరిజినల్ కంటెంట్ తో సినిమాలు వస్తాయి. క్వాలిటీ కూడా పెరుగుతుంది.

పైకి కనిపించదు గానీ, అసలు మలయాళ సినీమాలే దేశంలో అన్ని భాషల సినిమాలనీ డామినేట్ చేస్తున్నాయి. మలయాళం సినిమాలని ఓటీటీల్లో అన్ని భాషల వాళ్ళూ చూస్తూంటారు కానీ మలయాళీలు ఇతర దేశీయ భాషల సినిమాల్ని చూడరు. వాళ్ళ టేస్టే సపరేట్. వాళ్ళ టేస్టుని వాళ్ళవైన సినిమాలతోనే తీర్చుకుంటారు.

రీమేకుల వెంటబడే నిర్మాతలకి సొంత భాష టేస్టు ఎక్కడుంటుంది? తెలుగు టేస్టు ఏమిటో చెప్పలేని పరిస్థితి. ఇటీవల ఒక ఫ్లాప్ సినిమా తీసిన తెలుగు దర్శకుడు ఓటీటీలో విడుదల చేస్తే 15 కోట్ల వ్యూస్ వచ్చాయని చెప్పారు! ఇది ప్రేక్షకుల టేస్టు అనుకోవాలా? అమెరికాలో వొళ్ళు మండిపోయిన ఒక ప్రేక్షకుడు చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది- కొరియన్ సినిమాలకి సబ్ టైటిల్స్ వేసి మా మీద పడేస్తే, మేం సినిమా చూడాలా, సబ్ టైటిల్స్ లో డైలాగులు చదువుకుంటూ కూర్చోవాలా? చేస్తే ఇంగ్లీసులో డబ్బింగ్ చేయండి, లేదంటే మూస్కోండి -అనేశాడు. ప్రపంచమంతటా ప్రేక్షకుల భావాలొకటే. బహుళ భాషల్లో ఓటీటీల్లో విడుదల చేస్తున్నామని సబ్ టైటిల్స్ వేసి వదిలేస్తే, బొమ్మ కింద స్క్రోల్ అయ్యే డైలాగులు చదువుకుంటూ సినిమా చూడాలంటే విసుగొచ్చే పనే.

బాలీవుడ్ కి ఏ బెదురూ లేదు. చూసిందే ప్రక్షకుల మీద మళ్ళీ చూడమని బలవంత పెడుతున్నామని వెనుకాడకుండా, మరిన్ని దక్షిణ రీమేకులకి పూనుకుంటున్నారు. మాస్టర్, అపరిచితుడు, కొలమావు కోకిల, ది గ్రేట్ ఇండియా కిచెన్, యూటర్న్ మొదలైనవి. బాలీవుడ్ ఇక ఒరిజినల్ గా ఆలోచించడం మానేసినట్టు కన్పిస్తోంది. ఇక ఇప్పుడు రీమేక్ చేస్తున్న సినిమాలే థియేటర్లలోనూ, తర్వాత ఓటీటీల్లో సబ్ టైటిల్స్ తోనూ ప్రేక్షకుల మీద దాడి చేస్తాయి. వీటి ఒరిజినల్స్ ని ప్రేక్షకులు ఓటీటీల్లో చూసేసినా సరే. ఇదేం వ్యాపార వ్యూహమో ట్రేడ్ పండిట్స్ కే అర్ధం గావడం లేదు.

First Published:  3 Oct 2022 10:57 AM IST
Next Story