Telugu Global
Cinema & Entertainment

Oppenheimer Movie: హార్రర్ ట్యాగ్ తో ‘ఒపెన్‌ హైమర్’ కి బాక్సాఫీసు ముప్పు?

Oppenheimer Movie: హాలీవుడ్ టాప్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ రూపొందిస్తున్న ‘ఒపెన్ హైమర్’ ని హార్రర్ మూవీగా అభివర్ణించడంతో 100 మిలియన్ డాలర్ల ఈ మూవీ రిస్కులో పడిందని ట్రేడ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

Oppenheimer Movie: హార్రర్ ట్యాగ్ తో ‘ఒపెన్‌ హైమర్’ కి బాక్సాఫీసు ముప్పు?
X

Oppenheimer Movie: హార్రర్ ట్యాగ్ తో ‘ఒపెన్‌ హైమర్’ కి బాక్సాఫీసు ముప్పు?

హాలీవుడ్ టాప్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ రూపొందిస్తున్న ‘ఒపెన్ హైమర్’ ని హార్రర్ మూవీగా అభివర్ణించడంతో 100 మిలియన్ డాలర్ల ఈ మూవీ రిస్కులో పడిందని ట్రేడ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఒక ప్రముఖ వ్యక్తి బయోపిక్ ఏమిటి, దాన్ని హార్రర్ మూవీ అనడమేమిటని ఎత్తిపొడుస్తున్నారు. జులై 21న విడుదలవుతున్న ఈ బయోపిక్ క్రిస్టఫర్ నోలన్ పునరాగమన చలన చిత్రంగా పేర్కొంటున్నారు. ఎందుకంటే 2020 లో అతను తీసిన సైన్స్ ఫిక్షన్ ‘టెనెట్’ ప్రేక్షకులకి అర్ధంగాక ఫ్లాపయింది. దాన్ని ‘ఆదిపురుష్’ కి లాగా రిపేర్లు చేసి ప్రేక్షకులకి అర్ధమయ్యేలా చర్యలు తీసుకోలేదు నోలన్. దీని తర్వాత ఇప్పుడు తాజా మూవీ ‘ఒపెన్ హైమర్’ నిత్య వార్తల్లో వుంటోంది. విడుదలకి ముందే సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీ అసలేంటో వివరాల్లోకి వెళ్తే.

జూలియన్ రాబర్ట్ ఒపెన్‌ హైమర్ (1904-1967) అనే అతను అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. ఈయన రెండవ ప్రపంచ యుద్ధంలో అలమోస్ లాబోరేటరీ డైరెక్టర్ గా వుంటూ, మొట్ట మొదటి అణ్వాయుధాల్ని రూపొందించిన అణుబాంబు పితామహుడుగా చరిత్రలో నమోదయ్యాడు.

1945 జూలై 16 న మొదటి అణుబాంబుని విజయవంతంగా పరీక్షించిన బృందంలో తను కూడా వున్నాడు. ఈ సందర్భంగా భగవద్గీతని ప్రస్తావిస్తూ “ఇప్పుడు నేను మృత్యువు నయ్యాను, ప్రపంచాల్ని నాశనం చేసే మృత్యువుని” అని వ్యాఖ్యానించాడు. దీంతో 1945 ఆగస్టులో జపాన్ నగరాలైన హీరోషిమా, నాగసాకి లపై అమెరికా అణుబాంబులేసి మరణహోమం సృష్టించిన చీకటి చరిత్ర తెలిసిందే.

ఈ చీకటి చరిత్రనే తెరకెక్కించాడు నోలన్. సీనియర్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ చరిత్రల్ని తీసేవాడు. ‘లింకన్’, ‘షిండ్లర్స్ లిస్ట్’ మొదలైనవి. ‘మెమెంటో’, ‘డార్క్ నైట్’, ‘ఇన్సెప్షన్’ లాంటి థ్రిల్లర్స్, సైన్స్ ఫిక్షన్స్ తీసే నోలన్ కూడా ‘డంకర్క్’, ‘ఒపెన్ హైమర్’ లాంటి రెండో ప్రపంచ యుద్ధ బీభత్సాల్ని తీస్తున్నాడు. అయితే ‘ఒపెన్ హైమర్’ బయోపిక్ ని విడుదలకి సిద్ధం చేసిన తను, దీన్ని హర్రర్ మూవీగా చెప్పడం స్థాయిని దిగజార్చినట్టు అవుతోందని అశేష అభిమానులు సైతం నిరాశని వ్యక్తం చేస్తున్నారు. హార్రర్ ట్యాగ్ తో నోలన్ 100 మిలియన్ డాలర్ల (820 కోట్ల రూపాయల) ఈ మెగా ప్రాజెక్టు బాక్సాఫీసు పనితీరుకి విఘాతం కల్గించేలా చేశాడని ట్రేడ్ వర్గాలు వాపోతున్నారు. ‘ఒపెన్ హైమర్’ ని ముందుగా చూసిన ఒక నిర్మాత భయానక సినిమాగా అభివర్ణించాడు. దీన్ని సమర్ధించాడు కూడా నోలన్. కథాంశంలోని విషయ తీవ్రత, నిహిలిస్టిక్ (శూన్యవాద) స్వరం, సినిమాని హార్రర్ జానర్ కింద పరిగణించడానికి దోహదం చేస్తున్నాయని పేర్కొన్నాడు. ఇలా అయితే అణుబాంబు సృష్టికర్త రాబర్ట్ జె ఒపెన్ హైమర్ బయోపిక్‌ని సూటిగా చూడాలనుకునే చాలా మంది వీక్షకులకి మూడాఫ్ అవచ్చని హెచ్చరికలు వెలువడుతున్నాయి.

నోలన్ ఇంతకి ముందు హార్రర్ ఫీలింగుతో సినిమాలు తీయలేదు. సాధారణంగా ఉద్విగ్నభరిత సైన్స్ ఫిక్షన్, యాక్షన్ సినిమాలకే కట్టుబడి వుండేవాడు. అలాటిది ‘ఒపెన్ హైమర్’ ఒక భయానక సినిమా అని సందేశం పంపడం అభిమానుల్ని గందరగోళానికి గురి చేస్తోంది. ట్రైలర్‌లు చూసిన ప్రీక్షకులు నోలన్ ట్యాగ్ ని తీసుకుని అదే దృష్టితో చూసినట్టయితే ట్రైలర్లు వికర్షిస్తాయని కూడా విశ్లేస్తున్నారు. ‘టెనెట్’ వైఫల్యం తర్వాత నోలన్‌ కి నిజంగా ‘ఒపెన్‌ హైమర్’ హిట్ మూవీగా చేతికందాలి. అలాటిది చారిత్రక ప్రాధాన్యం గల బయోపిక్ ని ఓసాధారణ హార్రర్ మూవీ స్థాయికి కుదించి వేసి చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసే విషయమే.

రెండో ప్రపంచ యుద్ధంలో వందల వేల మంది అమాయక జపనీయుల్ని బలిగొన్న అణుబాంబుని కనుగొనడాన్ని ఒపెన్ హైమర్ అనైతికంగా భావించలేదు. అతడి మస్తిష్కపు చీకటి కోణాల్ని ఆవిష్కరించే ఈ సినిమా ఎంత శాడిజంతో కూడుకుని వుంటుందోనని కొంతమంది వీక్షకులు దీనికి దూరంగా వుండవచ్చని కూడా అనుమానిస్తున్నారు.

‘ఒపెన్‌ హైమర్’ ఒక చారిత్రక బయోపిక్, ఇది నోలన్‌కి కొత్త జానర్. ఇది ‘ఇన్సెప్షన్’, ‘ఇంటర్‌ స్టెల్లార్’, ‘ది డార్క్ నైట్ ‘ ల వంటి తను తీసిన సినిమాల వలె అదే లక్ష్యిత ప్రేక్షకుల్ని ఆకర్షించకపోవచ్చనీ, దీని విజయం కోసం కొత్త ప్రేక్షకుల్ని కనుగొనవలసి వుంటుందనీ ట్రేడ్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే, ఎల్విస్ ప్రిస్లే లేదా మార్క్ జుకర్‌బర్గ్ ల వంటి ఇతర బయోపిక్‌ల మాదిరిగా, ఒపెన్‌ హైమర్ జీవిత చరిత్ర పుస్తక రూపంలో దాదాపుగా ప్రజాదరణ పొందలేదని కూడా చెప్తున్నారు.

పోతే, ‘ఒపెన్‌ హైమర్‌’ లో ఎక్కువ భాగం బ్లాక్ అండ్ వైట్ లో వుంటుంది. సాధారణ ప్రేక్షకులకి ఇది చాలా కళాత్మకంగా అనిపించి మెప్పించకపోవచ్చనీ, బాక్సాఫీసు రాబడిని దెబ్బతీయ వచ్చనీ వూహాగానాలు చేస్తున్నారు.

యూనివర్సల్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్‌గా, చిత్రీకరణ ఫిబ్రవరి 2022 చివరిలో ప్రారంభమైంది. ఐమాక్స్ 65 ఎం.ఎం. ఫార్మాట్ లో చిత్రీకరణ జరిపారు. ఇందులో ప్రధాన పాటర్ ఒపెన్ హైమార్ గా సిలియన్ మర్ఫీ నటించాడు. ఇతర పాత్రల్లో ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జ్యూనియర్ తదితరులు నటించారు. సందేహస్పదంగా మారిన ఈ క్రిస్టర్ నోలన్ లేటెస్ట్ మూవీ జాతకమేమిటో జులై 21 న తెలుస్తుంది.



First Published:  26 Jun 2023 4:41 PM IST
Next Story