రామ్ చరణ్ కు థ్యాంక్స్ - చిరంజీవి
గాడ్ ఫాదర్ ప్రీ-రిలీజ్ వేడుక సందర్భంగా సభా వేదికపై రామ్ చరణ్ కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు చిరంజీవి. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? గాడ్ ఫాదర్ కు చరణ్ కు సంబంధం ఏంటి?
మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్' సినిమా అక్టోబర్ 5న దసరా స్పెషల్ గా రిలీజవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ అనంతపురంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో చిరంజీవి స్పీచ్ ఆకట్టుకుంది. సుదీర్ఘంగా మాట్లాడిన చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా వెనక రామ్ చరణ్ ఉన్న విషయాన్ని చిరంజీవి బయటపెట్టారు.
గాడ్ ఫాదర్ సినిమాను ముందుగా రామ్ చరణ్ చూశాడట. ఆ సినిమాను తెలుగులో తన తండ్రి రీమేక్ చేస్తే బాగుంటుందని భావించి, చిరంజీవికి సూచించారట. అలా లూసిఫర్ సినిమా తనకు పరిచయమైందని తెలిపారు చిరంజీవి. దర్శకుడి ఎంపిక విషయంలో కూడా చరణ్ ప్రమేయం ఉందన్నారు.
లూసిఫర్ రీమేక్ బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలనే విషయంలో చాలా తర్జనభర్జనలు జరిగాయి. ఒక దశలో వీవీ వినాయక్ దాదాపు ఫిక్స్ అనుకున్నారు. కానీ తమిళ దర్శకుడు మోహన్ రాజా అయితే ఈ ప్రాజెక్టుకు పూర్తి న్యాయం చేస్తారని, రామ్ చరణ్ భావించారట. అలా చరణ్ చెప్పడంతో, మోహన్ రాజాను దర్శకుడిగా తీసుకున్నామని చిరంజీవి వెల్లడించారు.
ఇక ప్రాజెక్టులో సత్యదేవ్, పూరి జగన్నాధ్ లను తీసుకోవడం పూర్తిగా తన నిర్ణయమని చిరంజీవి తెలిపారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. వేదికపై ప్రసగించారు చిరంజీవి. ఆయన ప్రసంగం పూర్తయ్యేవరకు ఆడియన్స్ ఎవ్వరూ కదల్లేదు. గ్రౌండ్ లో తడుస్తూ, అలానే నిల్చున్నారు.