గాడ్ ఫాదర్ క్లయిమాక్స్ వెనక సీక్రెట్ అదే - చిరంజీవి
ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే, గాడ్ ఫాదర్ లో క్లయిమాక్స్ పార్ట్ ను పూర్తిగా మార్చేశారు. దీని వెనక జరిగిన ప్రహసనాన్ని చిరంజీవి బయటపెట్టారు.
గాడ్ ఫాదర్ సినిమా థియేటర్లలో హిట్టయింది. తాజాగా యూనిట్ సక్సెస్ సంబరాలు కూడా చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఓ కీలకమైన విషయాన్ని బయటపెట్టారు చిరంజీవి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ పార్ట్ పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
లూసిఫర్ క్లైమాక్స్ కు, గాడ్ ఫాదర్ క్లయిమాక్స్ కు చాలా తేడా ఉంటుంది. అందరం కలిసి ఆ పార్ట్ డిసైడ్ చేశామంటున్నారు చిరు. అంతేకాదు, లాస్ట్ మినిట్ లో రీషూట్ చేసిన విషయాన్ని కూడా బయటపెట్టారు.
"క్లైమాక్స్ కు వచ్చేసరికి సత్యదేవ్ పాత్ర మీద కోపం కంటే జాలి ఎక్కువగా కలుగుతుంది. ఎందుకంటే, అప్పటికే ఆ పాత్ర షాక్ లోకి వెళ్లి, డంగ్ అయిపోతుంది. అలా పూర్తిగా పడిపోయిన మనిషిని తుపాకీ తీసి కాల్చడం అంటే నాకే జాలేసింది. అది సరిగ్గా పండదని అనిపించింది. అందుకే సత్యదేవ్ క్రూరత్వాన్ని లాస్ట్ ఫ్రేమ్ వరకు చూపించాలనుకున్నాం. అప్పటికప్పుడు క్లైమాక్స్ ఆపేశాను. కొత్త క్లయిమాక్స్ రాయమని చెప్పాను. మోహన్ రాజా ఆఖరి నిమిషంలో క్లైమాక్స్ మార్చాడు. అది నాకు బాగా నచ్చింది. రిలీజ్ కు కేవలం 10-15 రోజుల ముందు ఆ క్లైమాక్స్ ను రీ-షూట్ చేశాం."
ఇలా క్లైమాక్స్ మార్పు వెనక అసలు విషయాన్ని తెలిపారు చిరంజీవి. అయితే చిరంజీవి ఈ విషయాన్ని గర్వంగా ప్రకటించినప్పటికీ, చాలామందికి ఆ క్లైమాక్స్ పార్టే నచ్చలేదు. చివరి 10-12 నిమిషాలు చాలా అసౌకర్యంగా ఫీల్ అయినట్టు ప్రేక్షకులతో పాటు, రివ్యూలు కూడా వచ్చాయి.