Chandra Mohan | సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
Chandra Mohan Passed away | సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏళ్లు.
టాలీవుడ్ మరో సీనియర్ నటుడ్ని కోల్పోయింది. చంద్రమోహన్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
కృష్ణా జిల్లా పమిడిముక్కలలో మే 23, 1943లో జన్మించారు చంద్రమోహన్. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. చదువులో చురుగ్గా ఉండే చంద్రమోహన్, మరోవైపు నాటకాల్లో కూడా అంతే చురుగ్గా ఉండేవారు. ఏడేళ్ల వయసు నుంచే నాటకాలు వేసేశారు. వయసుపెరిగే కొద్దీ ఆ ఆసక్తి ఇంకా పెరిగింది.
ఓవైపు చదువులో రాణిస్తూనే, మరోవైపు నాటకాల్లో కూడా మెప్పించారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసే టైమ్ కే నాటకాలు, సినిమాలపై ఆసక్తి మరింత పెరిగింది. దీంతో ఓవైపు చదువుకుంటూనే, మరోవైపు సినిమాల్లో ప్రయత్నించారు. అలా 23 ఏళ్లకే రంగులరాట్నం సినిమాతో నటుడిగా మారారు.
చంద్రమోహన్ హావభావాలు పలువురు దర్శకులకు నచ్చాయి. దీంతో వెంటవెంటనే అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా చదువు, ఉద్యోగం అన్నింటినీ పక్కనపెట్టి సినిమాల్లోకి వచ్చేశారు. హీరోలు, నటులంతా చెన్నై కేంద్రంగా తెలుగు సినిమాల్లో నటిస్తున్న రోజుల్లో.. చంద్రమోహన్ మాత్రం తమిళ క్యాంపుల్లోకి ఎంటరై, తమిళ సినిమాలు చేశారు. అప్పట్లో ఈ విషయాన్ని అంతా గొప్పగా చెప్పుకునేవారు.
తన కెరీర్ లో చంద్రమోహన్ పోషించని పాత్ర లేదు. కేవలం హీరోగానే కొనసాగాలని ఆయన అనుకోలేదు. ప్రతి మంచి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. అలా హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలు పోషించి మెప్పించారు.
తన కెరీర్ లో 175కి పైగా సినిమాల్లో హీరోగా నటించారు చంద్రమోహన్. ఇక నటుడిగా ఆయన నటించిన సినిమాలు 900కు పైగానే ఉన్నాయి. తన కెరీర్ లో ఎన్నో నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు చంద్రమోహన్. ఆయన నటించిన చివరి చిత్రం 2017లో వచ్చిన ఆక్సిజన్.
వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలతో కొన్నాళ్లుగా ఇంటికే పరిమితమైన చంద్రమోహన్, గుండె సంబంధిత సమస్యతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. సోమవారం హైదరాబాద్ లో చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహిస్తారు.
♦