పుష్ప -2 రిలీజ్‌ను ఆపలేం!
తేల్చిచెప్పిన తెలంగాణ హైకోర్టు
పుష్ప-2 సినిమా రిలీజ్‌ను ఆపలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లూ అర్జున, రష్మికా మంధన నటించిన పుష్ప -2 సినిమా టికెట్ చార్జీలకు భారీగా పెంచడంపై జర్నలిస్టు సతీశ్ కమాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను మంగళవారం విచారించిన హైకోర్టు ఇరువర్గాల వాదనలు విన్నది. బెనిఫిట్ షోతో పాటు సినిమా రిలీజ్ అయిన రెండు వారాల వరకు చార్జీలను భారీగా పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడం ప్రేక్షకుల జేబులు గుళ్ల చేయడమేనని పిటిషన్ వాదించారు. మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరను ఏకంగా రూ.800లకు పెంచడం అన్యాయమని వాదించారు. సినిమా విడుదలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతున్నందున విడుదలను ఆపాలని కోరడం సరికాదని సినిమా యూనిట్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు సినిమా రిలీజ్ కు ముందు విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.