నటి హనీ రోజ్‌పై వేధింపుల కేసులో వ్యాపారవేత్త అరెస్ట్
ప్రఖ్యాత మలయాళ నటి హనీ రోజ్ ఫిర్యాదు మేరకు ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మన్నూర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రముఖ మలయాళ నటి హనీ రోజ్‌పై వేధింపుల కేసులో ప్రముఖ బిజినెస్‌మెన్ బాబీ చెమ్మనూర్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణ చేస్తూ హనీ రోజ్ బాబీ చెమ్మన్నూర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కొచ్చి నుండి వయనాడ్ వచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం బాబీ చెమ్మన్నూర్‌ను అదుపులోకి తీసుకుంది. తదుపరి విచారణ కోసం అతనిని కొచ్చికి తరలించనున్నారు.ఈ కేసు విషయం గురించి ఇప్పటికే ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం మాటిచ్చారని తెలిపారు.
కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై ఓ వ్యాపారవేత్త అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని హనీరోజ్ ఆరోపించారు. వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్లు పెడుతున్నారని ఆరోపిస్తూ ఎర్నాకుళం పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. ఇప్పటికే 30మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు షాజీ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేశారు. హనీరోజ్ ఫిర్యాదు చేసిన సమయం నుంచి అతను పరారీలో ఉన్నాడు. వయనాడ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే, అంశంపై హనీరోజు కూడా స్పందించారు.