Telugu Global
Cinema & Entertainment

ప్రసార బిల్లుతో సృజనాత్మక స్వేచ్ఛకి చిల్లులే!

ప్రసార రంగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ లో ప్రవేశ పెట్టిన కొత్త ముసాయిదా చట్టాన్ని ఓటీటీ దిగ్గజాలు వ్యతిరేకిస్తున్నాయి.

ప్రసార బిల్లుతో సృజనాత్మక స్వేచ్ఛకి చిల్లులే!
X

ప్రసార రంగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ లో ప్రవేశ పెట్టిన కొత్త ముసాయిదా చట్టాన్ని ఓటీటీ దిగ్గజాలు వ్యతిరేకిస్తున్నాయి. ఓటీటీ రంగానికి భారం కాగలవని భయపడుతున్న ప్రసార సేవల (నియంత్రణ) బిల్లు- 2023ని ఆలస్యం చేయడానికి లేదా సవరణ కోరడానికి కేంద్ర ప్రభుత్వంపై సమిష్టిగా లాబీయింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. ముఖేష్ అంబానీకి చెందిన వయాకామ్ 18 తో బాటు ఇతర స్ట్రీమింగ్ కంపెనీలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

ఈ బిల్లు వివిధ సామాజిక సమూహాల సభ్యులతో, వ్యక్తిగత కంటెంట్ మూల్యాంకన కమిటీల ఏర్పాటుని ప్రతిపాదిస్తుంది. కంపెనీలు షోలు ప్రసారం చేసే ముందు వాటిని సమీక్షించి, సైన్ ఆఫ్ చేస్తాయి. దేశంలో అన్ని సినిమాలనూ సెన్సార్ బోర్డు సమీక్షించి సర్టిఫికేట్లని జారీ చేస్తోంది. కానీ ప్రసార కంటెంట్ కి ఈ నియంత్రణ లేదు. జియోసినిమా ఓటీటీని నడుపుతున్న వయాకామ్ 18 సహా నెట్‌ఫ్లిక్స్, ఇంకా మరికొన్ని ఇతర స్ట్రీమింగ్ కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రణాళికని చర్చించినట్లు తెలిసింది. ఈ బిల్లుపై అభ్యంతరాలు దాఖలు చేయడానికి డిసెంబర్ 10 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది.

కంటెంట్ కమిటీలు అధిక ప్రీ-స్క్రీనింగ్ తనిఖీలకి దారితీస్తాయని, ఆన్‌లైన్‌లోకి వెళ్ళే అధిక సంఖ్యలో కంటెంట్‌ని మొదట సమీక్షించాల్సిన అవసరం వున్నందున ఇది అమలు సమస్యలను పెంచుతుందనీ ఓటీటీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇలా ప్లాట్‌ఫారమ్‌లపై విస్తృత ప్రభుత్వ పర్యవేక్షణ గురించి ఆందోళన చెందుతున్నాయి. స్థూలంగా చెప్పాలంటే ఈ ముసాయిదా బిల్లు సృజనాత్మక స్వేచ్ఛని హరించేలా వుంది.

నెట్ ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమా మొదలైన ఓటీటీలు మన దేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ రంగం 2027 నాటికి 7 బిలియన్ల డాలర్ల మార్కెట్‌గా ఎదగనుందని మీడియా పార్టనర్స్ ఆసియా తెలిపింది. ఈ బిల్లు ఎదుగుతున్న మార్కెట్ కి బ్రేకులు వేస్తుందని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి ఓటీటీ వర్గాలు.

ఇంకా, ప్రస్తుతానికి ముసాయిదా బిల్లులో నిబంధనల్ని పాటించనందుకు విధించే జరిమానాలపై స్పష్టత లేనప్పటికీ, ప్రసార సేవల పరికరాలని స్వాధీనం చేసుకునే క్లాజ్ తో ఓటీటీలు చాలా నష్టపోయే పరిస్థితి వుంది. ప్రోగ్రామ్ కోడ్ లేదా అడ్వర్టైజ్‌మెంట్ కోడ్ ఉల్లంఘనకి సంబంధించిన ఫిర్యాదుల్ని వినడానికి బ్రాడ్‌కాస్ట్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు కూడా ప్రశ్నార్ధకంగా మారింది, ఎందుకంటే ఇందులో ప్రభుత్వ ప్రతినిధులే వుంటారు.

ఈ బిల్లు కంటెంట్ తయారీపై, దాని స్వయంప్రతిపత్తిపై ప్రభావం చూపుతుందని, సృజనాత్మక స్వేచ్చని భంగపరిచి అభి వృద్ధి పథాన్ని దారితప్పిస్తుందనీ నిపుణులు పేర్కొంటున్నారు.

బిల్లు ప్రకారం, మూల్యాంకన కమిటీ (సెంట్రల్ ఎసెస్మెంట్ కమిటీ) కి సలహా ఇచ్చేందుకు మీడియా, వినోద, ప్రసారాల, బాలల, వికలాంగుల హక్కుల రంగాలకు చెందిన ఐదుగురు ప్రభుత్వ సభ్యులు, మరో ఐదుగురు ప్రభుత్వం నామినేట్ చేసిన స్వతంత్ర వ్యక్తులూ వుంటారు. పూర్తిగా ప్రభుత్వ అదుపులో వుండే ఈ కమిటీ కూర్పు, నియామకాల పట్ల కూడా అభ్యంతరాలున్నాయి.

ప్రస్తుతం ఓటీటీలు ఐటీ రూల్స్, 2021 చట్టం నియంత్రణలో వున్నాయి. స్వయం నియంత్రణ కోసం మార్గదర్శకాలు, అలాగే డిజిటల్ కంటెంట్ కోసం నైతిక నియమావళీ ఈ చట్టంలో వున్నాయి. ఇటువంటి ప్లాట్‌ఫారమ్‌లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు. కొత్త బిల్లుతో ఇవన్నీ కోల్పోతారు.

ఓటీటీ స్ట్రీమింగ్ యాప్‌ల కోసం ప్రాథమిక రేటింగ్‌లు, మార్గదర్శకాలు వుండవచ్చని, అయితే కేబుల్ టీవీ వలెనే నియంత్రణ అవసరం లేదనీ, ప్రభుత్వం సృజనాత్మకతకి ఆటంకం కలిగించకూడదనీ, ఏ కంటెంట్ చూడాలన్నది వీక్షకుల అభీష్టానుసారాన్ని బట్టి వుంటుందనీ, కనుక కంటెంట్ క్రియేటర్లకి స్వేచ్ఛని ఇవ్వాలనీ, ఫిల్టర్‌ల ఏర్పాటు వుంటుంది గనుక వీక్షకులు ఆ కంటెంట్ ని చూడవచ్చు, లేదా తిరస్కరించవచ్చనీ న్యాయనిపుణులు కూడా పేర్కొంటున్నారు.

ఈ వివాదాస్పద బిల్లు పై ఓటీటీల లాబీయింగ్ ఫలిస్తుందా లేదా, కోరిన సవరణలకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తుందా లేదా 10 వ తేదీ తర్వాత తెలుస్తుంది. ఓటీటీల భవిష్యత్ ముఖచిత్రం ఎలా వుండబోతోందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

First Published:  4 Dec 2023 11:00 AM IST
Next Story