Telugu Global
Cinema & Entertainment

వయసు ముదిరినా బాక్సాఫీసులు అదురుతున్నాయి!

ఓర్మాక్స్ మీడియా ప్రచురించిన తాజా రిపోర్టు ప్రకారం 2023 సంవత్సరం అత్యధిక బాక్సాఫీసు వసూళ్ళు సాధించిన సంవత్సరంగా నిలుస్తుందని తెలుస్తోంది.

వయసు ముదిరినా బాక్సాఫీసులు అదురుతున్నాయి!
X

వయసు ముదిరినా బాక్సాఫీసులు అదురుతున్నాయి!

ఓర్మాక్స్ మీడియా ప్రచురించిన తాజా రిపోర్టు ప్రకారం 2023 సంవత్సరం అత్యధిక బాక్సాఫీసు వసూళ్ళు సాధించిన సంవత్సరంగా నిలుస్తుందని తెలుస్తోంది. ఐతే ఈ బాక్సాఫీసు ఘన విజయాలు ఎవరో యంగ్ స్టార్ సినిమాలతో కాదు, వయసు మళ్ళిన సీనియర్ స్టార్స్ తోనే కావడం గమనార్హం. రజనీ కాంత్, షారూఖ్ ఖాన్, సన్నీ డియోల్ ముగ్గురూ యంగ్ స్టార్స్ కి నిద్రపట్టకుండా చేస్తున్నారు. ఈ ట్రెండ్ జనవరిలో షారుఖ్ ‘పఠాన్’ తో ప్రారంభమైంది. ఆగస్టు- సెప్టెంబర్ నెలల్లో ‘జైలర్’, ‘గదర్ 2’, ‘జవాన్’ లతో ఉధృతంగా కొనసాగుతోంది. జైలర్’ తో 72 ఏళ్ళ రజనీ కాంత్, ‘గదర్ 2’ తో 62 ఏళ్ళ సన్నీడియోల్, ‘జవాన్’ తో ‘57 ఏళ్ళ షారుఖ్ ఖాన్ ముగ్గురూ అత్యంత భారీ బాక్సాఫీసు విస్ఫోటనాలతో ప్రకంపనాలు సృష్టిస్తున్నారు!

ఆగస్టు- సెప్టెంబర్ మాసాల్లో పై మూడు సినిమాలూ బ్యాక్ టు బ్యాక్ విడుదలయ్యాయి. భారీ మొత్తంలో కలెక్షన్లు సంపాదించి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాయి. వీటిలో మొదటిది సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’. ఆ తర్వాత సన్నీ డియోల్ నటించిన ‘గదర్ 2’ విడుదలైంది. ఇప్పుడు షారుక్‌ ఖాన్‌ నటించిన ‘జవాన్‌’ సంచలనం సృష్టిస్తోంది. ఈ మూడు సినిమాలు ప్రేక్షకుల్ని థియేటర్లకి పరుగెత్తించి ఎన్నో బెంచ్ మార్క్స్ ని సెట్ చేశాయి. ఈ ముగ్గురు పాపులర్ స్టార్స్ సినిమాలు కొల్లగొట్టిన వసూళ్ళు చూస్తే- ‘జైలర్’ రూ. 650 కోట్లు, ‘గదర్ 2’ రూ. 680 కోట్లు, ‘జవాన్’ రూ. 710 కోట్లు నేటికి వసూలు చేసి, ఇంకా పరుగు ఆపడం లేదు.

యంగ్ స్టార్స్ సినిమాలు శుక్రవారం విడుదలై ఆదివారం దాటితే కలెక్షన్లు డ్రాపవుతున్న క్రమంలో సీనియర్ స్టార్లు వారం తర్వాత వారం ఆగకుండా బ్యాంగులిస్తున్నారు. ‘జైలర్’ తొలిరోజు రూ.48.35 కోట్లు వసూలు చేసి, మొదటి వారం రూ. 235.85 కోట్లు రాబట్టింది. రెండో వారంలో రూ.62.95 కోట్లు, మూడో వారంలో రూ.29.75 కోట్లు, నాలుగో వారంలో మరో రూ.13.01 కోట్లూ వసూలు చేసింది. ఇవి ఆలిండియా కలెక్షన్స్ మాత్రమే. ఓవర్సీస్ కూడా కలుపుకుంటే మొత్తం వసూళ్ళు రూ. 650 కోట్లు.

‘గదర్ 2’ తొలి రోజు రూ. 40.1 కోట్ల రూపాయల అద్భుతమైన ఓపెనింగ్‌తో ప్రారంభమై, తొలి వారంలో రూ.23 కోట్లు వసూలు చేసింది. రెండో వారంలో రూ.8 కోట్లు, మూడో వారంలో రూ.7 కోట్లు, నాలుగో వారంలో రూ.1.08 కోట్లు, ఐదో వారంలో రూ.0.80 కోట్లూ రాబట్టింది. ఓవర్సీస్ కూడా కలుపుకుంటే మొత్తం రూ. 690 కోట్లు.

సెప్టెంబర్ 7 న విడుదలైన ‘జవాన్’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్లు, రెండవ రోజు రూ. 109 కోట్లు, మూడో రోజు రూ. 140 కోట్లు, నాలుగో రోజు రూ.157 కోట్లు, ఐదో రోజు రూ.52.39 కోట్లు, ఆరో రోజు రూ.38.21 కోట్లు, ఏడో రోజు రూ.34.06 కోట్లు, ఎనిమిదో రోజు రూ.28.79 కోట్లు, తొమ్మిదో రోజు రూ.26.35 కోట్లూ వసూలు చేసింది. ఇంకా రన్నింగ్ లో వుంది.

సైజింగ్ ది సినిమా : 2023 రిపోర్టు ప్రకారం, దేశంలో సినిమాల్ని చూసే ప్రేక్షకుల వయస్సు వేగంగా తగ్గుతోందని తెలుస్తోంది. థియేటర్ ప్రేక్షకుల మధ్యస్థ వయస్సు మహమ్మారికి ముందు 27.5 సంవత్సరాల నుంచి 24.1 సంవత్సరాలకి పడిపోయింది. ‘గదర్ 2’ కి తరలివస్తున్న చాలా మంది ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ 2001లో విడుదలైనప్పుడు పుట్టలేదు. ఈ సినిమా తర్వాత తెరమరుగైన సన్నీ డియోల్ ఎవరో వాళ్ళకి తెలియదు. అయినప్పటికీ, ఇప్పుడు 24 సంవత్సరాల కుర్రకారు వయసు మీరిన సన్నీ డియోల్ ‘గదర్ 2’ ని బ్లాక్ బస్టర్ చేశారు. ఈ సినిమాలో వాళ్ళని అంతగా ఆకర్షించేదేమిటి? ఇటీవల హిందీ సినిమాల్లో కరువైన మాస్ మసాలా. హిందీ సినిమాల తీరు తెన్నులు పూర్తిగా మారిపోయి, పాత మాస్ మసాలా ఏంటో తెలియకుండా పెరిగిన తరం వీరిది. అందుకని ‘గదర్ 2’ కొత్తగా అన్పిస్తోంది.

సౌత్ లో రజనీకాంత్ మాస్ మసాలాలు చూసి చూసి వున్న యువతరం, దీనికి భిన్నంగా ‘జైలర్’ లో రజనీకాంత్ రియలిస్టిక్ గా కనిపించడంతో ఇది కొత్తగా ఆకర్షిస్తోంది. ఇదే మళ్ళీ షారుఖ్ ‘జవాన్’ ని చూస్తే, ఇది కూడా ‘గదర్ 2’ లాగా ఫుల్లుగా లోడ్ చేసిన మాస్ మసాలా!

ఇలా సీనియర్ స్టార్లు మాస్ మసాలాలు/ రియలిస్టిక్కులు రెండిటితో అటూ ఇటూ వాయించి వదిలారు. అయితే ఈ సీనియర్ సూపర్ స్టార్ల అద్భుతమైన విజయాలతో స్టార్ హీరోయిన్లు మూగబోయారని గమనించాలి. స్త్రీ పాత్రలకి స్థానం లేకుండా పోయింది. భారీ ఫార్ములా యాక్షన్ సినిమాలైన పై మూడింట్లో హీరోలదే వీర హీరోయిజం. సీనియర్ స్టార్లు అనుభవజ్ఞులుగా కనిపించడంతో కుర్రకారు వాళ్ళని మార్గదర్శకుగా భావించుకుని అదరిస్తున్నట్టుంది!

First Published:  17 Sept 2023 10:59 AM GMT
Next Story