Telugu Global
Cinema & Entertainment

సౌత్ సినిమాల ఆదాయం 96 శాతం పెరిగింది!

2022 లో దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ ఆదాయం 96% పెరిగి 7,800 కోట్లకు చేరుకుంది. ఇది మునుపెన్నడూ లేని రికార్డు.

Box Office Collections: South Indian film industry revenue jumps 96% to over ₹7,800-cr in 2022
X

సౌత్ సినిమాల ఆదాయం 96 శాతం పెరిగింది!

2022 లో దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ ఆదాయం 96% పెరిగి 7,800 కోట్లకు చేరుకుంది. ఇది మునుపెన్నడూ లేని రికార్డు. ఇందులో తెలుగు సినిమాలు 2,500 కోట్లు, తమిళ సినిమాలు 2,950 కోట్లు, కన్నడ సినిమాలు 1,570 కోట్లు, మలయాళ సినిమాలు 816 కోట్లూ ఆర్జించాయి. భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) విడుదల చేసిన నివేదికలో ఆసక్తి కల్గించే అంశాలున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దక్షిణ భారత చలనచిత్ర వ్యాపారంలో తమిళ, తెలుగు పరిశ్రమలు ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చాయనీ, కానీ 2022 లో ఇతర భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ సినిమాల విడుదలలతో అదంతా మారిపోయిందనీ నివేదిక పేర్కొంది.

'సౌత్ ఇండియా: సెట్టింగ్ బెంచ్ మార్క్స్ ఇన్ మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్' పేర విడుదల చేసిన నివేదికలో, తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలతో దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ ఆదాయాలు 2021లో 3,988 కోట్ల నుంచి 2022లో దాదాపు రెట్టింపు 7,836 కోట్లకు చేరుకున్నాయనీ, అయితే 2022 లో 15,000 కోట్లు ఆదాయం వుండబోతోందని అంచనా వేశామనీ సిఐఐ పేర్కొంది.

నివేదిక ప్రకారం, 2022 లో తెలుగు తమిళ పరిశ్రమల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ, కన్నడ సినిమాలు 'కెజిఎఫ్: చాప్టర్ 2', 'కాంతారా' కన్నడ సినిమా మార్కెట్ పరిధిని పునర్నిర్వచించాయి. అయితే మలయాళ సినిమా దేశీయ, విదేశీయ థియేటర్ మార్కెట్‌లలో బాగా అభివృద్ధి చెంది, ఎన్నడూ ఊహించని బాక్సాఫీసు వసూళ్ళని నమోదు చేసింది.

తెలుగులో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘ట్రిపులార్’ ఒక్కటే 1,200 కోట్లు సంపాదించింది. అదే తమిళంలో కమల్ హాసన్ ‘విక్రమ్’, మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1’ బ్యాక్-టు-బ్యాక్ హిట్లు తమిళ సినిమా కలెక్షన్లని పెంచాయి. దేశీయంగా సంబంధిత రాష్ట్ర థియేట్రికల్ ఆదాయాలు, ఇతర రాష్ట్రాల్లో థియేటర్ ఆదాయాలు, ఓవర్సీస్ థియేట్రికల్ రాబడులు, శాటిలైట్ హక్కులు, డిజిటల్ లేదా ఓటీటీ హక్కులు, ఇతర భాషల డబ్బింగ్ హక్కులూ సహా, బహుళ స్ట్రీమ్‌ల నుంచి ఆదాయాల్ని జోడించడం ద్వారా ఆయా భాషల సినిమా పరిశ్రమలు ఆదాయాన్ని పొందుతాయి.

2022 లో థియేట్రికల్, ఓటీటీ ప్లాట్ ఫారంలు కలుపుకుని నాలుగు దక్షిణ భారత భాషల్లో మొత్తం 916 సినిమాలు విడుదలయ్యాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, మలయాళంలో అత్యధికంగా 259 సినిమాలు విడుదల అయ్యాయి. తెలుగులో 227, తమిళంలో 225, కన్నడలో 207 సినిమాలు విడుదలై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

టాలీవుడ్, కోలీవుడ్ , శాండల్‌వుడ్ మాలీవుడ్ లుగా పెరుబడ్డ తెలుగు తమిళ కన్నడ మలయాళ సినిమా పరిశ్రమలు, .చాలా కాలం పాటు స్వతంత్రంగా అభివృద్ధి చెందినప్పటికీ, కళాకారుల, సాంకేతిక నిపుణుల స్థూల మార్పిడి, అలాగే ప్రపంచీకరణ అన్నవి కొత్త గుర్తింపుని కల్పించడంలో సహాయపడ్డాయి. 2010 నాటికి దేశంలో 10,167 సినిమా థియేటర్లు వుంటే, దక్షిణ భారతదేశంలో 6320 థియేటర్లు, అంటే 62 శాతం వున్నాయి.

2013 ఆర్థిక సంవత్సరానికి, నాలుగు దక్షిణ భాషల సంయుక్త నికర బాక్సాఫీసు ఆదాయం భారతీయ సినిమా మొత్తం మొత్తం నికర ఆదాయంలో 36 శాతంగా వుంది. 2021లో, నాలుగు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమల సంయుక్త దేశీయ బాక్సాఫీస్ మొత్తం 2,400 కోట్లకు చేరుకుంది. ఇది హిందీ చలనచిత్ర మార్కెట్‌ ని అధిగమించింది, హిందీ బాక్సాఫీసు వసూళ్ళు 800 కోట్లు మాత్రంగానే వున్నాయి. 2021లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ రాబడి పరంగా భారతదేశంలో అతిపెద్ద చిత్ర పరిశ్రమగా అవతరించింది.

2022 లో దక్షిణ సినిమాలు నార్త్ ని తలదన్నే కంటెంట్ తో, కలెక్షన్స్ తో మొత్తం భారతీయ బాక్సాఫీసుని డామినేట్ చేశాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ పరిశ్రమలు కోవిడ్ తర్వాత పుంజుకున్నందున ఈ సంవత్సరాన్ని అత్యంత ఉత్పాదక సంవత్సరంగా పేర్కొన వచ్చు. ఉత్తరాది ప్రేక్షకుల నుంచి ఎక్కువ దృష్టిని ఆకర్షించినందున భారతీయ సినిమాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

ట్రిపులార్, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, పోన్నియిన్ సెల్వన్ పార్టు 1, విక్రమ్, వాలిమై, బీస్ట్, కేజీఎఫ్ 2, కాంతారా...మొదలైనవి 2022 ని శిఖరాగ్ర స్థాయికి తీసికెళ్ళాయి. ఇప్పుడు 2023 లో ఇదే రికార్డుని సాధిస్తాయా లేదా అన్నది వేచి చూడాలి. ఎందుకంటే ఈ సంవత్సరం భారీ ఎత్తున పానిండియా సినిమా లున్నాయి మరి.

First Published:  11 May 2023 12:40 PM IST
Next Story