Telugu Global
Cinema & Entertainment

Bollywood: హిందీలోనూ సంక్షోభంలో చిన్న సినిమా!

Bollywood's Small Budget Movies: టాలీవుడ్ లో లాగే బాలీవుడ్ లోనూ చిన్న-బడ్జెట్ సినిమాలు సంక్షోభ స్థితిలో వున్నాయి.

Bollywood small-budget Movies are in crisis mode
X

హిందీలోనూ సంక్షోభంలో చిన్న సినిమా!

టాలీవుడ్ లో లాగే బాలీవుడ్ లోనూ చిన్న-బడ్జెట్ సినిమాలు సంక్షోభ స్థితిలో వున్నాయి. థియేట్రికల్ విడుదలలు ఖరీదైన వ్యవహారంగా మారడం, పెద్ద స్టార్స్ నటించని సినిమాలకి ప్రేక్షకులు కనిపించక పోవడంతో, బాక్సాఫీసు అంకెలు చూసి తప్ప ఓటీటీలు ముందుకు రాకపోవడంతో చిన్న, మధ్యస్థ-బడ్జెట్ హిందీ సినిమాలు సంక్షోభంలో వున్నాయి.

కోవిడ్ మహమ్మారికి పూర్వం ఈ పరిస్థితి లేదు. కోవిడ్ మహమ్మారికి పూర్వం సూపర్ హిట్ల పర్వంతో శిఖరం మీదున్న ఆయుష్మాన్ ఖురానా, తాప్సీ పన్ను, రాజ్ కుమార్ రావ్ లు మహమ్మారి అప్పటి నుంచి ఇప్పటికీ ఫ్లాప్స్ తో కోలుకోలేక పోతున్నారు. 2019 లో ఆయుష్మాన్ ఖురానా నటించిన మూడు సినిమాలు- ‘ఆర్టికల్ 15’ : బడ్జెట్ 30 కోట్లు, బాక్సాఫీసు 90 కోట్లు; ‘డ్రీమ్ గర్ల్’ : బడ్జెట్ 28 కోట్లు, బాక్సాఫీసు 200 కోట్లు; ‘బాలా’ బడ్జెట్ 32 కోట్లు, బాక్సాఫీసు 172 కోట్లుతో తన రేంజిలో ఒక స్టార్ డమ్ ని ఏర్పాటు చేసుకున్న ఆయుష్మాన్ ఖురానా, 2020 నుంచీ గ్రాఫ్ పతనమవుతూ 2022 చివరిలో ‘ఏన్ యాక్షన్ హీరో’ తో నిర్మాతలు అయోమయంలో పడిపోయారు.

‘ఏన్ యాక్షన్ హీరో’ బడ్జెట్ 30 కోట్లు అయితే, బాక్సాఫీసు 41 కోట్లు; దీనికి ముందు ‘డాక్టర్ జీ’ 40 కోట్ల బడ్జెట్ కి 28 కోట్ల బాక్సాఫీసు, ‘చండీఘర్ కీ ఆషికీ’ 30 కోట్ల బడ్జెట్ కి 41 కోట్లు బాక్సాఫీసుతో అతడి బుల్లి స్టార్ డమ్ పడిపోయింది. ఇదే పరిస్థితి తాప్సీ, రాజ్ కుమార్ రావ్ లది. 2022 లో రాజ్ కుమార్ రావ్ ‘హిట్ -ది ఫస్ట్ కేస్’ బడ్జెట్ 30 కోట్లకి, 12 కోట్లు మాత్రమే బాక్సాఫీసు. తాప్సీ పన్ను ‘దొబారా’ 30 కోట్ల బడ్జెట్ కి, కేవలం 7 కోట్లు బాక్సాఫీసు వచ్చింది.

ఇక ఇంకా చిన్న హీరోల సినిమాల పరిస్థితి చెప్పక్కర్లేదు. ఇప్పుడు చిన్న, మధ్యస్థ-బడ్జెట్ సినిమాలు థియేటర్లలో 70-80 కోట్ల రూపాయల వ్యాపారం చేసే ప్రసక్తే లేదని స్పష్టమై పోతోంది. దీంతో బాలీవుడ్ టాప్ నిర్మాతలు వీటికి డబ్బులు పెట్టడం లేదు. వీటిని చూడడానికి ప్రేక్షకులూ థియేటర్లకి రావడంలేదు.

చిన్న సినిమాల వ్యాపారం ఓటీటీల వైపుకు వెళ్ళిపోయింది. లాక్ డౌన్ సమయంలో ఓటీటీలు ఎగబడి వీటిని చేపట్టినా, ఆ తర్వాత ఇప్పుడు షరతులు పెడుతున్నారు. ముందుగా థియేటర్లో విడుదల చేస్తేనే ఓటీటీకి ఛాన్స్ అంటున్నారు. ఈ పరిస్థితి తెలుగులోనూ తలెత్తింది. హిందీలో చిన్నా పెద్దా తేడా లేకుండా సినిమాలు బాక్సాఫీసు విజయాలు చవిచూసిన పరిస్థితుల్లో, 60-70 కోట్లు వసూలు చేసే చిన్న సినిమాలు 10 శాతం వసూళ్ళకి పడిపోయాయి.

పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాల రాబడిని అంచనా వేయడం కష్టం. పెద్ద సినిమాలకి థియేట్రికల్ విడుదలకి ముందే శాటిలైట్, డిజిటల్ (ఓటీటీ) హక్కుల విక్రయం పూర్తవుతుంది. అదికూడా భారీ స్థాయిలో వుంటుంది. ఉదాహరణకి షారూఖ్ ‘పఠాన్’ శాటిలైట్ -ఓటీటీ హక్కులు 150 కోట్లకి విక్రయించారు. ఇంకా రానున్న ‘జవాన్’ కి 250 కోట్లు. చిన్న సినిమాలకి ఈ సౌకర్యముండదు.

వివిధ భాషల్లో చిన్న, మధ్యస్థ-బడ్జెట్ సినిమాలు 1000 వరకూ విడుదలవుతున్నాయి. పెద్ద సినిమాలు ఓ డజను మాత్రమే విడుదలవుతాయి. పెద్ద సినిమాలంటే ఇదివరకులా మాస్ మసాలా- సాంగ్ అండ్ డాన్సులు కాకుండా, ట్రిపులార్, కేజీఎఫ్ సినిమాలు, లేదా బ్రహ్మాస్త్ర వంటి సినిమాలు ఆకాశాన్ని తాకి ప్రేక్షకులకి అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నాయి. చిన్న సినిమాలేం చూపిస్తాయి. ప్రేక్షకుల్ని థియేటర్ కి రప్పించాలంటే చిన్న సినిమాలకి కంటెంటే ప్రధానమనుకునే రోజులు కూడా గతిస్తున్నట్టు వుంది పరిస్థితి. ప్రేక్షకులు దృశ్య, శబ్ద, తారాగణ వైభవాలకి ఆకర్షితులవుతున్నారు. ఇవి పెద్ద సినిమాలే అందిస్తాయి. ప్రేక్షకులే చిన్న సినిమాలని ఓటీటీ సినిమాలుగా భావించే పరిస్థితి వచ్చింది.

సంక్రాంతికి పెద్ద సినిమాలు కాకుండా రెండు చిన్న సినిమాలు విడుదల చేస్తే ఇంట్లోనే టీవీలు చూస్తూ పండగ చేసుకుంటారే తప్ప చిన్న సినిమాల పోస్టర్లు కూడా చూడరు. లాక్ డౌన్లు ఎత్తేశాక పూర్తిగా థియేటర్లు తిరిగి తెరిచిన తొమ్మిది నెలల తర్వాత, మహమ్మారికి ముందు స్థాయులతో పోలిస్తే, 70-80 శాతం ప్రేక్షకుల రికవరీని చూశామని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు చెప్తున్నాయి. ఈ రికవరీ పెద్ద సినిమాలతోనే సాధ్యమైంది. ప్రేక్షకులు ఇంట్లో ఏ సినిమాలు చూడాలి, థియేటర్‌లో ఏ సినిమాలు చూడాలనే అంశం పట్ల చాలా స్పష్టతతో వున్నారు.

హాలీవుడ్ ఈ సమస్యని ఐదారు సంవత్సరాల క్రితమే ఎదుర్కోవడం ప్రారంభించిందని అంటున్నారు. మనదేశంలో ఇప్పుడు మొదలైంది. చిన్న సినిమాలు బి, సి సెంటర్లలో పెద్దగా విడుదల కావు. పెద్ద సినిమాలే చొచ్చుకు వెళతాయి. దేశంలో మొత్తం కుటుంబాలు 25 కోట్లు అయితే, టీవీలున్న కుటుంబాలు 15 కోట్లు. అంటే టీవీలకి 60 కోట్లమంది వీక్షకులున్నట్టు. ఓటీటీలకి 40 కోట్ల మంది వున్నారు. అంటే ఓటీటీ ఇంకా బి, సి సెంటర్స్ కి చొచ్చుకెళ్ళాల్సి వుంది. ప్రాంతీయ భాషల్లో కంటెంట్ ని అందించడానికి ఇందుకే వెర్నాకులర్ ఓటీటీలు వెలుస్తున్నాయి. ఇది జరిగితే చిన్న సినిమాలకి ఇక ఎప్పటికీ బి, సి సెంటర్లు కూడా వుండవు.

చిన్న సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్లకి రాకపోవడాన్ని నిపుణులు బహుముఖాలుగా చూస్తున్నారు-ఇప్పుడు అంతర్జాతీయ కంటెంట్‌ కి అలవాటు పడిన మహమ్మారి అనంతర వివేకం గల ప్రేక్షకులు ఒక కారణం, మారుతున్న కాలానికి అనుగుణంగా లేని హిందీ సినిమాల కంటెంట్ ఇంకో కారణం, థియేట్రికల్ ఓటీటీలో ప్రీమియర్ చేయడానికి ఓ నాలుగు వారాల సమయం మరో కారణం, 40కి పైగా గల ఓటీటీ యాప్‌లు, లీనియర్ టీవీ, స్పొర్ట్స్, ఇతర ఈవెంట్‌లు మరింకో కారణం- ఇన్ని కారణాలతో చిన్న సినిమాల వైపు చూడడం లేదని నిపుణుల వివరణ.

ఇక బాలీవుడ్ లో చిన్న సినిమాల విడుదల వొక ఖరీదైన వ్యవహారంగా మారింది. ప్రచారం కోసమే 5-10 కోట్లు వెచ్చించాలి. దీనికి మార్కెటింగ్ ఖర్చులు, నిర్మాణేతర ఖర్చులూ కలిపి రూ. 25-30 కోట్ల వరకూ అవుతుంది. అంటే సినిమా బడ్జెట్‌లో దాదాపు 25 శాతం. ఈ 25 శాతాన్ని ఓటీటీ బాసులు పరిగణించరు. పైగా థియేటర్ లో విడుదలై, ప్రచారం జరిగిన సినిమాలతోనే రమ్మంటున్నారు. ఈరోజుల్లో ఒక చిన్న లేదా మధ్యస్థ-బడ్జెట్ సినిమా థియేట్రికల్‌గా బాగా పోవడం చాలా ముఖ్యం. లేకపోతే అరకొర రేట్లకి ఓటీటీలకి అమ్ముకోవడమే. ఇది ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలకి ప్రతిధ్వని అని అంటున్నారు.

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, బిగ్ ఫైవ్ స్టూడియోలైన -యూనివర్సల్ పిక్చర్స్, పారామౌంట్ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్, వాల్ట్ డిస్నీ పిక్చర్స్, కొలంబియా పిక్చర్స్ వంటి అన్ని ప్రధాన మీడియా కంపెనీలు లాభదాయకతపై దృష్టి సారిస్తున్నాయి. గత ఏడాది అమెరికా క్యాపిటల్ మార్కెట్స్ లో సంక్షోభం తర్వాత ఓటీటీ కంటెంట్‌పై డబ్బుని తగలేయరాదని నిశ్చయించుకున్నారు. తత్సంబంధ ఉద్యోగుల్నితొలగించే ప్రణాళికలు కూడా చేపట్టారు. వార్నర్ బ్రదర్స్ ‘హెచ్ బీఓ మ్యాక్స్ ఇండియా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రారంభించే ఆలోచనని కూడా విరమించుకుంది.

ఓటీటీ వీక్షణకు సరిపోయే దానికి విభిన్నమైన కంటెంట్‌ని సృష్టించడం, మార్కెటింగ్ ఖర్చులు తగ్గించుకుని పరిమిత థియేటర్ విడుదల వంటి వ్యూహాలతో ప్రయోగాలు చేయడమే ముందున్న మార్గమని నిపుణులు అంటున్నారు. ఇది కూడా ఎంతవరకు కరెక్టో చెప్పలేం. అయితే ఒకటే ప్రశ్న. చిన్న సినిమాలకి ఈ ప్రపంచ వ్యాప్త సంక్షోభాన్ని తెలుగు నిర్మాతలు గుర్తించే వందల కొద్దీ సినిమాలు తీస్తున్నారా అన్నది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. చాలా మందికి సంక్షోభం గురించే తెలీదు.

First Published:  20 Jan 2023 1:23 PM IST
Next Story