Telugu Global
Cinema & Entertainment

ఇక యుద్దమే అంటున్న బాలీవుడ్ రచయితలు!

బాలీవుడ్‌లో కొంత కాలంగా ఒక సమస్య నలుగుతోంది. బాలీవుడ్ రచయితలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు.

ఇక యుద్దమే అంటున్న బాలీవుడ్ రచయితలు!
X

బాలీవుడ్‌లో కొంత కాలంగా ఒక సమస్య నలుగుతోంది. బాలీవుడ్ రచయితలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. దీనిపై చాలా సార్లు ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా దర్శకులు నిస్సంకోచంగా తమ స్టోరీ ఐడియాల్ని హైజాక్ చేస్తున్నారని, నిర్మాతలు తమ పేరు వేయడానికి తిరస్కరిస్తున్నారనీ, తమ బకాయిలు చెల్లించకుండా వుండడానికి తమని ‘షో రన్నర్స్’ గా లేదా ‘క్రియేటివ్ కంటెంట్ కన్సల్టెంట్స్’ గా పేర్కొంటున్నారనీ; సినిమా నిర్మాతలే గాక, ఓటీటీ కంపెనీలు కూడా చాలా సంవత్సరాలుగా తమని అన్యాయంగా చూస్తున్నారనీ ఆ ఫిర్యాదుల సారాంశం.

ఈ నేపథ్యంలో స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ (SWA) వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. ప్రధాన వ్యాపార సంస్థలు సినిమాల్లోకి, ఓటీటీల్లోకీ ప్రవేశించడంతో ఒప్పందాల్ని కఠినంగా, ఒక దోపిడీగా ఏకపక్షంగా అమలు చేస్తున్నారు. ఈ శక్తుల్ని ఎదుర్కోవడానికి బాలీవుడ్ రచయితలు డిసెంబర్ 7న రాబోయే యుద్ధానికి వ్యూహాలపై సమాలోచనలు జరిపారు. రచయితలు శ్రీరామ్ రాఘవన్ ('అంధాధున్'), సుజోయ్ ఘోష్ ('కహానీ'), సుమిత్ అరోరా ('జవాన్'), అశ్వినీ అయ్యర్ తివారీ ('బరేలీకీ బర్ఫీ'), శ్రీధర్ రాఘవన్ ('పఠాన్'), హర్షవర్ధన్ కులకర్ణి ('బధాయ్ దో'), సుదీప్ శర్మ ('పాతాళ్ లోక్'), అబ్బాస్ టైర్ వాలా ('పఠాన్') ముందుకు వెళ్ళే మార్గాన్ని చర్చించారు.

సగటు పారితోషికాన్ని తగ్గించడం, క్రెడిట్‌ ని నిర్మాతల ఇష్టానికి వదిలివేయడం, లేదా ఏకపక్షంగా రద్దు చేయడం, ఏదైనా సినిమాకి సామాజిక లేదా రాజకీయ అవరోధాలు ఎదురైనప్పుడు నిర్మాతలు బకాయిలు ఎగ్గొట్టడం వంటివి చేస్తున్నారని సీనియర్ రచయిత, SWA కాంట్రాక్ట్స్ కమిటీ చైర్ పర్సన్ అంజుమ్ రాజబలి ('రాజ్‌నీతి') అన్నారు.

మోసపూరితంగా రాసిన ఒప్పందాలు రచయితల్ని కాపీరైట్, రాయల్టీ వంటి అన్ని హక్కుల్నీ వదులుకునేలా చేస్తున్నాయని, ఈ రెండిటినీ కాపీరైట్ చట్టం ద్వారా కట్టడి చేయాలనీ పేర్కొన్నారు. అనుభవం లేనివారు మాత్రమే కాదు, అనుభవజ్ఞులైన, విజయవంతమైన రచయితలు కూడా అన్యాయానికి గురవుతున్నారనీ విచారం వ్యక్తం చేశారు. ఇక జరిగింది చాలు, రచయితల గౌరవాన్నీ, పారితోషికాల విలువనీ సాధించడానికి మనలో కూడా మార్పు రావాలనీ కోరారు.

జమాన్ హబీబ్ ('యే రిష్తా క్యా కెహ్లాతా హై') అనే రచయిత -కోపం, ఆగ్రహం, బాధ ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరినీ ఎలా ప్రభావితం చేస్తున్నాయో అందరూ చూస్తున్నారని భావిస్తున్నానని, కొత్తవారిని వలలో వేసుకోవడం ఎంత సులభమో అనే ధైర్యంతో, కార్పొరేట్లు అనుభవజ్ఞులైన ఆటగాళ్ళపై కూడా ఉచ్చు బిగించడం ప్రారంభించారనీ విమర్శించారు.

హాలీవుడ్ లో 11,500 రచయితలకి ప్రతినిధ్యం వహిస్తున్న రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా (WGA) -- అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ (AMPTP) తో కార్మిక వివాదాన్ని నిరసిస్తూ మే 2- సెప్టెంబర్ 27 మధ్య 148 రోజుల సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఈ సమ్మె కారణంగా అమెరికన్ సినిమా, టెలివిజన్ పరిశ్రమలకి పెద్ద అంతరాయమే ఏర్పడింది. బాలీవుడ్‌ కూడా ఆ దారిలోనే సాగుతున్నట్టుందని రాజబలి అనుమానం వ్యక్తం చేశారు. మనం పనిని వదులుకుంటాం గానీ రాజీ పడబోమని అన్నారు.

దీంతో అనేక వెబ్ సిరీస్‌లకి, లఘు చిత్రాలకీ పనిచేసిన జైదేవ్ హెమ్మడి విభేధించారు. మన దగ్గర సంపూర్ణ ఐక్యత అనేది సాధ్యం కాకపోవచ్చని, ఎవరైనా రచయిత నో చెప్పిన ప్రతిసారీ ఆమె/అతని స్థానంలో పనిచేయడానికి వందల మంది వస్తారని, ఏ కొద్ది మందో రాజీపడరనీ చెప్పారు.

అయితే ఈ సమస్యపై నెట్ ఫ్లిక్స్, సోనీలివ్, జీ ఓటీటీ సంస్థలు స్పందించేందుకు నిరాకరించాయి. బాలీవుడ్‌లోని అతిపెద్ద ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకదాని ప్రతినిధి మాత్రం, ‘వాళ్ళేమనుకుంటున్నారు? వాళ్ళు సమావేశం పెట్టుకున్నంత మాత్రాన నిర్మాతలు కంగారుపడతారా? ఇది వ్యాపారం. కొనుగోలుదారుల మార్కెట్. మా నిబంధనల్ని అంగీకరించమని మేమేం తుపాకీ పట్టుకుని బెదిరించడం లేదు’ అని ఘాటుగా స్పందించారు.

ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఇరువైపులా బాహీబాహీకి సిద్ధమై వున్నారు. ఈ రియల్ లైఫ్ బాలీవుడ్ మూవీలో హీరోలెవరో, విలన్లెవరో తేల్చుకుంటారో లేదో చూడాలి. హాలీవుడ్ లో రచయితల సమ్మెలో ఒక తాత్కాలిక ఒప్పందంతో సీజ్ ఫైర్ ప్రకటించారు. అంటే యుద్ధం ముగియలేదు. బాలీవుడ్ లో యుద్ధం ప్రారంభం కావాల్సింది వుంది. ముఖ్యంగా ఐక్యమత్యం లేని రచయితలతో.

First Published:  13 Dec 2023 10:32 AM GMT
Next Story