Telugu Global
Cinema & Entertainment

Bollywood: విదేశీ టెక్నీషియన్లతో బాలీవుడ్ టెక్నీషియన్లు విలవిల!

Bollywood: బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ... ఏ వుడ్ అయినా ఫారిన్ టెక్నీషయన్స్ ని నియమించుకునే ట్రెండ్ గత పదేళ్ళుగా కొనసాగుతోంది.

Bollywood: విదేశీ టెక్నీషియన్లతో బాలీవుడ్ టెక్నీషియన్లు విలవిల!
X

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ... ఏ వుడ్ అయినా ఫారిన్ టెక్నీషయన్స్ ని నియమించుకునే ట్రెండ్ గత పదేళ్ళుగా కొనసాగుతోంది. ఈ మధ్య వేగం పుంజుకుని స్థానిక టెక్నీషియన్స్ ఆందోళనకి దిగే పరిస్థితికి చేరుకుంది. ఇటీవల బాలీవుడ్ టెక్నీషియన్లు ప్రెస్ మీట్ పిలిచి మరీ తమ బాధని వ్యక్తం చేసుకున్నారు. సినిమా నిర్మాణం వివిధ విభాగాల్లో విదేశీ టెక్నీషియయన్లని నియమించుకోవడమేగాక, అవార్డు ఫంక్షన్లలో అవార్డులు కట్టబెట్టి మరీ సత్కరించే దాకా మోజు పెరిగింది. భారీ బడ్జెట్స్ తో మెగా సినిమాలని నిర్మించాల్సిన డిమాండ్ ఏర్పడడం వలన దానికి తగ్గ ప్రభావాన్ని సృష్టించడానికి సరైన టెక్నీషియన్లు తప్పని సరిగా అవసరమవుతారని నిర్మాతలు చెప్తున్నారు.

ఒక్క సినిమాలేం ఖర్మ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రిటైల్, టెలికాం వంటి రంగాల్లో దర్శకత్వం, నిర్మాణం, స్క్రిప్ట్-రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ వంటి శాఖల్లో విదేశీ టాలెంట్ ని వినియోగించుకుంటున్నారని చెప్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ విదేశీ సిబ్బందిలో చాలామంది ఇక్కడి ఫిలిం ఇనిస్టిట్యూట్స్ లో శిక్షణ పొందిన వారే. దాదాపు ఇరవై శాతం మంది విద్యార్థులు వివిధ దేశాల నుంచి వచ్చిన వారే. వీరు సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, రైటింగ్, ఎడిటింగ్ వంటి కోర్సులపై దృష్టి పెడుతున్నారు. విదేశీ టెక్నీషియన్ల విషయమలా వుంచితే, విదేశీ ఆర్టిస్టుల్ని కూడా యధేచ్ఛగా తీసుకుంటున్నారు.

ఇన్ని శాఖల్లోనా!

బాలీవుడ్‌లో జూనియర్ యాక్టర్లు, మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టయిలిస్టులు, డ్యాన్సర్లు, యాక్షన్ డైరెక్టర్లు, స్టంట్‌మెన్‌లు, కాస్ట్యూమ్ డిజైనర్లు, ఆర్ట్ డైరెక్టర్లు మొదలైన వారిని పెద్ద యెత్తున విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని సినీ ఉద్యోగుల సంఘాల వారు, రాజకీయ పార్టీల ప్రతినిధులూ ధ్వజమెత్తారు. ఇవి స్థానిక సిబ్బంది పొట్టకొట్టే చర్య అని ఎత్తి పొడిచారు.

బాలీవుడ్‌లో పనిచేస్తున్న చాలా మంది విదేశీయులు టూరిస్టు వీసాపై వున్నారని, వర్క్ పర్మిట్ లేదని, ముంబై పోలీసులు చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నారని, ఈ విదేశీయుల్లో చాలా మంది వీసా నిబంధనలను ఉల్లంఘించి భారతదేశంలో అక్రమంగా పనిచేస్తున్నారనీ ఆరోపించారు. గతంలో పాకిస్థానీ నటీనటుల్ని, గాయకుల్ని ఇక్కడ పని చేయడానికి అనుమతించని విధంగా విదేశీ సిబ్బందిని నియమించడాన్ని ఎందుకు నిషేధించ కూడదని ప్రశ్నిస్తున్నారు.

ఎవరీ విదేశీయులంటే, ఎక్కువగా బ్రిటన్, రష్యా, ఉజ్బెకిస్తాన్, ఉక్రేయిన్ దేశాలకి చెందిన వారు. రెండు వారాల క్రితం విడుదలైన మన తెలుగు 'ప్రిన్స్' లో హీరోయిన్ మరియా ర్యాబో షప్కా ఉక్రేయిన్ నటి అని తెలిసిందే. ఇక రానా -సాయిపల్లవి నటించిన 'విరాటపర్వం' స్టంట్ డైరెక్టర్ హాలీవుడ్ కి చెందిన స్టీఫాన్ రిచర్. కెమెరామాన్ డానీ సాంచెజ్ లోపెజ్. అయితే టాలీవుడ్ తోబాటు ఇతర భాషల సినిమాల్లో పని చేస్తున్న విదేశీయుల వివరాలు పూర్తిగా తెలియవు. 2010-11 నుంచి మాత్రం బాలీవుడ్ లోకి హాలీవుడ్ టెక్నీషియన్లు పెద్ద సంఖ్యలోనే ప్రవేశించారు.

సినిమాల్లోనే కాదు, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కూడా విదేశీయులు చట్టవిరుద్ధంగా పని చేస్తున్నారు. బెలారస్‌లో జన్మించిన నటి అన్నా అడోర్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కీలక పాత్రలు పొందుతూ బిజీగా వుంది. తను హిందీ కూడా మాట్లాడ గల్గుతోంది. చూస్తే ఇతర దేశాల నిర్మాతలకి మనదేశపు నటీనటులపై, సాంకేతికులపై మోజుకంటే, మన నిర్మాతలకే ఫారిన్ మోజు ఎక్కువని తెలిసిపోతోంది. పరస్పరం సాంస్కృతిక మార్పిడి జరిగితే మంచిదే. లేనప్పుడు లోకల్ టాలెంట్ ని దెబ్బ తీసుకోవడంమే అవుతుంది.

పాకిస్తాన్ వలసల వెల్లువ

2016 వరకూ ఇంకో సీను చూడడానికి వుండేది. ఉరీపై దాడితో అది కాస్తా ఆవిరైపోయింది. లేకపోతే పాకిస్తానీ గాయకులు, నటీనటులూ బాలీవుడ్ లో వెల్లువలా వచ్చి పడేవాళ్ళు. అప్పటికీ తక్కువేం లేదు. ఉస్తాద్ నుస్రత్ అలీ ఖాన్, రాహత్ ఫతే అలీ ఖాన్, రెష్మా, ఆతిఫ్ అస్లం, అలీ జాఫర్, జేబ్ బంగాష్ మొదలైన గాయకులు 2016 వరకూ ఓ పదేళ్ళు బాలీవుడ్ ని ఓ ఊపు ఊపుతోంటే బాలీవుడ్ గాయకులు ఎదురుతిరిగారు. తెలుగు సినిమాల్లో కూడా పాటలు పాడిన అద్నాన్ సమీ అయితే పౌరసత్వం తీసుకుని ఇక్కడే సెటిలై పోయాడు. మోడీ ప్రభుత్వం ఇతడికి పౌరసత్వం ఇచ్చేసింది.

ఇక ఫవాద్ ఖాన్, ఇమ్రాన్ అబ్బాస్, మాహీరా ఖాన్, వీణా మాలిక్ (ఈమె తెలుగులో కూడా నటించింది), హుమైమా మాలిక్, జావేద్ షేక్, అలీ జాఫర్ లాంటి హీరోహీరోయిన్లు బాలీవుడ్ సినిమాల్లో దాదాపు సెటిలైపోయారు. నిర్మాతలకి వీళ్ళపై మోజు ఎందుకు పెరిగిందంటే హిందీ సినిమాలకి పాకిస్తాన్లో మంచి మార్కెట్ వుంది. అది సొమ్ము చేసుకోవడానికి. అంతేతప్ప సాంస్కృతిక మార్పిడీ కాదు, సౌభ్రాతృత్వం కూడా కాదు. పాకిస్తాన్ నిర్మాతలెవ్వరూ బాలీవుడ్ టాలెంట్స్ వైపు కన్నెత్తి చూడలేదు.

ఈ ట్రెండ్ కాస్తా 2016 లో జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీ సైనిక స్థావరంపై పాక్ ఉగ్రవాదుల దాడితో కొలిక్కి వచ్చింది. పాకిస్థానీ కళాకారులేవరూ ఈ దాడిని ఖండించలేదు. దీంతో నిర్మాతలకే కనువిప్పయి బహిష్కరించారు. ఇప్పుడు ఇతర దేశాలనుంచి వలసల్ని బహిష్కరించలేక పోతున్నారు. ఇక్కడి టెక్నీషియన్లనే బహిష్కరిస్తున్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

First Published:  2 Nov 2022 3:51 PM IST
Next Story