Telugu Global
Cinema & Entertainment

Akshay Kumar: అక్షయ్ హంగామా అయిపోయిందా!

Akshay Kumar: ఇన్ని ఫ్లాప్స్ కి అక్షయ్ కుమార్ ఓవర్ డోస్ కూడా కారణమా? సమాధానం లేదు. తనకి భారీ ఫ్యాన్ బేస్ వుంది. ఇది ప్రస్తుతానికి చెల్లా చేదురైంది.

Akshay Kumar: అక్షయ్ హంగామా అయిపోయిందా!
X

1991లో 'సౌగంధ్' తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన అక్షయ్ కుమార్, 2022 నాటికి 30 ఏళ్ళు పూర్తి చేసుకుని మొత్తం 130 సినిమాల్లో నటించాక, అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు 'రామ్ సేతు' కూడా ఫ్లాపవడంతో. రామ్ సేతు సహా ఈ సంవత్సరం నటించిన 5 సినిమాలూ అట్టర్ ఫ్లాపయ్యాయి. భారీ నష్టాలు మిగిలాయి. ఈ సంవత్సరం ఈ పది నెలల్లోనే బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షా బంధన్, కట్ పుథ్లీ, రామ్ సేతు తను నటించిన 5 సినిమాలు విడుదలయ్యాయి. దేశంలో ఏ హీరో సినిమాలు కూడా పది నెలల్లో 5 విడుదల కాలేదు.

ఇలా 5 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులిచ్చిన అక్షయ్, 2016 - 18 మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కూడా ఇచ్చాడు. ఎయిర్‌లిఫ్ట్, హౌస్‌ఫుల్ 3, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్‌మాన్, రుస్తోమ్, జాలీ ఎల్‌ఎల్‌బి 2, గోల్డ్ వంటి 7 బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ తో హీరోలందారి రికార్డులు కూడా బ్రేక్ చేశాడు.

2021 నుంచి అక్షయ్ కుమార్ పరిస్థితి దిగజారింది. అప్పటి నుంచి నటించిన సినిమాలన్నీ ఫ్లాపవుతున్నాయి. 2021 లో బెల్ బాటమ్, సూర్యవంశీ. ఆత్రంగీ రే, 2022 లో బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షా బంధన్, కట్ పుత్లీ, రామ్ సేతు...బచ్చన్ పాండే ఇండియాలో కేవలం 49.98 కోట్లు వసూలు చేస్తే, సామ్రాట్ పృథ్వీరాజ్ 68.05 కోట్లు, రక్షాబంధన్ 34.47 కోట్లు మాత్రమే వసూలు చేశాయి. ఇక రామ్ సేతు 30 కోట్లు కూడా రీచ్ అవడం కష్టమే అయింది.

ఇదే 2019 లో గుడ్ న్యూస్ 318 కోట్లు, హౌస్ ఫుల్ 296 కోట్లు, మిషన్ మంగళ్ 290 కోట్లు, 2018 లో కేసరి 207 కోట్లు వసూలు చేశాయి. ఎక్కడ 200- 300 వందల కోట్లు, ఎక్కడ 30-40 కోట్లు! ఇంత అట్టడుగుకి చేరుకుంటాడని ఎవ్వరూ వూహించలేదు!

అక్షయ్ చేసిన తప్పు ఏమిటి?

2019 వరకూ అక్షయ్ సినిమాల ఓపెనింగ్స్ హౌస్ ఫుల్ అయ్యే హంగామా అకస్మాత్తుగా 2020 నుంచి జీరో అయిపోయింది. ఒక్కసారిగా ప్రేక్షకులెందుకు అక్షయ్ అంటే ఆసక్తిని కోల్పోయారు? అక్షయ్, కంగనా రణవత్ ఇద్దరూ మోడీ భక్తులే. 2020 నుంచి వీళ్ళిద్దరి సినిమాలు అట్టర్ ఫ్లాపవుతున్నాయి. కంగనా నటించిన పంగా, తలైవి దారుణంగా ఫ్లాపవగా, ధాకడ్ కి ఇంకా దారుణంగా లక్ష రూపాయల కలెక్షనే వచ్చింది! అక్షయ్ మోడీ భక్తుడవడం కారణం కాకపోవచ్చు గానీ, 2020 నుంచి సినిమాల పరిస్థితే ఇలా వుందని పరిశీలకులు అంటున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ రెండు సంవత్సరాలలో, ప్రేక్షకులు వివిధ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అంతర్జాతీయ కంటెంట్‌ కి అలవాటయ్యారు. మరింత పరిణతి చెందిన, తెలివైన కంటెంట్‌ ని కోరుకునే స్థాయికి ఎదిగారు. దీంతో బాలీవుడ్ సినిమాల నుంచి కూడా ఇదే ఆశిస్తున్నారు.

ఉదాహరణకి బచ్చన్ పాండే నే తీసుకుంటే- అందులో మైరా (కృతీ సానన్) అనే వర్ధమాన దర్శకురాలు, పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ బచ్చన్ పాండేపై సినిమా తీయాలని ప్లాన్ చేస్తుంది. అయితే అందులో తాను కూడా నటించాలని నిర్ణయించుకోవడంతో విషయాలు క్లిష్టంగా మారతాయి. చివరికి, ఇద్దరూ ప్రేమలో పడతారు. కథ సుఖాంతమవుతుంది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే - ఇది నిజ జీవితంలో జరుగుతుందా? ఎవరైనా ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్‌ని వెంటాడి సినిమా చేసి, ఆపైన ప్రేమించాలనుకుంటారా? ఇలాటి వాస్తవ దూర మసాలా సినిమాలకి ఇక నో అంటున్నారు ప్రేక్షకులు.

ఇలాంటి మసాలా సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకుల కోసం మహమ్మారి రాకముందే ఫ్లాపయిన అక్షయ్ సినిమాలు ప్లాన్ చేశారని అర్ధం చేసుకోవాలి. ఇదే కొనసాగితే ప్రస్తుతానికి పని చేయదు. ఒక తాజా ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ ఇలా అన్నాడు- 'నా సినిమాలు ఫ్లాపయితే అది నా తప్పే, నేను మార్పులు చేసుకోవాలి. ప్రేక్షకులు ఇప్పుడేం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. నేను నా దినచర్యల్ని ఆపి, ఇక ఎలాంటి సినిమాలు చేయాలనే దాని గురించి ఆలోచించాలనుకుంటున్నాను. నన్ను తప్ప మరెవరినీ తప్పుబట్టకూడదు'

అక్షయ్ కుమార్ మాత్రమే ఇలా చెప్పగలిగాడు. గతంలో ఏ నటుడూ ఫ్లాప్‌ కి పూర్తి బాధ్యత వహించలేదు. పోతే, అక్షయ్ కుమార్ ఏడాదికి ఎన్ని సినిమాలు చేస్తాడో అని కూడా ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇన్ని ఫ్లాప్స్ కి అక్షయ్ కుమార్ ఓవర్ డోస్ కూడా కారణమా? సమాధానం లేదు. తనకి భారీ ఫ్యాన్ బేస్ వుంది. ఇది ప్రస్తుతానికి చెల్లా చేదురైంది. తిరిగి 300 కోట్లు, 200 కోట్లు ఇచ్చిన ఫ్యాన్ బేస్ ని సంఘటితం చేసుకునే వ్యూహంతో సినిమాల్లో నటిస్తేనే అక్షయ్ కి స్టార్ డమ్.

First Published:  31 Oct 2022 3:13 PM IST
Next Story