Hindi hit movies in 2022: 2022 లో ఐదే హిందీ హిట్లు!
Hindi hit movies in 2022: 2022 లో హిందీ సినిమాలు 102 విడుదలైతే ఐదే హిట్టయ్యాయి. పేరున్న హీరోల సినిమాలు 20 విడుదలైతే అందులో 15 ఫ్లాపులు, 5 హిట్లుగా నిలిచాయి. మిగిలిన ఫ్లాపయిన 82 సినిమాలు చిన్న సినిమాలు.
2022 లో హిందీ సినిమాలు 102 విడుదలైతే ఐదే హిట్టయ్యాయి. పేరున్న హీరోల సినిమాలు 20 విడుదలైతే అందులో 15 ఫ్లాపులు, 5 హిట్లుగా నిలిచాయి. మిగిలిన ఫ్లాపయిన 82 సినిమాలు చిన్న సినిమాలు. 2020-21 కోవిడ్ మహమ్మారి ప్రభావాల నుంచి కాస్త వూపిరి పీల్చుకున్న బాలీవుడ్ కి 2022 లో కొత్త సమస్యలు చుట్టు ముట్టాయి. లాక్ డౌన్లు ఎత్తేసినా ప్రేక్షకులు థియేటర్లకి రాకపోవడం, అల్లరి మూకలు బాయ్ కాట్ ట్రెండ్ లు నడపడం, ఓటీటీ గట్టి పోటీ నివ్వడం మొదలైన పరిణామాలు హిందీ సినిమాల్ని నష్టాల బాట పట్టించాయి. అయితే దక్షిణాది నుంచి వచ్చిన పానిండియా సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.
అగ్ర హీరోలు అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్ సినిమాలు కూడా అట్టర్ ఫ్లాపయ్యాయి. 2022 కి వీడ్కోలు చెబుతూ విడుదలైన రణవీర్ సింగ్ భారీ మూవీ 'సర్కస్' దారుణంగా పరాజయం పాలయ్యింది. ఫ్లాప్స్ కారణాల్లో కంటెంట్ వైఫల్యం కూడా ఒకటి. 100 కోట్లు దాటిన క్లబ్ లో చేరిన 5 సినిమాల కంటెంట్ చూస్తే, ఐదుకి ఐదూ వేర్వేరు రుచుల కంటెంట్ ని థియేటర్లకి వచ్చి ఆరగించారు ప్రేక్షకులు. ఈ ఐదింటిని శాంపిల్స్ గా తీసుకుని 2023 కి కంటెంట్ ప్లాన్ చేస్తే హిట్టవుతాయా అన్నది చెప్పలేని మాట. ఒకసారి హిట్టయిన సినిమాలేమిటో చూద్దాం...
1. దృశ్యం 2 : అజయ్ దేవగణ్, టబు నటించిన 'దృశ్యం 2' మిస్టరీ థ్రిల్లర్ మొదటి వారంలోనే 100+ కోట్ల క్లబ్ లో చేరింది. నవంబర్ 18న విడుదలై డిసెంబర్ లో కూడా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఇప్పటికి దేశీయ బాక్సాఫీసులో 200 కోట్ల రూపాయల వసూళ్ళు నమోదు చేసింది.
2. బ్రహ్మాస్త్ర- పార్ట్ 1 : సైన్స్ ఫిక్షన్ 'బ్రహ్మాస్త్ర- పార్ట్ వన్: శివ' ఈ సంవత్సరం మరో బ్లాక్ బస్టర్. సెప్టెంబర్ 9 న విడుదలైంది. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున నటించిన భారీ-బడ్జెట్ ఫాంటసీ అడ్వెంచర్ సిరీస్ మొదటి మూవీ మొదటి రోజున 75 కోట్లు వసూలు చేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సూపర్ హిట్ విడుదలైన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ బాక్సాఫీస్ కలెక్షన్లలో 150 కోట్ల రూపాయల మార్కుని దాటేసింది.
3. భూల్ భులయ్యా -2 : అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన 'భూల్ భులయ్యా- 2' మే 20న విడుదలైన హార్రర్ కామెడీ. ఇందులో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. 2022 లో అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచింది. దీని లైఫ్ టైమ్ కలెక్షన్స్ 250 కోట్లు దాటింది.
4. కాశ్మీర్ ఫైల్స్ : వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' 1990లో కాశ్మీరీ పండిట్ల వలసల ఆధారంగా తీసిన డాక్యూ డ్రామా. ఇందులో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు నటించారు. ఇది మొదటి వారంలో 100+ కోట్ల క్లబ్' లోకి ప్రవేశించింది. దేశీయ బాక్సాఫీసులో 200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది మార్చి 11న విడుదలైంది.
5. గంగూబాయి ఖాటియావాడి : సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో 'గంగూబాయి ఖాటియావాడి' ఈ సంవత్సరం మరో పెద్ద బాక్సాఫీస్ హిట్ గా నమోదైంది. ఫిబ్రవరి 25న విడుదలైంది. మొదటి వారంలో 68.93 కోట్లు వసూలు చేసింది. రచయిత ఎస్ హుస్సేన్ జైదీ రాసిన పుస్తకం 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' లోని ఒక అధ్యాయం ఆధారంగా దీన్ని రూపొందించాడు భంసాలీ. ఇందులో అలియా భట్ 'గంగూబాయి' గా నటించింది. ఇది బయోపిక్. 1960ల నాటి కమాటీ పురాలో వేశ్య పాత్ర. ఇందులో అజయ్ దేవగణ్ ఒక కీలక పాత్ర. దీని లైఫ్ టైమ్ బాక్సాఫీసు 125 కోట్లు.
ఇలా పై విధంగా మిస్టరీ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ –ఫాంటసీ, హార్రర్ కామెడీ, డాక్యు డ్రామా, బయోపిక్ వంటి ఐదు విభిన్న జానర్స్ ని హిట్ చేశారు ప్రేక్షకులు. మాస్ మసాలా యాక్షన్ సినిమాలు, రోమాంటిక్ కామెడీలు, చారిత్రికాలూ మొదలైన వాటన్నిటినీ తీసి అవతల పెట్టారు. ప్రేక్షకులు ఎదిగారు, అభిరుచుల్లో మార్పు వచ్చింది. ఇంకో అభిరుచి ఏమిటంటే సౌతిండియన్ పానిండియా సినిమాలు. విక్రమ్, పుష్ప, కేజీఫ్2, కార్తికేయ వంటి సినిమాలకి పట్టం గట్టారు.
దక్షిణాది సినిమాలు బాలీవుడ్ మీద దాడి చేస్తున్నాయని వాపోతున్న హిందీ నిర్మాతలు ఒక పని చేయ వచ్చు- దక్షిణాదికి వచ్చి పానిండియా సినిమాలు తీయడం! బాలీవుడ్ ని టాలీవుడ్ లో విలీనం చేస్తే ఇంకా బావుంటుంది.
(రేపు ఫ్లాపయిన 15 సినిమాలు)