Hari Hara Veera Mallu: బాలీవుడ్ నటుడు ఎంట్రీ
Hari Hara Veera Mallu Movie: పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలోకి ఓ బాలీవుడ్ నటుడు ఎంటరయ్యాడు. అతడే బాబీ డియోల్.

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'హరి హర వీర మల్లు'. నిధి అగర్వాల్ హీరోయిన్. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తారు.
ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్, ఈరోజు యూనిట్ లో చేరాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్న ఆయన.. చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చాడు. కీలకమైన ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డిజైనర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్ ను రూపొందించారు.
పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ దర్బార్ సెట్ లో చిత్రీకరించనున్నారు. బాబీ డియోల్ కి ఘన స్వాగతం పలుకుతూ హరి హర వీర మల్లు బృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అందులో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది.
హరి హర వీర మల్లు చిత్ర యూనిట్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో 40 రోజుల పాటు 900 మంది సిబ్బందితో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించి భారీ షెడ్యూల్‌ను ముగించారు. ఆ షూట్‌కు ముందు ప్రధాన తారాగణం మరియు సాంకేతిక నిపుణులతో ప్రత్యేక ప్రీ-షెడ్యూల్ వర్క్‌షాప్ నిర్వహించారు. త్వరలోనే పవన్, బాబీ డియోల్ కాంబోలో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.