Billa Movie: ప్రభాస్ 'బిల్లా' మళ్ళీ హిట్టయ్యింది!
Billa Movie: పానిండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే కానుకగా ఈ నెల 23న రీరిలీజ్ అయిన 'బిల్లా' 4కె వెర్షన్ స్పెషల్ షోలు హిట్టయ్యాయి
పానిండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే కానుకగా ఈ నెల 23న రీరిలీజ్ అయిన 'బిల్లా' 4కె వెర్షన్ స్పెషల్ షోలు హిట్టయ్యాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణల బర్త్ డేలకి వాళ్ళ స్పెషల్ షోస్ హిట్టయిన బాటలోనే 'బిల్లా' ని కూడా హిట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ బర్త్ డేకి ముందు రీరిలీజ్ చేసిన 'రెబల్' మాత్రం అట్టర్ ఫ్లాపయ్యింది. 'బిల్లా' స్పెషల్ షోస్ కి యూఎస్ లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ లభించింది. ప్రభాస్ ఫ్యాన్స్ తామేం తీసిపోలేదని 'బిల్లా' ని మళ్ళీ హిట్ చేశారు.
అత్యుత్సాహంతో థియేటర్లో అగ్నిప్రమాదానికి కూడా కారకులయ్యారు. 'బిల్లా' 4కె వెర్షన్ ని హిందీలో కూడా విడుదల చేసి వుంటే, ఇటీవల రెండు పానిండియా సినిమాలు (సాహో, రాధేశ్యామ్) లతో తీవ్ర అసంతృప్తితో వున్న పానిండియా ప్రేక్షకుల్ని సంతోష పెట్టినయ్యేది. దీపావళికి రెండు బాలీవుడ్ సినిమాలు - రామ్ సేతు, థాంక్ గాడ్- ఫ్లాపయిన నేపథ్యంలో, వీటి మధ్య హిందీ 'బిల్లా' రీరిలీజ్ సక్సెస్ జాతీయ వార్తగా గా అయ్యేది.
ట్రేడ్ పండిట్ల సమాచారం ప్రకారం, యూఎస్ లో రికార్డు స్థాయిలో 70కి పైగా లొకేషన్లలో విడుదల చేశారు. అలాగే హైదరాబాద్ లో ప్రసాద్ ఐమాక్స్ సహా రికార్డు స్థాయిలో 24 థియేటర్లలో విడుదల చేశారు. అడ్వాన్సు బుక్కింగులు జోరుగా సాగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటలకి స్పెషల్ షోలు పడ్డాయి. యూఎస్ లో అక్టోబర్ 22న సాయంత్రం 6 గంటలకు, రాత్రి 9.30 గంటలకు షోలు వేశారు. కలెక్షన్ల వివరాలు అందాల్సి వుంది. అయితే కలెక్షన్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని బ్రిటన్ -ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ కి విరాళంగా ఇవ్వాలని కృష్ణం రాజు కుటుంబం నిర్ణయించుకుంది.
డయాబెటిస్‌తో బాధపడుతున్న పేద ప్రజలకి సాయం చేసేందుకు ఒక
ఫౌండేషన్ని స్థాపించడం కృష్ణం రాజు స్వప్నం. సెప్టెంబర్ 30 న అస్తమించిన రెబల్ స్టార్ కృష్ణంరాజుకి గౌరవసూచకంగా ప్రభాస్ రీరిలీజ్ వేడుకల్ని జరపలేదు. 'బిల్లా' ని కృష్ణంరాజు తన సొంత గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో తాను ఒక కీలక పాత్ర కూడా పోషించారు. స్పెషల్ షోలకి యూఎస్ లో అంత రెస్పాన్స్ రావడానికి స్వర్గస్థుడైన కృష్ణం రాజుని వెండి తెరపై చూసే అవకాశం లభించడం కూడా కారణం కావచ్చు.
2009 లో మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'బిల్లా' లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయడంతో బాటు తో కృష్ణం రాజు, అనుష్కాశెట్టి, హన్సికా మోత్వానీ, నమిత, రెహమాన్, కెల్లీ దోర్జీ మొదలైన వారు నటించారు. 2007 లో విడుదలైన అజిత్ నటించిన 'బిల్లా' కిది రీమేక్. తమిళ 'బిల్లా' 1978లో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ హిట్ 'డాన్' కి రీమేక్. 1979 లో ఎన్టీ రామారావు నటించిన 'యుగంధర్', 'డాన్' కి మొట్ట మొదటి రీమేక్.
1980లో తమిళంలో రజనీకాంత్ నటించిన 'బిల్లా' రెండో రీమేక్. ఇది రజనీ కాంత్ ని సౌత్ లో టాప్ స్టార్ గా నిలబెట్టింది. 1986 లో మోహన్‌లాల్ తో మలయాళంలో 'శోభరాజ్' మూడో రీమేక్. 1991లో పంజాబీ భాషలో పాకిస్థానీ మూవీగా 'కోబ్రా' నాల్గో రీమేక్. 2006 లో షారూఖ్ ఖాన్ నటించిన హిందీ 'డాన్' ఐదో రీమేక్. దీని ఆధారంగా 2007 లో తమిళంలో అజిత్ 'బిల్లా' ఆరవ రీమేక్. దీని ఆధారంగా 2009 లో ప్రభాస్ తెలుగు 'బిల్లా' ఏడవ రీమేక్. 1978లో అమితాబ్ నటించిన 'డాన్' ఇన్నిసార్లు రీమేక్ అయి ఇప్పుడు రీరిలీజ్ అయినా హిట్టే!
విశేషమేమిటంటే, రీరిలీజ్ కి ముందు ట్రైలర్ కూడా రూపొందించి విడుదల చేశారు. 4కె విజువల్స్ తో ప్రభాస్, కృష్ణంరాజు యాక్షన్ ట్రీట్ గా స్పెషల్ ట్రైలర్ విడుదల చేయడం రీరిలీజ్ మార్కెటింగ్ కి పరాకాష్ట. ఈ స్టయిలిష్ ట్రైలర్ చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్ కాని వాళ్ళకి కూడా చేతులు అడ్వాన్స్ బుక్కింగుల మీటలు నొక్కుతాయి.
మొత్తం మీద 'బిల్లా' రీరిలీజ్ సక్సెస్ ప్రభాస్ కే కాదు, కృష్ణం రాజు గౌరవాన్ని కూడా నిలబెట్టింది. అయితే కొందరు ఫ్యాన్స్ పోకడ మాత్రం ఖండనలకి గురైంది. తాడేపల్లిగూడెంలోని వెంకటరమణ థియేటర్‌లో బిల్లా సినిమా ప్రదర్శన సందర్భంగా, ప్రభాస్ ఫ్యాన్స్ టపాసులు పేల్చడంతో నిప్పంటుకుని థియేటర్ యాజమాన్యానికి భారీ నష్టం వాటిల్లింది. స్టార్ల స్పెషల్ షోల సందర్భంగా థియేటర్ల విధ్వంసం పెద్ద సమస్యగా మారింది. యాజమాన్యాలు భారీ నష్టాల్ని ఎదుర్కొంటున్నారు. ఈ నష్టాలు లక్షల్లో వుంటున్నాయి. చాలా చోట్ల కుర్చీలు, స్క్రీన్‌లు కూడా పాడైపోవడంతో థియేటర్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
'పోకిరి' స్పెషల్ షోకి చాలా థియేటర్లలో ఎంట్రీ గేట్లు, అద్దాలు పగలగొట్టారు. 'జల్సా' స్పెషల్ షోలతో ఇదే రిపీట్ అయింది. ఇప్పుడు 'బిల్లా' రీ-రిలీజ్ విషయంలో కూడా ఇదే రిపీట్ అయింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే, థియేటర్ల యాజమాన్యాలు రీ-రిలీజ్‌లను పూర్తిగా నిలిపివేసే అవకాశం కూడా వుంది. ఏ స్టార్ ఫ్యాన్స్ అయినా భయ వాతావరణం సృష్టించకూడదు. సృష్టిస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి సిద్ధమవు
తున్నారు థియేటర్ల యజమానులు. ఈ సంఘటనలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనే జరుగుతున్నాయి. మల్టీప్లెక్సుల్లో అలాటి అవకాశముండదు.