డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్, తరుణ్ లకు బిగ్ రిలీఫ్
ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరి దగ్గర నుంచి వీటిని సేకరించినప్పటికీ పూరీ జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ మాత్రమే ఫోరెనిక్స్ ల్యాబ్ కు పంపించారు. అయితే ఈ ఇద్దరి శరీరంలో ఎటువంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేలింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో తరుణ్ తదితరులకు కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సినీ ప్రముఖులపై నమోదైన 8 కేసుల్లో 6 కేసులను తాజాగా కోర్టు కొట్టివేసింది. 2018లో టాలీవుడ్ కు చెందిన పలువురు డ్రగ్స్ వాడుతున్నారన్న ఆరోపణల మేరకు ఎక్సైజ్ శాఖ 8 కేసులు నమోదు చేసింది. సినీ ఇండస్ట్రీకి చెందిన వారితోపాటు ఇందులో ప్రమేయం ఉన్న పలువురిపై కేసులు నమోదు అయ్యాయి.
దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోలు రవితేజ, దగ్గుబాటి రానా, తరుణ్, తనీష్, నవదీప్, నందు, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు చార్మి, ముమైత్ ఖాన్ తదితరులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. డ్రగ్స్ కేసులు నమోదైన వారిని అధికారులు నెలల తరబడి విచారించారు. వారి నుంచి వెంట్రుకలు, గోళ్లను శాంపిల్ తీసుకున్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరి దగ్గర నుంచి వీటిని సేకరించినప్పటికీ పూరీ జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ మాత్రమే ఫోరెనిక్స్ ల్యాబ్ కు పంపించారు. అయితే ఈ ఇద్దరి శరీరంలో ఎటువంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేలింది.
టాలీవుడ్ ప్రముఖులపై నమోదైన ఎనిమిది కేసులకు సంబంధించి ఆరు కేసుల్లో ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదని తాజాగా కోర్టు స్పష్టం చేసింది. పూరీ జగన్నాథ్, తరుణ్ శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెనిక్స్ ల్యాబ్ ధ్రువీకరించిన రిపోర్టులను పరిశీలించిన న్యాయస్థానం 8 కేసుల్లో 6 కేసులను కొట్టివేసింది. కోర్టు తీర్పుతో దర్శకుడు పూరీ జగన్నాథ్, తరుణ్ లకు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది.