Bhagavanth Kesari | మోత ఎక్కువైంది.. బీట్ తక్కువైంది
Bhagavanth Kesari - భగవంత్ కేసరి సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది.
బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. అందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడు. డ్రమ్స్ పగిలిపోయేలా నేపథ్య సంగీతం అందించాడు. పనిలోపనిగా మంచి సాంగ్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు అదే ఫార్ములాను భగవంత్ కేసరికి కూడా అనుసరించాడు తమన్. కానీ లెక్క తప్పింది.
భగవంత్ కేసరి సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చింది. గణేశ్ ఏంథమ్ గా విడుదలైన ఈ సాంగ్ లో మోత బాగానే మోగింది కానీ బీట్ తగ్గింది. సాంగ్ మొత్తం సౌండ్ వినిపించింది తప్ప, బీట్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. తెలంగాణ యాసలో ఉన్న ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, ఆర్కెస్ట్రా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
ఆడియో పరంగా ఆకట్టుకోకపోయినా, వీడియో పరంగా ఈ సినిమా ఆకట్టుకునేలా ఉంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ హుషారుగా ఉంది. బాలకృష్ణ, శ్రీలీల తమ క్రేజీ డ్యాన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. వారి కాస్ట్యూమ్ లు, గెటప్ లు , డ్యాన్స్‌లు అన్నీ పాటకు పర్ఫెక్ట్‌గా అనిపించాయి. విజువల్స్ కూడా బాగున్నాయి.
దర్శకుడు అనిల్ రావిపూడి పాటల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. అతడి సినిమాల్లో పాటలు బాగుంటాయి. కానీ భగవంత్ కేసరి నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుంచి రాబోతున్న పాటలైనా ఆకట్టుకుంటాయేమో చూడాలి.
దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది.