Telugu Global
Cinema & Entertainment

గిల్డ్ పై బండ్ల గణేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు

యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేశ్.

గిల్డ్ పై బండ్ల గణేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దాని పేరు యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్. అదేదో ఆషామాషీ సంస్థ కాదు. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, డీవీవీ దానయ్య లాంటి భారీ ప్రొడ్యూసర్లు ఉన్న సంస్థ అది. అలాంటి అసోసియేషన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నిర్మాత, నటుడు బండ్ల గణేశ్. గిల్డ్ చేసే పనులన్నింటినీ టైమ్ వేస్ట్ వ్యవహారాలుగా కొట్టిపడేశారు. అసలు గిల్డ్ లో సభ్యులకు సినిమాలు తీయడం వచ్చా అని సూటిగా ప్రశ్నించారు.

నిన్నటికినిన్న కొంతమంది నిర్మాతలపై అశ్వనీదత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వ్యక్తులు సినిమా హాళ్లను తమ చేతిలో పెట్టుకొని ఆడిస్తున్నారని అన్నారు. తమ సినిమాల కోసం కొంతమంది గతంలో టికెట్ రేట్లు పెంచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడీ వ్యాఖ్యల్ని పూర్తిగా సమర్థించారు బండ్ల గణేశ్. అక్కడితో ఆగకుండా తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.

కాల్షీట్ కు, షీట్ కు తేడా తెలియనోళ్లు సినిమాలు తీస్తున్నారని అన్నారు బండ్ల. ప్రొడ్యూసర్స్ గిల్డ్ వేస్ట్ అన్నారు. వాళ్లు చేస్తున్న పనులు, తీసుకున్న నిర్ణయాల్ని టైమ్ వేస్ట్ వ్యవహారాలుగా కొట్టిపడేశారు. వడ్డీలు తగ్గించాలి, పారితోషికాలు తగ్గించాలని డిమాండ్ చేయడం మానేసి.. వర్కింగ్ డేస్ తగ్గించడం, రీషూట్స్ తగ్గించడంపై గిల్డ్ సభ్యులు దృష్టిపెడితే బాగుంటుందని సూచించారు.

షూటింగ్ ఆపేయాలని నిర్ణయం తీసుకున్న నిర్మాతలపై భగ్గుమన్నారు బండ్ల గణేశ్. చేతకాని వాళ్లు చేసే పనులే ఇవన్నీ అన్నారు. అసలు హీరోల్ని రెమ్యూనరేషన్లు తగ్గించుకోమని డిమాండ్ చేసే హక్కు ఏ నిర్మాతకు లేదన్నారు. ఇదే నిర్మాతలు హీరోల రేట్లు పెంచారని, ఇప్పుడు తగ్గించమని అడిగితే ఎట్లా అని ప్రశ్నించారు. మార్కెట్లో ప్రతిదానికి ఓ రేటు ఉంటుందని, అలాగే హీరోలకు కూడా మార్కెట్ కు తగ్గ రేటు ఉందని అన్నారు బండ్ల గణేశ్.

First Published:  29 July 2022 4:14 AM GMT
Next Story