Telugu Global
Cinema & Entertainment

Balakrishna: వివాదాస్పదమైన బాలకృష్ణ స్పీచ్

Balakrishna's speech creates controversies - తన వ్యాఖ్యలతో వివాదాలు సృష్టించడం బాలకృష్ణకు కొత్తకాదు. ఇప్పుడు మరోసారి తన కామెంట్స్ తో వివాదాలకు కేంద్రబిందువయ్యారు ఈ సీనియర్ నటుడు.

Balakrishna: వివాదాస్పదమైన బాలకృష్ణ స్పీచ్
X

రానురాను నటుడు బాలకృష్ణ మాటలు హద్దులు దాటుతున్నాయి. ఆయన ప్రవర్తన మరింత అభ్యంతరకరంగా మారుతోంది. నిన్నటికినిన్న బాలయ్య వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తన అత్యంత వివాదాస్పదమయ్యాయి. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ అంటూ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మైక్ పుచ్చుకున్న బాలయ్య ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు.

ఓ దశలో సందర్భం లేకుండా ఏదో మాట్లాడుతూ.. 2-3 బూతులు కూడా అనేశారు. మరో సందర్భంలో 'అక్కినేని-తొక్కనేని' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఏకంగా 'ఆ రంగారావు, ఈ రంగారావు' అంటూ ఎస్వీ రంగారావునే కించపరిచారు.

బాలకృష్ణ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓ సినిమా ఫంక్షన్ లో మహిళలపై అనుచితంగా కామెంట్స్ చేశారు. ఆ తర్వాత మహిళా సంఘాలు భగ్గుమనడంతో భేషరతుగా క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది.

ఇవన్నీ ఒకెత్తయితే, ఫంక్షన్ చివర్లో బాలయ్య మాట్లాడిన మాటలు, ఫ్యాన్స్ తో ప్రవర్తించిన విధానం మరో ఎత్తు. తనకు గజమాల వేయడానికి వచ్చిన అభిమానులతో ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించారు బాలకృష్ణ. చేయిచేసుకోకపోయినా, నోరు చేసుకున్నారు. చాలామందిపై కన్నెర్రచేశారు.

ఇలా తన వ్యాఖ్యలతో పాటు చేష్టలతో వివాదాస్పదమయ్యారు బాలకృష్ణ. అయితే ఇలాంటివి ఆయన పట్టించుకోరనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రజాజీవితంలో ఉన్న ఓ రాజకీయ నాయకుడు, చాలామంది ఆరాధించే ఓ సినీ నటుడు ఇలా మాట్లాడ్డం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనే ఆత్మావలోకనం చేసుకుంటే మంచిది.

First Published:  23 Jan 2023 8:49 PM IST
Next Story