Telugu Global
Cinema & Entertainment

జవాన్ మీద ఫేక్ రివ్యూల దాడి!

షారుఖ్ ఖాన్ ‘జవాన్’ భారీ స్థాయిలో తెరకెక్కింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఏడున్నర లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే విడుదలకి రెండు రోజుల ముందు నుంచి హఠాత్తుగా సినిమాపై అనేక రకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

జవాన్ మీద ఫేక్ రివ్యూల దాడి!
X

‘సౌత్ స్టయిల్ మ్యూజిక్‌తో 3 గంటల పాటు భరించలేని సౌత్ మసాలా సినిమా జవాన్. మేం చాలా డిస్సపాయింటయ్యాం. కాబట్టి ఈ చెత్త సినిమాకి కి మేము 1* రేటింగ్ ఇస్తున్నాం’ అని ఒకరు ట్విట్టర్ రివ్యూ ఇస్తే, దీనికి సమాధానంగా ‘1 స్టార్ కూడా ఎందుకురా?’ అని ఇంకొకరు ట్రోల్ చేస్తే, ‘వీడు కిసీ కా భాయ్ కిసీ జాన్ కే టైంలో సినిమాని మెచ్చుకున్నాడు’ అని మరొకరు తిడుతూ ట్వీట్ చేశారు. ‘ప్రతిసారీ ఫేక్ రివ్యూ లిస్తాడు’ అని ఒకామె ట్వీట్ చేసింది. విసుగు చెందిన ఇంకొకరు, ‘నువ్వు ఎప్పుడు బాగుపడతావురా? దేనికైనా హద్దుంటుంది. ఇందుకే నిన్ను బ్లాక్ చేస్తున్నాను’ అని ట్వీట్ చేశాడు. ‘అరేయ్ కేఆర్కే (ప్రముఖ రివ్యూ రైటర్ పేరు) నీ రియల్ అకౌంట్ పేరు చెప్పు?’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

స్క్రీనింగ్ లేకుండా 'జవాన్'కి రివ్యూలు ఎలా వచ్చాయి? షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ ఫేక్ రివ్యూలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రపంచంలోని వివిధ దేశాల సెన్సార్‌ బోర్డ్‌ ఆఫీసుల్లో ‘జవాన్‌’ని చూశామంటూ సోషల్‌ మీడియాలో కొందరు పేర్కొంటున్నారు. అదే ప్రాతిపదికన రివ్యూలివ్వడం, అవి వైరల్ అవడం జరుగుతోంది.

‘పఠాన్’ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ రేపు విడుదలవుతోంది. ఇంకా ఎక్కడా ప్రీ మియర్స్ కూడా వేయలేదు. అయినా ఇంటర్నెట్ లో రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రివ్యూలు చూస్తున్న నెటిజన్లు ఇవి ఫేక్ రివ్యూలని కొట్టి పారేస్తున్నారు. షారుఖ్ రాబోయే ‘డుంకీ’ రివ్యూ కూడా ఇచ్చేయమంటూ ట్రోల్ చేస్తున్నారు.

‘రివ్యూకర్తలు’ సింగిల్ స్టార్‌తో, 4 స్టార్‌తో ఇష్టమొచ్చినట్టు రేటింగ్స్ ఇస్తూ ఫేక్ రివ్యూలు గుప్పిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహించిన జవాన్‌కి ఎలాంటి ప్రీమియర్ షోలు నిర్వహించలేదని, విడుదలకి ముందు సినిమాని ఎవరైనా సమీక్షించే అవకాశం లేదని నెటిజన్లు నమ్ముతున్నారు. అయితే, ఒక రివ్యూ ఇప్పటికే సినిమాని చూసిన సెన్సార్ బోర్డు సోర్స్ నుంచి వచ్చి ఉంటుందని కొందరు ఫ్యాన్స్ భావిస్తున్నారు. తెలుగు సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా చూసి ‘సినిమా అద్భుతంగా ఉంది’ అని బయటికి చెప్పేయడం ఎప్పుడూ జరుగుతున్న తంతే. నిర్మాతలు ఈ మెచ్చుకోలు మాటలు ఒక సర్టిఫికెట్‌గా ఉపయోగించుకుని ‘సెన్సార్ రివ్యూ’ అంటూ సినిమాకి పబ్లిసిటీ చేసుకోవడమూ మామూలే. సెన్సార్ రివ్యూ అని ఉంటుందా? ఎక్కడైనా సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాలకి డబ్బా కొడుతూ సెన్సార్ రివ్యూలిస్తారా? ఇలాటిది బాలీవుడ్‌లో చూడం.

ఒక వైరల్ ట్వీట్ ‘జవాన్’ ని ఇలా పొగుడుతోంది, ‘పర్ఫెక్ట్ పేస్ అండ్ సినిమాటోగ్రఫీతో బహుళ దృక్కోణాల నుంచి చెప్పిన నేర కథ ఇది. యాక్షన్, కామెడీ, థ్రిల్, అన్నీ ఉన్న ఒక సంపూర్ణ ఎంటర్‌టైనర్ ప్యాకేజీ’ అని. ఈ ట్వీట్‌కి నెటిజన్లు ట్రోల్ ఫెస్ట్ ప్రారంభించారు. ‘సినిమాని ఎలా, ఎప్పుడు, ఎక్కడ చూశావో కాస్త చెప్పవయ్యా బాబూ’ అని. ‘పనిలో పనిగా డుంకీ రివ్యూ కూడా ఇచ్చేయ్’ అనీ. మేకర్స్ ట్రైలర్‌ని, పాటల్ని విడుదల చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో క్రేజ్ పెరిగింది. ఈ సినిమాని స్పెషల్ స్క్రీనింగ్‌లో చూశానని ఒక ఫేక్ రివ్యూకర్త పేర్కొన్నాడు. ఇంకొకరు 'జవాన్'ని 'చెత్త సినిమా’ అని ట్యాగ్ చేసి, స‌ఈబ‌రోజు సింగపూర్ సెన్సార్ బోర్డ్ ఆఫీసులో మేము అత్యంత ఉత్కంఠతో చూశాం’ అని ట్వీట్ చేశాడు. నెటిజన్లతో బాటు, ట్రేడ్ విశ్లేషకుల, షారూఖ్ ఫ్యాన్ క్లబ్‌ల కొన్ని ధృవీకరించిన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలు ఇవి ఫేక్ రివ్యూలని తేల్చేస్తున్నాయి.

ఒక ట్రేడ్ ఎనలిస్ట్ ‘ఇవన్నీ తప్పుడు సమీక్షలు. ఓవర్సీస్ సెన్సార్ రిపోర్టుని నమ్మకండి’ అంటూ ట్వీట్ చేశాడు. దీన్ని సమర్థిస్తూ, ‘ఎవరైనా దూరడానికి అది సెన్సార్ బోర్డు ఆఫీసా, పబ్లిక్ గార్డెనా?’ అని ఒక ఫ్యాన్ ఎత్తిపొడిచాడు. ‘జవాన్ కి ఎలాంటి స్పెషల్ స్క్రీనింగ్‌ వేయలేదు. సినిమా చూశామని చెప్పుకునే స్వయం ప్రకటిత 'విమర్శకుల' నుంచి వస్తున్న రివ్యూలు నిజమైనవి కావు. దయచేసి ఈ తప్పుడు రివ్యూలని చూసి మోసపోకండి!’ అని ఎసార్కే ఫ్యాన్ క్లబ్ బాధ్యుడొకరు స్పష్టం చేశాడు.

షారుఖ్ ఖాన్ ‘జవాన్’ భారీ స్థాయిలో తెరకెక్కింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఏడున్నర లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే విడుదలకి రెండు రోజుల ముందు నుంచి హఠాత్తుగా సినిమాపై అనేక రకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలన్నీ 'జవాన్' చిత్రీకరణకి సంబంధించినవే. చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌లు ఈ సినిమా చూశామని పేర్కొన్నాయి. దీంతో పాటు సినిమాపై రివ్యూలు కూడా ఇచ్చేస్తున్నాయి. ఈ రివ్యూలు 'జవాన్'పై నెగిటివిటీ పెరిగేలా చేస్తున్నాయి. ఫేక్ రివ్యూల ద్వారా ప్రేక్షకులకి సినిమా బ్యాడ్ అన్పించేలా చేయడం ఉద్దేశంగా కనబడుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. షారుఖ్ గత ‘పఠాన్’ మీద బాయ్ కాట్ గ్యాంగులు విరుచుకుపడితే, ఇప్పుడు ఫేక్ రివ్యూలు దాడి చేస్తున్నాయి.


First Published:  6 Sept 2023 1:36 PM GMT
Next Story