టాలీవుడ్ స్ట్రయిక్ పై అశ్వనీదత్ సెటైర్లు
టాలీవుడ్ లో ప్రస్తుతం నడుస్తున్న స్ట్రయిక్ పై సెటైర్లు వేశారు అశ్వనీదత్. తను ఆ నిర్ణయాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదని మరోసారి స్పష్టంచేశారు.
కొంతమంది నిర్మాతలు చేస్తున్న టాలీవుడ్ స్ట్రయిక్ పై ఇప్పటికే విమర్శలు చేశారు అశ్వనీదత్. షూటింగ్స్ నిలిపివేసే నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. ఇప్పుడు మరోసారి తన మనసులో అభిప్రాయాన్ని సూటిగా బయటపెట్టారు ఈ మెగా ప్రొడ్యూసర్.
"అసలు కొంతమంది నిర్మాతలు ఎందుకు స్ట్రయిక్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. వాళ్లే కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీశారు. ఆర్టిస్టులు అడిగినంత ఇచ్చారు. ఇప్పుడు వాళ్లే రెమ్యూనరేషన్లు ఎక్కువైపోయాయంటూ షూటింగ్స్ ఆపేశారు. ఇదే నాకు అర్థం కావడం లేదు. గమ్మత్తైన విషయం ఏంటంటే, 50 కోట్లు అడ్వాన్స్ ఇస్తానంటూ చెప్పుకునే నిర్మాత కూడా ఈ బ్యాచ్ లో ఉన్నాడు."
ఇలా తనదైన స్టయిల్ లో విసుర్లు విసిరారు అశ్వనీదత్. కొంతమంది నిర్మాతల పిలుపు మేరకు అశ్వనీదత్ కూడా తన సినిమా షూటింగ్స్ ఆపేశారంటూ వచ్చిన వార్తల్ని పూర్తిగా ఖండించారు ఈ నిర్మాత. ఆ టైమ్ లో తన సినిమా షూటింగ్ లేదని, ఉంటే కచ్చితంగా షూటింగ్ చేసేవాడినని ప్రకటించారు.
"నేను ప్రభాస్ తో ప్రాజెక్ట్-కె అనే సినిమా తీస్తున్నాను. షూటింగ్ 55శాతం పూర్తయింది. అసలు షెడ్యూల్స్ త్వరలోనే మొదలవుతాయి. సీతారామం హడావుడిలో ఉండి ఆ షెడ్యూల్స్ ఆపాం. నిజంగా స్ట్రయిక్ టైమ్ లో ప్రాజెక్ట్-కె షూట్ ఉన్నట్టయితే, నేను ఆ స్ట్రయిక్ ను లెక్కచేసేవాడ్ని కాదు. ఈ నెలాఖరకు ప్రాజెక్టు-కె మళ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి, స్ట్రయిక్ గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు."
ప్రస్తుతం టాలీవుడ్ లో కొంతమంది నిర్మాతలు పాటిస్తున్న 'షూటింగ్స్ బంద్' అనే కాన్సెప్ట్ కొనసాగుతూనే ఉంది. దీనిపై 2 రోజుల కిందట ఓసారి సమావేశమై 24 నుంచి స్ట్రయిక్ ఎత్తేయాలని చూచాయగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంకా ఆ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.