Telugu Global
Cinema & Entertainment

ANR's Prathibimbalu Movie: 'ప్రతిబింబాలు' తో తిరిగి వస్తున్న ఏఎన్నార్!

ANR's Prathibimbalu Movie: ఎప్పుడో 1982 లో షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదలకి నోచుకోని ‘ప్రతిబింబాలు’ అనే చలన చిత్రం ఈ వారం విడుదలవుతోంది! ఇదేమీ చిన్న దర్శకుడు, చిన్న నిర్మాత తీసిన సినిమా కాదు.

ANRs Prathibimbalu Movie: ప్రతిబింబాలు తో తిరిగి వస్తున్న ఏఎన్నార్!
X

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు 255 సినిమాల్లో నటించి తెలుగు సినిమా చరిత్రకి నడిచే గ్రంథాలయమయ్యారు. నటనకి వర్ధమాన నటీనటులకి చెరగని శాశ్వత నిఘంటువయ్యారు. ఆయనకు విజయాలున్నాయి, పరాజయాలున్నాయి. కానీ నిర్మాణం ఆగిపోయిన సినిమాలు, పూర్తయ్యీ విడుదల కాని సినిమాలు వుంటాయనేది ఎవరి వూహకూ అందని విషయం. బాలకృష్ణ 'నర్తనశాల' ఆగిపోవచ్చు, రాజశేఖర్ 'పట్టపగలు' ఆగిపోవచ్చు, ఆఖరికి విజయ్ దేవరకొండ 'హీరో' కూడా ఆగిపోవచ్చు. ఎంఎస్ రాజు 'రంభా ఊర్వశీ మేనక' సైతం ఆగిపోవచ్చు. కానీ అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) లాటి మహానటుడి సినిమా ఆగిపోతుందా? ఆగిపోయిన సినిమా 40 ఏళ్ళ తర్వాత విడుదలవుతుందా?ఇదే ఇటీవల వెలుగు చూసిన విషయం.

ఎప్పుడో 1982 లో షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదలకి నోచుకోని 'ప్రతిబింబాలు' అనే చలన చిత్రం ఈ వారం విడుదలవుతోంది! ఇదేమీ చిన్న దర్శకుడు, చిన్న నిర్మాత తీసిన సినిమా కాదు. హేమీహేమీలైన ఇద్దరు దర్శకులు, నిర్మాత దీని వెనుక వున్నారు. అయినా ఏవో ఆర్థిక, చట్టపర కారణాలతో రీళ్ళు లాబ్ లో మగ్గుతూ వచ్చాయి. నయమేమిటంటే, సినిమాలు డిజిటలీకరణ అయ్యాక ఫిలిం రీళ్ళ పరిరక్షణని ల్యాబులు వదులుకుంటూ వచ్చాయి. వీటిని వెనక్కి తీసుకోమని నిర్మాతల్ని కోరాయి. చాలా మంది నిర్మాతలు డిజిటల్లోకి మార్చుకుని భద్రపర్చుకున్నారు. అయినా 'ప్రతిబింబాలు' ఫిలిం రీళ్ళు ఇంత కాలం ఎలాగో కాపాడుకున్న నిర్మాత, గత సంవత్సరం డిజిటలైజ్ చేసి ఇప్పుడు విడుదలకి సిద్ధం చేశారు.



నిండైన తారాగణం

'ప్రతిబింబాలు' లో ఏఎన్నార్ తో బాటు ప్రముఖ తారాగణముంది. జయసుధ, తులసి, గుమ్మడి, కాంతారావు, సుత్తివేలు, రామనుజాచారి, సాక్షిరంగారావు, అశోక్ కుమార్, అన్నపూర్ణ, పుష్పలత, జయమాలిని, అనురాధ తదితర తారాతోరణం కొలువుదీరింది. వీరిలో గుమ్మడి, కాంతారావు, సుత్తివేలు, సాక్షి రంగారావు మన మధ్య లేరు. జయసుధ, తులసి ఇద్దరు హీరోయిన్లతో ఇది ఏఎన్నార్ ప్రేమకథా చిత్రం. 1982 లో ఈ సినిమా ఆగిపోయే నాటికి ఏఎన్నార్ 1980లో 'ఏడంతస్తుల మేడ', 1981 లో 'ప్రేమా భిషేకం', 'శ్రీవారి ముచ్చట్లు', 1982 లో 'మేఘ సందేశం' వంటి సూపర్ మ్యూజికల్ హిట్ సినిమాలతో ఎన్టీఆర్ తో సమానంగా స్టార్ డమ్ తో వున్నారు. ఈ మూడేళ్ళలో 15 సినిమాల్లో నటించి బిజీగా వున్నారు. ఆ తర్వాత 1983-90 మధ్య ఏడేళ్ళలో ఇంకో 30 సినిమాలూ నటించి, తర్వాతి తరం హీరోలైన కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల కాలంలోనూ తగ్గలేదు. అలాటి ఏఎన్నార్ సినిమా 'ప్రతిబింబాలు' మధ్యలో ఎందుకు అనాధ అయిపోయింది. ఏఎన్నార్ కూడా దీన్ని విడుదల చేయించేందుకు చేయని ప్రయత్నం లేదు.

'ప్రతిబింబాలు' 1980 ప్రాంతంలో విష్ణుప్రియ సినీ కంబైన్స్ బ్యానర్ పై కెఎస్. ప్రకాశ రావు (కె. రాఘవేంద్ర రావు తండ్రి) దర్శకత్వంలో నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి అన్నపూర్ణ స్టూడియోలో మొదలుపెట్టారు. ఈయన 'వియ్యాలవారి కయ్యాలు', 'కోరుకున్న మొగుడు', 'కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త' సినిమాలు నిర్మించారు. అయితే 'ప్రతిబింబాలు' దర్శకత్వం వహిస్తున్న కెఎస్ ప్రకాశరావు మృతి చెందడంతో, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఎలాగో పూర్తి చేశారు.


యూత్ ఫుల్ ఏఎన్నార్

అయితే తర్వాత ఆర్టిస్టుల డేట్లు, షూటింగ్ తర్వాత సన్నివేశాలు మార్చాల్సి రావడం, ఆర్ధిక, న్యాయపర సమస్యలూ ఇవన్నీ కలిసి కాలగర్భంలో పడేశాయి సినిమాని. మరి కాలగర్భంలో కలిసిపోయిన సినిమాని ఇప్పుడెందుకు బయటికి తీశారు. గత రెండు నెలలుగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ప్రభాస్ బర్త్ డేలకి వారి సూపర్ హిట్లు రీరిలీజ్ చేసే సరికొత్త ట్రెండ్ ప్రారంభించడంతో, తనూ అక్కినేని 'ప్రతిబింబాలు' తీసుకుని ఇదే సమయమనుకుని ట్రెండ్ లో ఓ దూకుడు దూకారా నిర్మాత?

ఇదేమీ కాదు. గత సంవత్సరమే మే నెలలో విడుదల చేయాలనుకున్నారు. కుదరలేదు. ఈ మేరకు గత సంవత్సరం వచ్చిన వార్తలు సాక్ష్యంగా వున్నాయి. తర్వాత ఈ సంవత్సరం సెప్టెంబర్ 20న ఏఎన్నార్ జన్మ దినోత్సవానికి అనుకున్నారు. ఈ వార్త కూడా సెప్టెంబర్ లో రికార్డయింది. అది కూడా సాధ్యంకాక ఇప్పుడు విడుదల చేస్తున్నారు. స్టార్ల బర్త్ డే సినిమాల ట్రెండ్ తో ఏ సంబంధమూ లేదు.

డీఐ, డీటీఎస్ వంటి టెక్నాలజీలతో డిజిటల్ కి మార్చి ఈ శనివారం నవంబర్ 5 న 225 కేంద్రాల్లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. దీని ట్రైలర్ కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా విడుదలవుతున్న విషయం ప్రేక్షకుల్లోకి అంత బలంగా వెళ్ళలేదు. నాగార్జున లేదా నాగ చైతన్యతో ఓ ఈవెంట్ నిర్వహించి వుంటే మెరుగ్గా వుండేది. అయినా ఈ కాలంలో ఏఎన్నార్ అభిమానులైనా ఈ సినిమాపై ఆసక్తి చూపే అవకాశముందా అన్నది ప్రశ్న. అయితే ఇది ఈ కాలానికి తగ్గ కథే అంటున్నారు నిర్మాత రాధాకృష్ణ.

పైగా ఏఎన్నార్ ద్విపాత్రాభినయం ఛేశారని, ఇప్ప‌టి వ‌ర‌కూ లేని ఒక కొత్త క‌థ‌తో ఈ సినిమాని మొద‌లు పెట్టామని, ఈ సినిమా చూసిన అక్కినేని అభిమానులు, ఇత‌ర ప్రేక్ష‌కులు కూడా స‌రికొత్త అనుభూతిని పొందుతారనీ, న‌వ యువ‌కుడిగా ఏఎన్నార్ అలరిస్తారనీ అంటున్నారు నిర్మాత. అయితే ప్రేక్షకులు సిద్ధమై ఈ టైమ్ ట్రావెల్ చేయాల్సిందే.

'ప్రతిబింబాలు' కథ: జె.ఆర్.కె.మూర్తి, స్క్రీన్ ప్లే, మాటలు: ఆత్రేయ, పాటలు: వేటూరి, సంగీతం: చక్రవర్తి, కెమెరా: సెల్వరాజ్, హరనాధ్, ఎడిటింగ్: వీరప్ప వి.ఎస్. నిర్మాత: జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి, దర్శకత్వం: కె. ఎస్. ప్రకాష్ రావు, సింగీతం శ్రీనివాసరావు.

First Published:  3 Nov 2022 11:49 AM IST
Next Story