నిర్మాతగా అలీ మొదటి సినిమా 'ఆహా'లోకి!
అలీ నిర్మాతగా మారారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి పేరుతో సినిమా తీశారు. ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది.
దాదాపు 40 ఏళ్లుగా పరిశ్రమలో కొనసాగుతున్నారు అలీ. కానీ ఎప్పుడూ సినిమా నిర్మించాలని అనుకోలేదు. మొదటిసారి ఆయన నిర్మాతగా మారారు. ఓ రీమేక్ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదు. నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఆ సినిమా పేరు 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి'.
మలయాళంలో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన 'వికృతి' సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా రీమేక్ చేసి తెరకెక్కించారు. యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. అలీ సమర్పణలో అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా.. అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో నటించారు.
శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 28న ఆహాలో స్ట్రీమింగ్ కు పెడుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో సినిమా ట్రైలర్, టీజర్‌ను ఘనంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శక, నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, స్టార్ కామెడియన్ బ్రాహ్మానందం హాజరయ్యారు.
ఈ సినిమాతో నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు అలీ. భవిష్యత్తులో తనను కదిలించే మంచి సబ్జెక్టులు దొరికితే సినిమాలు చేస్తానంటున్నారాయన.