టాలీవుడ్ లో మంచి ట్రెండ్ నడుస్తోంది
ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్లో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదంటున్నారు అల్లు అర్జున్. కంటెంట్ ఉన్న సినిమానే ఆడుతోందని, అదే ఇప్పుడు టాలీవుడ్ ట్రెండ్ అని అన్నారు.
ఇండస్ట్రీలో ప్రతి సీజన్ కు ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. ఓసారి ఫ్యాక్షన్ కథలు వరుసగా వస్తాయి, మరోసారి ప్రేమకథలు హోరెత్తుతాయి. ఇంకోసారి హారర్-కామెడీలు రాజ్యమేలుతాయి. అయితే ఈసారి మాత్రం ఓ డిఫరెంట్ ట్రెండ్ నడుస్తోందంటున్నాడు హీరో అల్లు అర్జున్. అదేంటో ఆయన మాటల్లోనే...
"అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. కరోనా తర్వాత చాలా సినిమాలొచ్చాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా కొన్ని హిట్టవుతున్నాయి, కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. చిన్నవి ఆడుతున్నాయా, పెద్దవి ఆడుతున్నాయా అనే తేడా లేదు. ఇప్పుడున్న ట్రెండ్ ఒక్కటే. మంచి సినిమా వస్తే ఆడుతుంది. అది చిన్నదా, పెద్దదా అనేది జనాలు పట్టించుకోవడం లేదు. నిజానికి ఇది చాలా మంచి ట్రెండ్."
ఇలా టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి ట్రెండ్ నడుస్తోందన్నాడు బన్నీ. శ్రీవిష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్, ఈ వ్యాఖ్యలు చేశాడు. హిట్-ఫ్లాప్ తో సంబంధం లేకుండా మంచి కాన్సెప్టులు, కథలు ఎంచుకుంటున్న శ్రీవిష్ణు అంటే తనకు ప్రత్యేక గౌరవం అని చెప్పుకొచ్చిన బన్నీ, కెరీర్ స్టార్టింగ్ నుంచి శ్రీవిష్ణును గమనిస్తూనే ఉన్నానని అన్నాడు.
బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన అల్లూరి సినిమా ఈనెల 23న థియేటర్లలోకి వస్తోంది. ఇందులో శ్రీవిష్ణు పోలీసాఫీసర్ గా కనిపించాడు.