చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాల మధ్య గొడవలున్నాయా?
చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయా? చాలా మంది కి ఈ అనుమానం ఉంది. మరి దీనిపై అల్లు అరవింద్ స్పందన ఏంటి?
మెగా కుటుంబంలో చీలికలు.. చిరంజీవి కుటుంబం, అల్లు అరవింద్ కుటుంబం మధ్య గొడవలు.. రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య ఆధిపత్య పోరు.. ఇలాంటి హెడ్డింగులు కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. వీటిపై మెగా కాంపౌండ్ హీరోలు ఎప్పుడూ స్పందించలేదు. ఇన్నాళ్లకు దీనిపై క్లారిటీ వచ్చింది. స్వయంగా అల్లు అరవింద్ ఈ పుకారుపై స్పందించారు.
"నేను, చిరంజీవి 80వ దశకం నుంచి చాలా క్లోజ్ గా ఉన్నాం. మేం బంధువులుగా కాకుండా, మంచి స్నేహితులుగా పైకొచ్చాం. అలా ఎదిగే క్రమంలో మా కుటుంబాలు పెరిగాయి, పిల్లలు పుట్టారు, ఇదే వృత్తిలో ఉన్నారు. చిన్న ఇండస్ట్రీలో ఉన్న అవకాశాల్నే పంచుకోవాలి. కాబట్టి పోటీ తప్పదు. ఎవరి అవకాశాలు వాళ్లు తీసుకొని పైకి ఎదుగుతున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రజలు మా రెండు కుటుంబాలకు పడట్లేదని అనుకోవడం సహజం. అయితే ఇలా అనుకునేవాళ్లంతా ఒక విషయం గ్రహించాలి. మేమంతా ఒకటే. ఏదైనా సమస్య వస్తే మేమంతా ఒకే మాట మీద ఉంటాం."
ఇప్పటికీ పండగల్ని చిరంజీవితోనే కలిసి జరుపుకుంటామంటున్నారు అరవింద్. జనాలు ఏదో అనుకుంటున్నారని, తమ మధ్య ఉన్న అనుబంధాన్ని వీడియో తీసి పెట్టాల్సిన అవసరం లేదన్నారు.
"సంక్రాంతికి మేం మా ఇంట్లో పండగ చేసుకోం. మా నాన్నగారు అల్లు రామలింగయ్యగారికి పండగ రోజున చేయాల్సిన ఆచారాలు, పూజలు చేసిన తర్వాత, మేమంతా చిరంజీవి ఇంటికి వెళ్లిపోతాం. దీపావళి వస్తే మేం మా ఇంట్లో ఉండం. చిరంజీవి ఇంటికి వెళ్లిపోతాం. మేమే కాదు, అందరం చిరంజీవి ఇంటికే చేరుకుంటాం. ఇదేదో మేం కొత్తగా చేస్తోంది కాదు, దశాబ్దాలుగా ఇలానే ఉన్నాం. ఇప్పుడు జనాలు ఏదో అనుకుంటున్నారని, దీపావళి-సంక్రాంతి సంబరాల్ని మేం షూట్ చేసి జనాల మధ్య పెట్టలేం కదా. "
ఇలా చిరంజీవి కుటుంబంతో, తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు అరవింద్. "మెగా కాంపౌండ్ హీరోలంతా ఎవరి సినిమాలతో వాళ్లు పైకొస్తున్నారు. పోటీ అనేది ఉంది. కానీ అంతా ఒకటే." అంటూ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.