బంద్ అన్నారు.. అందరూ షూటింగ్స్ చేసుకుంటున్నారు
షూటింగ్స్ బంద్ అంటూ ఆర్భాటంగా ప్రకటించారు. అలా ప్రకటించిన వెంటనే షూటింగ్స్ స్టార్ట్ చేశారు.
నిరాహార దీక్ష ప్రకటించి కడుపునిండా భోజనం చేస్తే ఎలా ఉంటుంది. సమ్మె ప్రకటించి రోజంతా ఆఫీస్ లో ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుంది? రాస్తారోకో ప్రకటించి తామే వాహనాలకు దారిచ్చి, ట్రాఫిక్ క్లియర్ చేస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న సమ్మె కూడా అలానే ఉంది. ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ బంద్ అన్న గిల్డ్ నిర్మాతలే స్వయంగా తన సినిమాల కొత్త షెడ్యూల్స్ మొదలుపెట్టారు.
గిల్డ్ లో కీలక సభ్యుడు దిల్ రాజు, స్వయంగా తన కొత్త సినిమా, కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమా చేస్తున్నాడు ఈ బడా ప్రొడ్యూసర్. నిన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ వైజాగ్ లో మొదలైంది. ఇక మరో గిల్డ్ సభ్యుడు, నిర్మాత నాగవంశీ కూడా ధనుష్ హీరోగా చేస్తున్న సర్ అనే సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు.
ఇక గిల్డ్ లో సభ్యులు కానీ మిగతా నిర్మాతలు కూడా నిన్నంతా తమ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఇలా బంద్ ప్రకటించిన రోజునే అటుఇటుగా 15 సినిమాల వరకు నిర్మాణాలు జరుపుకున్నాయి. దీంతో షూటింగ్స్ బంద్ అనే అంశం పెద్ద జోక్ గా మారిపోయింది.
మరోవైపు స్వయంగా గిల్డ్ సభ్యులే తమ నిర్ణయాన్ని సమర్థించుకోలేని పరిస్థితుల్లో పడిపోయారు. ఏకపక్షంగా ఓ 20 మంది నిర్మాతలు నిర్ణయం తీసుకొని, మొత్తంగా టాలీవుడ్ లో సినిమాల షూటింగ్స్ ఆపేయాలనడం ఎంత కరెక్ట్ అంటూ తిరుగుబాటు మొదలైంది. స్వయంగా అశ్వనీదత్ లాంటి సీనియర్ నిర్మాతలు బంద్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.