Telugu Global
Cinema & Entertainment

ఈ విండో మాకొద్దు అంటున్న తమిళ, మలయాళ ఎగ్జిబిటర్లు

తమిళనాడు థియేటర్ అండ్ మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఓటీటీ విండోపై మరోసారి గళమెత్తారు.

ఈ విండో మాకొద్దు అంటున్న తమిళ, మలయాళ ఎగ్జిబిటర్లు
X

తమిళనాడు థియేటర్ అండ్ మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఓటీటీ విండోపై మరోసారి గళమెత్తారు. నాలుగు వారాల విండో థియేటర్లు, మల్టీప్లెక్సులు మూతపడే పరిస్థితిని సృష్టిస్తున్నాయని విమర్శించారు. ఇటీవల జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో సభ్యులు తామెదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి అనంతర మార్కెట్లో కొత్త తమిళ సినిమాల కోసం ఎక్కువ థియేట్రికల్ విండో సహా, చాలా కాలంగా పెండింగ్‌లో వున్న కొన్ని డిమాండ్లని పునరుద్ఘాటించారు. సినిమాల థియేట్రికల్ రన్ తగ్గుదలపై సభ్యులు కొన్ని నెలలుగా పోరాడుతూనే వున్నారు.

కొత్త తమిళ సినిమాలు విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. విడుదలైన 28 రోజుల్లోనే చాలా కొత్త సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ లోకి వచ్చేస్తున్నాయి. చిన్న-బడ్జెట్ సినిమాలు ఈ సమస్యని తీవ్రంగా ఎదుర్కోవడమే కాకుండా, పెద్ద బ్లాక్‌బస్టర్‌లు కూడా తక్కువ థియేట్రికల్ రన్ తో ముగియడంతో వాటి బాక్సాఫీసు వసూళ్ళ సామర్ధ్యం గణనీయంగా తగ్గిపోయింది.

ఉదాహరణకు, తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన గత సంవత్సరపు బ్లాక్ బస్టర్ ‘లియో’ ప్రేక్షకులని థియేటర్లకి రప్పిస్తున్నప్పటికీ ఓటీటీ స్ట్రీమింగ్ లోకొచ్చేసింది. కరోనా మహమ్మారి కాలం నుంచి ఓటీటీల ఆగమనం ప్రేక్షకులు వినోద కంటెంట్‌ ని వినియోగించే విధానంలో గణనీయమైన మార్పుకి దోహదం చేయడం థియేటర్‌లకి తీవ్ర అస్తిత్వ సవాలుగా మారింది.

తమిళనాడులో ప్రేక్షకులు థియేటర్లకి వెళ్ళే ప్రయత్నం చేయకుండా, కొత్త సినిమాల్ని ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో చూసేందుకు వేచి చూస్తున్నారు. దీనికి తగ్గట్టు ఇలాగే కొత్త సినిమాలు 4 వారాల ఓటీటీ విండోతో కొనసాగితే, ఇక థియేటర్లు మూతబడడం ఖాయమని ఎగ్జిబిటర్లు భయపడుతున్నారు. ఈ భయాందోళనలు, నిరసనలు కొన్నాళ్ళుగా తెరపైకొస్తున్నప్పటికీ నిర్మాతలు కొత్త సినిమాలని తమ ధోరణిలో 4 వారాల్లో ఓటీటీలకి అమ్మేసుకుని సొమ్ములు చేసుకుంటున్నారు.

తమిళనాడులోని ఎగ్జిబిటర్లు ఈ ఛాలెంజ్‌తో పోరాడుతున్నట్టే, కేరళలోని ఎగ్జిబిటర్లు కూడా ఇదే సమస్యతో సమరం చేస్తున్నారు. ఫలితంగా చాలా మంది కేరళ థియేటర్ యజమానులు కనీసం ఆరు వారాల పాటు థియేటర్లలో రన్ చేయడానికి ప్లాన్ చేయని కొత్త మలయాళ సినిమాల్ని ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో థియేటర్లు, మల్టీప్లెక్సులు ఇప్పటికే ఇలాంటి పద్ధతులనే అవలంబించి 8 వారాల ఓటీటీ విండోని సాధించుకున్నారు.

ఇటీవలి సౌత్ ఇండియన్ రిలీజ్‌లన్నింటినీ గమనిస్తే, బాక్సాఫీసు రిజల్టుతో సంబంధం లేకుండా అన్ని సినిమాలూ 4 లేదా 5 వారాల్లోనే ఓటీటీల్లో వచ్చేస్తున్నాయి. థియేటర్లలో సినిమాలు బ్లాక్‌బస్టర్స్ గా రన్ అవుతూ యాజమాన్యాలకి వసూళ్ళ పంట అందిస్తున్నప్పటికీ, కేవలం 4-5 వారాల్లో ఆ బ్లాక్ బస్టర్స్ ఓటీటీల్లోకి వచ్చేసి థియేటర్ వసూళ్ళకి గండి కొడుతున్నాయి. తమిళంలోనే కాదు, ఇది తెలుగు సినిమాలు సహా మొత్తం సౌత్ ఇండియన్ సినిమాలతో జరుగుతోంది. చాలా సినిమాల్ని విడుదలకి ముందుగానే ఓటీటీ ఒప్పందాల్ని లాక్ చేసి పెద్ద ధరలకు అమ్ముకుంటున్నారు.

‘కేజీఎఫ్ 2’, ‘ఆర్ ఆర్ ఆర్’ వంటి కొన్ని పానిండియన్ సినిమాలు థియేట్రికల్ విడుదలకి- ఓటీటీ స్ట్రీమింగ్ కీ మధ్య ఎక్కువ గ్యాప్ కలిగి వుండి, హిందీ వెర్షన్ థియేట్రికల్ విడుదలలకి నిర్మాతలకి ఎటువంటి సమస్యల్ని ఎదురు కాలేదు. అయితే ‘పొన్నియిన్ సెల్వన్2’, ‘జైలర్’, ‘లియో’ సినిమాలు ప్రారంభ 4 వారాల ఓటీటీ ఒప్పందాల కారణంగా హిందీ వెర్షన్ విడుదలలకి సమస్యల్ని ఎదుర్కొన్నాయి.

నేటి నుంచి కొత్త సినిమాలు బంద్!

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఓటీటీ విండోలకి సంబంధించిన వివాదానికి ప్రతిస్పందనగా, ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ ఈ రోజు నుంచి (గురువారం) థియేటర్లలో మలయాళ సినిమాల విడుదలల్నినిలిపివేయాలని నిర్ణయించింది. అసలు మలయాళ సినిమాలకు 42 రోజుల (ఆరు వారాలు) ఓటీటీ విండో మౌఖిక ఒప్పందం వుంది కానీ ఆచరణలో నిర్మాతలు ఖాతరు చేయకుండా 28 రోజులకే స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో థియేటర్‌లలో విడుదలైన రెండు నుంచి మూడు వారాలలోపే స్ట్రీమింగ్ కి గేట్లు బార్లా తెరిచేస్తున్నారు. దీంతో తమ వసూళ్ళు దెబ్బతింటున్నాయని థియేటర్ల యజమానులు ఎదురు తిరగడం మొదలెట్టారు. అయితే థియేటర్లలో తక్కువ వసూళ్ళు కనబరుస్తున్న సినిమాలకి ఓటీటీ విడుదలని ఆలస్యం చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోతామని నిర్మాతలు వాదిస్తున్నారు.

హిందీ-మాట్లాడే బెల్ట్ లో మల్టీప్లెక్స్ చైన్‌లు గణనీయమైన ఉనికిని కలిగి వుంటాయి కాబట్టి, ఎనిమిది వారాల విండోని అమలు చేయించే పరపతి మల్టీప్లెక్స్ యజమాన్యాలకుందని, సౌత్ లో మల్టీప్లెక్సుల సంఖ్య తక్కువ కావడంతో హిందీ బెల్ట్ ఫార్ములాని యాజమాన్యాలు అమలు చేయించలేక పోతున్నాయని తెలుస్తోంది. ఇక సినిమా మార్కెట్ చాలా విచ్ఛిన్నమై వున్న కేరళలో కామన్ విండో వ్యవధిని అమలు చేయడం కష్టమనీ అంటున్నారు.

రాబోయే వారాల్లో పెద్ద మలయాళ సినిమాల విడుదలలు ఏవీ లేకపోవడంతో, థియేటర్లలో కొత్త విడుదలలపై ప్రస్తుత నిలిపివేత ఎటువంటి తక్షణ ప్రభావం చూపకపోవచ్చనీ అంటున్నారు. అంతేకాకుండా, సినిమాలకి నిరంతరం కొత్త కంటెంట్ అవసరం కాబట్టి, ఓటీటీ విడుదలల్ని ఆలస్యం చేయడానికి నిర్మాతల్ని సులభంగా ఒప్పించే అవకాశం లేదని కూడా తెలుస్తోంది. ఈ బంద్ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.

First Published:  22 Feb 2024 3:33 PM IST
Next Story