Telugu Global
Cinema & Entertainment

Adipurush: నేటి నుంచి నేపాల్ లో హిందీ సినిమాలు బంద్

Adipurush Row: ‘ఆదిపురుష్’ దెబ్బకి నేపాల్లో హిందీ సినిమాలు బ్యాన్ అయిపోయాయి.

ఆదిపురుష్
X

ఆదిపురుష్

‘ఆదిపురుష్’ దెబ్బకి నేపాల్లో హిందీ సినిమాలు బ్యాన్ అయిపోయాయి. అయితే ‘ఆదిపురుష్’ వివాదాలోక వైపూ- దీంతో సంబంధం లేకుండా వసూళ్ళ తూఫానొక వైపూ జోడు గుర్రాల్లా పరుగుదీస్తున్నాయి. ఎన్ని వివాదాలు రేపి ఎవరెన్ని అభ్యంతరాలు లేవదీసినా, సినిమా మాత్రం మూడు రోజుల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొడుతోంది. విడుదలైన మూడు రోజుల్లో రూ 340 కోట్లు వసూలు చేసి ఆశ్చర్య పరుస్తోంది.

అయితే మన దేశంలో ఈ వివాదాస్పద సినిమాని నిషేధించే అవకాశం లేకపోయినా, నేపాల్ ప్రభుత్వం ఈ పని చేసి చూపెట్టింది. ‘ఆదిపురుష్ ‘ నే కాదు, మొత్తం అన్ని హిందీ సినిమాలనీ నిషేధించేసింది. ఖాట్మండూ నగరంలో నేటి నుంచి విధించిన ఈ నిషేధం, పోఖారా నగరానికి కూడా విస్తరించింది. నిషేధం విధించడానికి ఇక్కడి కారణం వేరు. అసలు నిషేధం విధించడానికి ముందు నిర్మాతలకి అల్టిమేటం ఇచ్చింది. నిర్మాతలు సానుకూలంగా స్పందించక పోవడంతో నిషేధం విధించింది...నేపాల్ పుత్రిక అయిన సీతని భారత పుత్రిక అన్నందుకు ఈ నిషేధం. ఈ నిషేధపు చురక ‘ఆదిపురుష్’ తో సరిపెట్టకుండా మొత్తం అన్ని హిందీ సినిమాలకీ అంటించింది.

నిషేధాన్ని అమలు చేయడానికి ఖాట్మండులోని 17 సినిమా థియేటర్లలో పోలీసు సిబ్బందిని మోహరించారు. పోలీసులు హిందీ సినిమాలు ప్రదర్శించకుండా చూసుకున్నారు. ఈ గొడవల మధ్య ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా, నేపాల్‌లోనే కాకుండా భారతదేశంలో కూడా "ఆదిపురుష్"లోని "జానకి భారతదేశపు కుమార్తె" అనే డైలాగ్‌ ని తొలగించే వరకు ఖాట్మండు మెట్రోపాలిటన్ సిటీలో ఏ హిందీ సినిమానీ ప్రదర్శించాడానికి అనుమతించబోమని ప్రకటించారు.

జానకి అని కూడా పిలుచుకునే సీత ఆగ్నేయ నేపాల్‌లోని జనక్‌పూర్‌లో జన్మించిందని చాలామంది నమ్ముతారు. ఇలా వుండగా, పోఖారా మెట్రోపాలిటన్ నగరానికి చెందిన మేయర్ ధనరాజ్ ఆచార్య కూడా ఈ వివాదం కారణంగా సినిమా ప్రదర్శనకి అనుమతి లేదని ధృవీకరించారు. గడువులోపు సినిమా నుంచి అభ్యంతరకరమైన భాగాన్ని తొలగించడానికి మూడు రోజుల ముందు నోటీసు జారీ చేసినట్లు ఖాట్మండూ మేయర్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ‘ఆదిపురుష్’ నిర్మించిన టీ- సిరీస్ సంస్థకి చెందిన రాధికా దాస్, ఖాట్మండు మేయర్‌కి ఒక లేఖ రాశారు. ఇది (సినిమాలోని అంశం) ఎవరికీ ఎటువంటి అశాంతి కలిగించడానికీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ఆమె లేఖలో పేర్కొన్నారు. సినిమాని దాని కళాత్మక రూపంలో చూడాలని, చరిత్రపై ఆసక్తిని సృష్టించడానికి ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యే లక్ష్యానికి మద్దతు నివ్వాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నామనీ ఆమె లేఖలో విన్నవించారు.

ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా మాత్రం నిన్న జూన్ 18న నేపాల్ రాజధానిలోని అన్ని సినిమా హాళ్ళలో అన్ని బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనని నిలిపివేయాలని ఆదేశించారు. జానకిని భారతీయ మహిళగా చూపించే అభ్యంతరకరమైన సెక్షన్‌ ని తొలగించాలని మూడు రోజుల క్రితం ‘ఆదిపురుష్’ నిర్మాతలకి పిలుపు నిచ్చామని, నేపాల్ సార్వభౌమాధికారాన్ని, స్వాతంత్ర్యాన్నీ, ఆత్మగౌరవాన్నీ పరి రక్షించడం అన్ని నేపాల్ ప్రభుత్వాల, ప్రభుత్వేతర సంస్థల, నేపాల్ పౌరుల ప్రథమ కర్తవ్యమనీ, ఈ అభ్యంతరకరమైన భాగాన్ని సినిమానుంచి తొలగించే వరకూ ఖాట్మండు మునిసిపాలిటీ ప్రాంతంలో ఏ భారతీయ చలనచిత్రాన్నీ ప్రదర్శించడానికి అనుమటించబోమనీ షా ఉద్ఘాటించారు.

నేపాల్ సమాజం రామాయణంలోని కథానాయిక సీతతో తనకున్న సంబంధం గురించి గర్విస్తుంది. నేపాల్‌లోని జనక్‌పూర్ సీత నివాసం అని నమ్ముతారు. అక్కడ ఆమె తండ్రి జనక మహారాజు రాజ్య పాలన చేశాడు. ఈ కారణంగా సీతని జనకుని కుమార్తె జానకి అని కూడా పిలుస్తారు.

నేపాల్ కి బాలీవుడ్ తో పూర్వం నుంచీ సత్సంబంధాలున్నాయి. ప్రసిద్ధ హీరోయిన్ మనీషా కొయిరాలా, గాయకుడు ఉదిత్ నారాయణ్ వంటి బాలీవుడ్‌లోని అనేక ప్రముఖ పేర్లు నేపాల్‌ మూలాల్ని కలిగి వున్నవే. గోవిందా, మాలా సిన్హా, భారతీ సింగ్, అహ్మద్ ఖాన్, డానీ డెంగ్జోపా మొదలైన ప్రముఖులు ఇండియాలో అభిమాన తారలుగా పాపులర్ అయిన వారే.

నేపాల్ ప్రభుత్వం విధించిన నిషేధం పై బాలీవుడ్ ఇంకా స్పందించలేదు. ‘ఆదిపురుష్’ నిర్మాతలు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలీదు. ఆ డైలాగు తీసేస్తే వచ్చే నష్టమేమిటో కూడా తెలీదు. లేదా నేపాల్ పుత్రిక అని మారిస్తే వచ్చే ప్రమాదమేమిటో కూడా తెలీదు. తెలుగులో బాపు- రమణలు రూపొందించిన ‘సీతాకళ్యాణం’ లో సీత నేపాల్లో జన్మించినట్టుగానే చూపించారు.

First Published:  19 Jun 2023 8:40 PM IST
Next Story