Anushka Shetty | మరో ప్యాన్ ఇండియా మూవీలో అనుష్క - 14 భాషల్లో అనువాదం
Anushka Shetty in Kathanar - The Wild Sorcerer | కేరళలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రోజిన్ థామస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.
ఇప్పటివరకు తెలుగు, తమిళ సినిమాల్లో మాత్రమే నటించిన హీరోయిన్ అనుష్క శెట్టి.. ఇప్పుడు తొలిసారిగా మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. అది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం కావడం.. ప్యాన్ ఇండియా లెవెల్‌లో దానిని రూపొందిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని 14 భాషల్లో అనువదించనున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. మరో విశేషమేమిటంటే.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తుండటం. తొలి భాగాన్ని 2024లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు చెబుతున్నారు.
'కథనార్- ది వైల్డ్ సోర్సెరర్' (Kathanar - the wild sorcerer) పేరుతో రానున్న ఈ హర్రర్ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రంలో అనుష్క పాత్ర అరుంధతి తరహాలో ఉంటుందని సమాచారం. ఇందులో జయసూర్య హీరోగా నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
కేరళలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. రోజిన్ థామస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తన 18 ఏళ్ల కెరీర్‌లో అనుష్క ఇప్పటి వరకు తమిళ, తెలుగు సినిమాల్లో మాత్రమే నటించారు. మొదటిసారి మలయాళ చిత్రంలో నటించడం అదీ ఈ స్థాయి సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్ గా మారింది.
ఇక అనుష్క చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేశ్ బాబు. పి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించారు. ఆయన స్టాండప్ కమెడియన్ పాత్రలో కనిపిస్తుండగా.. అనుష్క చెఫ్‌గా నటించారు. ఈ చిత్ర బృందమంతా దీని ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ సినిమా విడుదల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.