Telugu Global
Cinema & Entertainment

సీబీఐ ఆఫీస్‌కు వెళ్తానని జీవితంలో అనుకోలేదు - హీరో విశాల్

'రీల్ లైఫ్‌లోనే కాదు..రియల్ లైఫ్‌లో కూడా అవినీతిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ' అని విశాల్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

సీబీఐ ఆఫీస్‌కు వెళ్తానని జీవితంలో అనుకోలేదు - హీరో విశాల్
X

తమిళ హీరో విశాల్ ఇటీవల మార్క్ ఆంటోనీ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విశాల్‌తో పాటు ఎస్‌జె సూర్య ముఖ్యపాత్రలో నటించాడు. పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ విషయంలో లంచం ఇవ్వాల్సి వచ్చిందని విశాల్ అప్పట్లో ఆరోపణలు చేశాడు. మార్క్ ఆంటోనీ సినిమా సెన్సార్ కోసం దాదాపు రూ.6.5 లక్షలు లంచంగా చెల్లించినట్లు విశాల్ చెప్పాడు.

భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఏ నిర్మాతకు రాకూడదని.. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను విశాల్ కోరాడు. దీనిని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సీబీఐని రంగంలోకి దించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ)పై సీబీఐ కేసు కూడా నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవల విశాల్ సీబీఐ ఎదుట హాజరయ్యాడు. ఈ విషయాన్ని విశాల్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా వెల్లడించాడు. సీబీఎఫ్‌సీ కేసు విచారణలో భాగంగా ముంబైలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లినట్లు విశాల్ తెలిపాడు.

'నాకు ఇది పూర్తిగా కొత్త అనుభవం. సీబీఐ అధికారులు విచారించిన తీరుపై నేను సంతృప్తిగా ఉన్నాను. సీబీఐ కార్యాలయం ఎలా ఉండాలనే విషయమై కూడా అధికారులు నా నుంచి కొన్ని సూచనలు తీసుకున్నారు. నేను జీవితంలో సీబీఐ ఆఫీసుకు వెళ్తానని అసలు అనుకోలేదు. రీల్ లైఫ్‌లోనే కాదు..రియల్ లైఫ్‌లో కూడా అవినీతిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ' అని విశాల్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.


First Published:  29 Nov 2023 2:08 PM IST
Next Story