Telugu Global
NEWS

తెలుగు కామెడీ టు తమిళ విలనీ అతనే!

గత వారమే ‘మార్క్ ఆంటోనీ’, కొద్ది వారాల ముందు ‘జైలర్’ వంటి తమిళ హిట్ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు సైతం పొందాడు. వీటికి ముందు ‘పుష్ప 1’ లో పచ్చి విలన్ గా ఎలా సక్సెస్ అయ్యాడో తెలిసిందే.

తెలుగు కామెడీ టు తమిళ విలనీ అతనే!
X

కమెడియన్ సునీల్ హీరోగా విఫలమైన చోట విలనీ చేపట్టి పాపులర్ అవుతున్న క్రమం నేడు కనిపిస్తోంది. బ్రహ్మానందం, బాబూమోహన్, అలీ, వేణుమాధవ్, సప్తగిరి వంటి కమెడియన్లు సోలో హీరోలుగా నటించి మెప్పించారు. కానీ, అది కొంత కాలమే. పూర్వం బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో తాతా మనవడు, పిచ్చోడి పెళ్ళి , తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు సినిమాల్లో హాస్య చక్రవర్తి రాజబాబు హీరోగా నటించాడు. పిచ్చోడి పెళ్ళి తప్పితే మిగిలిన సినిమాల్లో విషాద పాత్రలే పోషించి ఏడ్పించాడు. ఇలా తెలుగు కమెడియన్లు హీరోల వరకూ వచ్చి ఆగారు. కానీ, కమెడియన్ సునీల్ హీరోగా ప్రయత్నించినంతలోనే ఆ అధ్యాయం ముగిశాక, విలన్ అవతారమెత్తి చేస్తున్న విజయయాత్ర తెలుగు సినిమాలు దాటి తమిళ సినిమాల్ని ఆక్రమిస్తోంది.

గత వారమే ‘మార్క్ ఆంటోనీ’, కొద్ది వారాల ముందు ‘జైలర్’ వంటి తమిళ హిట్ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు సైతం పొందాడు. వీటికి ముందు ‘పుష్ప 1’ లో పచ్చి విలన్ గా ఎలా సక్సెస్ అయ్యాడో తెలిసిందే. ‘జైలర్’ లో విలన్ పాత్ర కాకపోయినా, స్టార్ హీరోయిన్ తమన్నా కాంబినేషన్లో కామెడీ పాత్ర పోషించాడు. ఈ కామెడీ క్యారక్టర్ తో రజనీకాంత్ తో కూడా కొన్ని సీన్లలో, ఓ పాటలో అలరించాడు. ఇక విశాల్ ద్విపాత్రాభినయం చేసిన ‘మార్క్ ఆంటోనీ’ లో విలన్ గా, మంచివాడుగా రెండు షేడ్స్ వున్న పాత్రల్లో ఆశ్చర్య పర్చే నటన కనబర్చాడు.

2000లో ‘చిరునవ్వుతో’ సినిమాతో కమెడియన్ గా రంగప్రవేశం చేసి, పదుల సంఖ్యలో సినిమాల్లో బిజీ కమెడియన్ గా టాప్ కి చేరుకున్న తర్వాత- 2010లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం లో సూపర్ హిట్ ‘మర్యాద రామన్న’ తో యాక్షన్ హీరోగా కొత్త చాప్టర్ తెరిచాడు. ‘మర్యాద రామన్న’ లో తనని ప్రేక్షకులు హీరోగా అంగీకరించినా, అలాంటి సాఫ్ట్ హీరోగా కొనసాగక, ఇతర స్టార్ హీరోలలాగా సిక్స్ ప్యాక్ బాడీతో మెటా యాక్షన్ హీరోగా ఎదగాలన్న పొరపాటు నిర్ణయం వల్ల, ఆ తర్వాత నటించిన నాలుగు యాక్షన్ సినిమాలూ ఫ్లాపయ్యాయి. ప్రేక్షకులు సునీల్ ని ఈ అవతారంలో చూడాలనుకోలేదు.

తిరిగి మూడేళ్ళూ అడపాదడపా కామెడీ పాత్రలే నటిస్తూ వున్నాక, తన కెరీర్ ముగిసి పోయిందనుకున్నారంతా. అయితే 2020 లో కలర్ ఫోటో’లో నెగెటివ్ పాత్ర వేయడంతో ఉలిక్కిపడింది ప్రేక్షకలోకం. ఈ పాత్రకి మంచి పేరు కూడా వచ్చింది. కమెడియన్ గా కంటే, హీరోగా కంటే, విలన్ గా నటించినప్పుడే అతడిలోని సహజ నటుడు- ఆ మాట కొస్తే విలక్షణ నటుడు బయటపడ్డాడు.

దీంతో 2021 లో ‘పుష్ప1’ లో విలన్ గా నటించే అవకాశం రావడంతో నూటికి నూరు శాతం ఆ అవకాశాన్ని వినియోగించుకుని తిరుగులేని కొత్త విలన్ గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. మంగళం శీను విలన్ పాత్ర ప్రేక్షకుల్లోకి రాకెట్ లా దూసుకెళ్ళింది.

ఇక 2023లో తమిళంలో శివ కార్తికేయన్ నటించిన ‘మావీరన్’ లో మొదటిసారిగా తమిళంలో విలన్ గా నటించి అక్కడా నిరూపించుకున్నాడు. దీంతో ప్రారంభమైంది తమిళంలో విజయ యాత్ర. 2023లోనే ‘జైలర్’, ‘మార్క్ ఆంటోనీ’ రెండు హిట్స్ తో తమిళంలో బిజీ అయిపోయి- ‘జపాన్’, ఈగిల్’ అనే మరో రెండు పెద్ద సినిమాల్లో నటిస్తున్నాడు.

ఈ విలన్ అవతారంలో డిమాండ్ లో వున్న ఆర్టిస్టుగా సునీల్ - మొత్తం తన నట జీవితంలో చూడని స్థాయిలో పారితోషికం పొందే స్థాయికి ఎదిగాడు. 49 ఏళ్ళ లేటు వయసులో తను కెరీర్‌కో స్థిరత్వం ఏర్పడి సెటిలయ్యాడు. ఇంకా తెలుగులో కూడా మహేష్ బాబు ‘గుంటూరు కారం’, శంకర్- రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, అల్లు అర్జున్ ‘పుష్ప2’ లలో కూడా నటిస్తున్నాడు.

*

First Published:  21 Sept 2023 7:34 PM IST
Next Story