Telugu Global
Cinema & Entertainment

చిరు, బాలయ్య, పవన్, ప్రభాస్ సినిమాల షూటింగ్స్ బంద్

టాలీవుడ్ లో మరో బంద్ మొదలైంది. ఇవాళ్టి నుంచి కొన్ని పెద్ద సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. లిస్ట్ లో ప్రభాస్, పవన్, బాలయ్య సినిమాలున్నాయి

tolly wood workers
X

కేవలం చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కల్యాణ్ సినిమాలే కాదు.. విజయ్ దేవరకొండ, మహేష్ బాబు లాంటి చాలామంది హీరోల సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఇవాళ్టి నుంచి షూటింగ్స్ నిలిపివేస్తున్నట్టు యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించినట్టుగానే ఇవాళ్టి నుంచి షూటింగ్స్ ఆపేశారు గిల్డ్ సభ్యులు. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి బడా ప్రొడ్యూసర్స్ ఈ గిల్డ్ లో ఉండడంతో, పెద్ద హీరోల సినిమాల షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి.

గిల్డ్ నిర్ణయంపై ఫిలిం ఛాంబర్ సమావేశమైంది. దాదాపు 48 మంది సభ్యులతో జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటుచేసింది. గిల్డ్ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇండస్ట్రీ బాగు కోసమే షూటింగ్స్ ఆపేశారని, దీన్ని అందరూ స్వాగతించాలని ఫిలింఛాంబర్ కోరింది. ఈ మేరకు ఫిలింఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. షూటింగ్స్ నిలిపివేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్టు తెలిపారు.

తాజా ప్రకటనతో పెద్ద పెద్ద సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. ఎన్ని రోజులు ఇలా షూటింగ్స్ ఆపేస్తారనేది ఎవ్వరికీ తెలియదు. నిర్మాతలమంతా కూర్చొని, సమస్యలపై చర్చించి ఓ పరిష్కార మార్గానికి వచ్చేవరకు షూటింగ్స్ జరగవని దిల్ రాజు లాంటి నిర్మాతలు అంటున్నారు. అయితే హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న పరభాషా చిత్రాలకు సమ్మెతో ఎలాంటి సమస్య లేదు.

కరోనా తర్వాత థియేటర్లకు జనం రావడం మానేశారు. మరోవైపు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. నటీనటుల పారితోషికాలు పెరిగాయి. వీటితో పాటు ఓటీటీతో సమస్యలున్నాయి. టికెట్ రేట్లపై కూడా సమస్యలున్నాయి. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చే వరకు షూటింగ్స్ ఉండవని ఫిలింఛాంబర్ ప్రతినిధులు చెబుతున్నారు.

మరోవైపు యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాన్ని నిర్మాతల మండలి వ్యతిరేకించింది. కొంతమంది నిర్మాతలు తమ స్వార్థం కోసం షూటింగ్స్ ఆపేశారని, తమ ఆర్గనైజేషన్ సభ్యుల షూటింగ్స్ మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు. నిర్మాతలందర్నీ భాగస్వామ్యం చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదంటున్నారు నిర్మాతల మండలి సభ్యులు.

First Published:  1 Aug 2022 1:27 PM IST
Next Story