Telugu Global
Cinema & Entertainment

యాక్షన్ హీరో - సూపర్ హీరో హోరాహోరీ!

ఇప్పుడు దేశంలో యాక్షన్ సినిమాలకే డిమాండ్. యాక్షన్ సినిమాల ముందు రోమాంటిక్ సినిమాలు తట్టుకుని నిలబడడం లేదు. అందులోనూ పానిండియా సినిమాలంటే యాక్షన్ సినిమాలుగానే మారిపోయి, ఇండియా వ్యాప్తంగా స్టార్ హీరోలు నటించే రోమాంటిక్ సినిమాలు కనుమరుగై పోతున్నాయి.

యాక్షన్ హీరో - సూపర్ హీరో హోరాహోరీ!
X

యాక్షన్ హీరో - సూపర్ హీరో హోరాహోరీ!

ఇప్పుడు దేశంలో యాక్షన్ సినిమాలకే డిమాండ్. యాక్షన్ సినిమాల ముందు రోమాంటిక్ సినిమాలు తట్టుకుని నిలబడడం లేదు. అందులోనూ పానిండియా సినిమాలంటే యాక్షన్ సినిమాలుగానే మారిపోయి, ఇండియా వ్యాప్తంగా స్టార్ హీరోలు నటించే రోమాంటిక్ సినిమాలు కనుమరుగై పోతున్నాయి. రోమాంటిక్ స్టార్ షారుఖ్ ఖాన్ యాక్షన్ హీరో అయిపోయాడు. రోమాంటిక్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ హీరో అయిపోయాడు. రోమాంటిక్ స్టార్ రణబీర్ కపూర్ యాక్షన్ హీరో అయిపోయాడు. రోమాంటిక్ స్టార్ ప్రభాస్ యాక్షన్ హీరో అయిపోయాడు. రోమాంటిక్ స్టార్ సన్నీ డియోల్ యాక్షన్ హీరో అయిపోయాడు. రోమాంటిక్ స్టార్ అల్లు అర్జున్ యాక్షన్ హీరో అయిపోయాడు. ఆఖరికి రోమాంటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా యాక్షన్ హీరో అయిపోయాడు!

రోమాంటిక్ స్టార్ చచ్చిపోయాడు. రోమాంటిక్ సినిమాల వంటి సాఫ్ట్ సినిమాలతో టెక్నికల్ గా అద్భుతాలు చేయడానికి లేదు. హింస, రక్తపాతాలతో రఫ్ గా వుండే యాక్షన్ సినిమాలతోనే ఆడియో విజువల్ అద్భుతాలు, థ్రిల్స్ సాధ్యం. ప్రేక్షకులు ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం వయోలెంట్ యాక్షన్ సినిమాలకి అలవాటు పడిపోతున్నారు. అందుకే కేజీఎఫ్, పుష్ప, జైలర్, జవాన్, పఠాన్, గదర్2 వంటి యాక్షన్ సినిమాలు వందలాది కోట్లు సంపాదించుకో గల్గుతున్నాయి. రాబోయే సాలార్ కూడా ఈ లిస్టులో చేరుతోంది.

యాక్షన్ హీరో వచ్చేసి ఇంకో పనికూడా చేస్తున్నాడు- సూపర్ హీరోల్ని తొక్కేస్తున్నాడు. ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సూపర్ హీరో కనిపించడు, ఆదిత్య 369 వంటి సూపర్ హీరో కనిపించడు. కానీ హాలీవుడ్ లో సూపర్ హీరో సినిమాలదే రాజ్యం. 1978 లో సూపర్ మాన్ సిరీస్ నుంచి మొదలుపెట్టి నేటి మార్వెల్ సిరీస్ వరకూ సూపర్ హీరో సినిమాలు హాలీవుడ్ నుంచి నిరంతరాయంగా ఉత్పత్తి అవుతూనే వుంటాయి. వీటిలో హింసా రక్తపాతాలుండవు. సూపర్ హీరోకి అద్భుత శక్తులుంటాయి. ఆ శక్తులతో అతను బ్యాట్ మాన్ కాగలడు, స్పైడర్ మాన్ కాగలడు, ఐరన్ మాన్ కాగలడు, యాంట్ మాన్ కాగలడు, ఆక్వా మాన్ కాగలడు...

హింసాత్మక యాక్షన్ సినిమాలు కొన్ని వర్గాల కోసమే. హింసలేని, సైన్స్ ఫిక్షన్ తో కూడిన అద్భుత విన్యాసాల, సాహసకృత్యాల సూపర్ మాన్ సినిమాలు పిల్లలు సహా అన్ని వర్గాల ప్రేక్షకుల కోసమూ. వీటి మార్కెట్ పరిధి యాక్షన్ సినిమాల కంటే చాలా విశాలమైనది. దీన్ని సొమ్ము చేసుకుంటూ తిరుగులేని సినిమా శక్తిగా విజృంభిస్తోంది హాలీవుడ్. గత సంవత్సరం నుంచీ పీవీఆర్- ఐనాక్స్ మల్టీప్లెక్స్ గ్రూపుని కలెక్షన్ల ప్రవాహంతో కాపాడుతున్నవి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరోల సినిమాలే!

మన స్టార్ సినిమాలు ఫ్యాన్స్ కి సేవ చేస్తూ, వాళ్ళ డిమాండ్స్ ని తీర్చడమే ప్రధానోద్దేశంగా పెట్టుకున్నప్పుడు, చిత్ర విచిత్ర ఖడ్గాలతో నరకడాలూ, రక్తాలు పారించడాలూ, నెగెటివ్ పాత్రలుగా గ్లోరిఫై అవడాలూ కలిసి వయోలెంట్ యాక్షన్ సినిమాలుగానే వస్తాయి. హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలకి చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియాలో స్పందిస్తారు. పండగ వాతావరణం సృష్టిస్తారు. మన యాక్షన్ సినిమాలకి ఫ్యాన్స్ మాత్రమే ట్వీట్లతో గడుపుతారు.

ఒక చార్ట్ గత నెలలో అత్యధిక గ్లోబల్ డిమాండ్ వున్న పది సినిమాలు సూపర్ హీరో సినిమాలేనని తెలుపుతోంది. ఈ జాబితాలో బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ అగ్రస్థానంలో వుంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర జానర్ల సినిమాల కంటే 100 రెట్లు ఎక్కువ డిమాండ్ తో వుంది. వెండితెర మీద హింస, రక్తపాతం పట్ల అమెరికాలో పెరుగుతున్న వ్యతిరేకత ఫలితమే సూపర్ హీరో సినిమాల పట్ల ఆదరణ. యాక్షన్ సినిమాల అభివృద్ధిలో నిపుణుడు ఎమర్సన్ కాలేజీ ప్రొఫెసర్ జస్టిన్ షాత్రా, సూపర్ హీరోల యుగం తుది లేనిదని వ్యాఖ్యానించాడు.

ఇంకా ఇలా చెప్పాడు, ‘యాక్షన్ సినిమాల్లో హింస ఎలా పని చేస్తుందో లోతుగా పరిశీలించాను. అది గ్రాఫిక్ హింస. డెడ్‌పూల్ లేదా లోగాన్ వంటి కొన్ని సూపర్ హీరో సినిమాల్లో హింస చాలా వరకు మ్యూట్ చేశారు. దృశ్యాల్లో యాక్షన్ వుంది, కానీ యాక్షన్ లో హింస లేదు. కొన్ని సూపర్ హీరో సినిమాలు యాక్షన్ హీరో సినిమాలుగా వుండే అవకాశం కూడా లేకపోలేదు. కానీ మొత్తం మీద అవి వినోదాత్మకంగా అడ్వెంచర్, డ్రామా వంటి వాటి వైపు మొగ్గు చూపుతాయి. సూపర్ హీరోల సినిమాలు యాక్షన్ సినిమాలకి సమానమైన పంచ్ ప్యాక్ తో వుండవు. అయినా ఈ రోజుల్లో, వండర్ వుమన్‌ చూడడానికి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకెళ్ళే అవకాశం మ్యాడ్ మాక్స్ ఫ్యూరీ రోడ్ కంటే ఎక్కువగా వుంటుంది’

మన సినిమాల విషయానికొస్తే చార్ట్ లో, ఆర్ ఆర్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఇతర జానర్ల సినిమాల కంటే 74.6 రెట్లు ఎక్కువ డిమాండ్ తో వుంది. కేజీఎఫ్ 2, 62.4 రెట్లు ఎక్కువ డిమాండ్‌తో వుంది. అదే హిందీ సూపర్ హీరో మూవీ బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ, సూపర్ హీరో సినిమాల అత్యధిక గ్లోబల్ డిమాండ్‌తో వున్న పది సినిమాల్లో ఒకటిగా వుంది.

ఇప్పుడు చూడాల్సింది మన సినిమాల్లో యాక్షన్ హీరోని ఓడించి సూపర్ హీరో ఎప్పుడు ఇంకా అధిక సంఖ్యలో ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంటాడనేది. ఇది జరగనిస్తారా మన యాక్షన్ హీరోలు?

First Published:  19 Sept 2023 3:04 PM IST
Next Story