Telugu Global
Cinema & Entertainment

కొంతకాలం సినిమాలకు బ్రేకిస్తున్నా..అమీర్ ఖాన్ షాకింగ్ ప్రకటన

'నేను 35 ఏళ్ల నుంచి సినిమాల్లో నటిస్తున్నాను. విరామం లేకుండా నటిస్తుండడంతో ఏదో నష్టపోయాననే భావన కలుగుతోంది. అందుకే కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నాను'.

కొంతకాలం సినిమాలకు బ్రేకిస్తున్నా..అమీర్ ఖాన్ షాకింగ్ ప్రకటన
X

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఏడాదిన్నర పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటన చేశాడు. ఈ ఏడాదిన్నర కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అమీర్ ఖాన్ చేసిన ప్రకటనతో ఆయన ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు. కొంతకాలంగా అమీర్ ఖాన్‌కు సరైన హిట్ లేదు. చాలా గ్యాప్ తీసుకొని ఆయన చేసిన లాల్ సింగ్ చద్దా మూవీ ఇటీవల విడుదలై అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆయన తీవ్ర నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఈ ప్రకటన చేశారు.

'నేను 35 ఏళ్ల నుంచి సినిమాల్లో నటిస్తున్నాను. విరామం లేకుండా నటిస్తుండడంతో ఏదో నష్టపోయాననే భావన కలుగుతోంది. అందుకే కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎప్పుడూ నేను సినిమాల గురించి, పని గురించి మాత్రమే ఆలోచించే వాడిని. అది సరైనది కాదని ఇప్పుడు అనిపిస్తోంది. అందుకే ఏడాదిన్నర పాటు కెమెరా ముందుకు రాకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఈ సమయాన్ని మా అమ్మ, పిల్లలతో గడపాలని అనుకుంటున్నాను.' అని అమీర్ ప్రకటించారు.

కాగా ప్రస్తుతం అమీర్ ఖాన్ ఛాంపియన్స్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. ఛాంపియన్స్ చిత్రానికి హీరోతో పాటు నిర్మాతను కూడా తానేనని, ఈ మూవీకి నిర్మాతగా కొనసాగుతానని.. ఇందులో నటించేందుకు మరో అగ్ర హీరోను సంప్రదిస్తానని చెప్పారు. కాగా నాలుగేళ్ల కిందట బాలీవుడ్ మరో అగ్ర హీరో అయిన షారుక్ ఖాన్ కూడా ఇటువంటి ప్రకటనే చేశాడు. ఆయన నటించిన జీరో సినిమా ప్లాప్ కావడంతో కొంతకాలం పాటు సినిమాలకు విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆయన నటించిన చివరి సినిమా 2018లో విడుదలైంది. అయితే ఇటీవల విడుదలైన బ్రహ్మస్త్ర సినిమాలో షారుక్ ఓ గెస్ట్ రోల్‌లో కనిపించాడు.

First Published:  16 Nov 2022 5:57 PM IST
Next Story