సీఎం అనాలోచిత నిర్ణయాలతో తొక్కిసలాటలో మహిళ చనిపోయింది
అసెంబ్లీలో సీఎం చెప్పిన మాటకు విలువ లేకుంటే ఎట్లా? : మాజీ మంత్రి హరీశ్ రావు
సీఎం అనాలోచిత నిర్ణయాలతో ఇటీవల ఒక సినిమా రిలీజ్ సమయంలో తొక్కిసలాట జరిగి మహిళ చనిపోయారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్ లాబ్స్ లో శుక్రవారం నిర్వహించిన కల్ప్రా వీఎఫ్‌ఎక్స్ ప్రారంభోత్సంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఇక సినిమాల స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వబోమని.. టికెట్లు రేట్లు పెంచబోమని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి రెండు వారాల్లోనే మాట మార్చారన్నారు. నచ్చిన వారి విషయంలో ఒకలా.. నచ్చకపోతే మరోలా వ్యవహరించడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి మంచిది కాదన్నారు. రూల్స్ అందరికీ సమానంగా ఉండాలని.. గేమ్ ఛేంజర్ సినిమాకు వచ్చే సరికి సీఎం టంగ్ చేంజ్ అయ్యిందన్నారు.
లక్షలాది మందికి ఉపాధి కల్పించే తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలబెట్టిందని గుర్తు చేశారు. అలాంటి పరిశ్రమపై కక్షసాధింపు చర్యలు మంచివి కావన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో సినిమా పరిశ్రమకు ప్రోత్సాహం అందించారని తెలిపారు. కల్ప్రా వీఎఫ్ఎక్స్ సీఈవో మలిశ్వర్ సిద్దిపేట లాంటి పట్టణంలో ఐటీ కంపెనీని పెట్టి ఎంతో మంది యువతను ప్రోత్సహించారని అన్నారు. తెలుగు సినిమా హాలీవుడ్ తో పోటీ పడేందుకు విజువల్ ఎఫెక్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఏఐ విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీ తెలుగు సినీ పరిశ్రమ వృద్ధికి దోహద పడుతుందన్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డులు రావడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమన్నారు. తెలుగు ప్రజల గౌరవం ప్రపంచవ్యాప్తంగా పెరగాలన్నారు. మరిన్ని మంచి విజువల్ ఎఫెక్ట్స్ తో తెలుగు సినిమాలు రావాలని ఆకాంక్షించారు.