రామ్ చరణ్ కు అరుదైన గౌరవం
తెలుగులో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
తెలుగులో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో చరణ్ గ్లోబల్ స్టార్ గా మారారు. ఆర్ఆర్ఆర్ సినిమాకుగాను హాలీవుడ్ నుంచి పలు అవార్డులు అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ నెల 13న చెన్నైలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకల్లో రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు. కళారంగానికి చరణ్ చేస్తున్న సేవలను గుర్తించి వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ అందిస్తోంది. చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకోనుండడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వేల్స్ యూనివర్సిటీ గతంలో చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కి కూడా గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. అయితే దానిని పవన్ కళ్యాణ్ సున్నితంగా తిరస్కరించారు. కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ వినాయక చవితి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ, సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.