Telugu Global
Cinema & Entertainment

సౌత్ లో మలయాళంలోనే 3 సూపర్ హిట్స్!

సౌతిండియాలో ఫిబ్రవరిలో టాలీవుడ్, కొలీవుడ్, శాండల్ వుడ్ బిత్తరచూపులు చూస్తూంటే, మాలీవుడ్ మస్త్ మజాగా వుంది. ఫిబ్రవరిలో మూడు పెద్ద హిట్లతో బాక్సాఫీసు బూమ్ క్రియేట్ చేసింది.

సౌత్ లో మలయాళంలోనే 3 సూపర్ హిట్స్!
X

సౌతిండియాలో ఫిబ్రవరిలో టాలీవుడ్, కొలీవుడ్, శాండల్ వుడ్ బిత్తరచూపులు చూస్తూంటే, మాలీవుడ్ మస్త్ మజాగా వుంది. ఫిబ్రవరిలో మూడు పెద్ద హిట్లతో బాక్సాఫీసు బూమ్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరిలో మలయాళంలో 19 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో మూడు సూపర్ హిట్స్ అయ్యాయి. వరుసగా మూడు వారాలు- ఫిబ్రవరి 9న విడుదలైన రోమాంటిక్ కామెడీ ‘ప్రేమలు’, 15 న విడుదలైన పీరియడ్ హార్రర్ ‘భ్రమయుగం’, 23 న విడుదలైన సర్వైవల్ డ్రామా ‘మంజుమ్మెల్ బాయ్స్’ అనూహ్యంగా అసంఖ్యాక ప్రేక్షక లోకాన్ని థియేటర్లకి రప్పించాయి. సినిమా బావుంటే కాదు, ఎంతో బావుంటే 4 వారాల్లో ఓటీటీల్లో వచ్చే దాకా సినిమా కోసం ప్రేక్షకులు ఆగరని, తప్పకుండా థియేటర్లకి పరుగు పెడతారనీ నిరూపించాయి.

హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న చిన్న సినిమా ‘ప్రేమలు’ కేరళ మార్కెట్లలో నేటికి రూ. 33 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 72 కోట్లూ గ్రాస్ వసూలు చేసింది. కనీసం వచ్చే రెండు వారాల పాటు ఇదే జోరు కొనసాగుతుందని అంచనా. దీని బడ్జెట్ కేవలం 3 కోట్ల రూపాయలు. గిరీష్ దర్శకత్వం వహించిన ఇందులో నస్లెన్ గఫూర్, మమిత బైజూ లవర్స్ గా నటించారు. దీని తెలుగు డబ్బింగ్ విడుదలకి సన్నాహాలు జరుగుతున్నాయి.

మలయాళ లెజెండ్ మమ్ముట్టి నటించిన బ్లాక్ అండ్ వైట్ ప్రయోగాత్మకం ‘భ్రమయుగం’ కేరళ మార్కెట్ లలో నేటికి రూ. 19 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లూ వసూలు చేసింది. కనీసం వచ్చే రెండు వారాల పాటు ఇదే జోరు కొనసాగుతుందని అంచనా. దీని బడ్జెట్ రూ. 27 కోట్లు. దీనికి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించాడు. అయితే గతవారం విడుదలైన దీని తెలుగు డబ్బింగ్ ఫ్లాపయ్యింది.

ఇక ‘మంజుమ్మెల్ బాయ్స్’ కేవలం 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 26 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కేరళ మార్కెట్లలో 3 రోజుల్లో రూ. 11 కోట్లు వసూలు చేసి, మాలీవుడ్‌లో అతిపెద్ద వసూళ్ళు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇది కూడా కనీసం వచ్చే రెండు వారాల పాటు ఇదే జోరుతో వుంటుందని అంచనా. దీన్ని కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. చిదంబరం పొడువాల్ దర్శకత్వం వహించిన నిజకథ ఆధారంగా తీసిన ఇందులో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలూ వర్ఘీస్ తదితర యువ నటులు నటించారు.

ఈ ఘన విజయాలతో కొత్త సినిమాలు ప్రదర్శించ కూడదన్న కేరళ ఎగ్జిబిటర్ల నిర్ణయం పటా పంచలైంది. కొత్త సినిమాలకి 42 రోజుల ఓటీటీ విండో ని డిమాండ్ చేస్తూ, ఫిబ్రవరి 22 నుంచి కొత్త సినిమాలు ప్రదర్శించకూడదని ఎగ్జిబిటర్ల సంఘం తీర్మానం చేసింది. నిర్మాతలు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఆ తీర్మానాన్ని ఈ రోజు వెనక్కి తీసుకున్నారు.

ఇక టాలీవుడ్ విషయానికొస్తే ఫిబ్రవరిలో ఒక్కటీ హిట్ కాలేదు. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ ‘ఊరిపేరు భైరవకోన’ మాత్రమే యావరేజితో సరిపెట్టుకున్నాయి. ‘ఈగల్’, ‘యాత్ర 2’ లతో బాటు కొత్తవాళ్ళతో తీసిన 17 చిన్న సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. గతవారం విడుదలైన ‘సుందరం మాస్టార్’, ‘సిద్ధార్థ్ రాయ్’, ‘భ్రమయుగం’, ‘మస్త్ షేడ్స్ వున్నాయిరా’ నాలుగూ ఫ్లాపయ్యాయి. తెలుగు సినిమాలు ఓటీటీల యుగంలో ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించడానికి ఎంతో బావుండడం కాదు, కనీస స్థాయిలో కూడా బావుండడడం లేదు. నడుస్తున్న కాలం ఒకటైతే చిన్న మేకర్లు తీసేదొకటి- అదే పాత నస.

ఫిబ్రవరిలో అటు కోలీవుడ్ కూడా ఫ్లాపులతో కుదేలైంది. మొత్తం 22 విడుదలైతే ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ మాత్రమే అంతంత మాత్రం హిట్టయ్యింది. రజనీ కాంత్ ‘లాల్ సలాం’ కూడా ఫ్లాపయ్యింది. మిగిలిన 20 అడ్రసు లేకుండా పోయిన చిన్నాచితకలు. ఇంకా అటు శాండల్ వుడ్ లో 27 విడుదలైతే ఒక్క ఫిబ్రవరి 9న విడుదలైన ‘ఒందు సరళ ప్రేమ కథే’ అనే చిన్న సినిమా మాత్రమే హిట్టయ్యింది. రూ. 8 కోట్లు వసూలు చేసింది.

అసలుకైతే గత సంవత్సరం మలయాళంలో వారానికి 6 సినిమాలు చొప్పున విడుదలవుతూ ఫ్లాపులపాలైన నేపథ్యం వుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కాస్త మెరుగుపడింది. మెరుగుపడడమే కాదు మూడు బ్లాక్ బస్టర్స్ తో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రూ. 3 కోట్లు, 5 కోట్లు, 27 కోట్ల బడ్జెట్స్ తో నిర్మించిన ఈ మూడూ ఎందుకు ప్రేక్షకుల్ని ఓటీటీల్ని కాదని థియేటర్లకి పరుగెత్తించాయో పరిశీలించాల్సిన అవసరముంది. తదనుగుణంగా ఆలోచించి మేకింగ్ చేసే కొత్త బాట వేసుకోవాల్సిన బాధ్యత కూడా వుంది.

First Published:  28 Feb 2024 3:14 PM IST
Next Story