ఉద్యోగం లేకున్న పెన్షన్ పొందొచ్చు!
కొత్త స్కీం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు

రిటైర్ అయిన తర్వాత కూడా ఉద్యోగుల జీవితం సాఫీగా సాగేందుకు పెన్షన్ దోహదం చేస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసే వారికి మాత్రమే ఈ పెన్షన్ స్కీములు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగాలు చేయని సామాన్యులకు ఆ అవకాశం లేదు. ఇకపై ఉద్యోగం లేకున్నా పెన్షన్ పొందొచ్చు.. ఆ దిశగా కొత్త స్కీం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలో 60 ఏళ్లు పైబడిన వారందరికీ పెన్షన్ ఇచ్చేందుకు యూనివర్సల్ పెన్షన్ స్కీం తేవడానికి ప్రయత్నిస్తోంది. గిగ్ వర్కర్లు, కన్‌స్ట్రక్షన్ కార్మికులు, ఇతరులు కూడా ఈ స్కీంలో చేరడానికి అవకాశం కల్పించనున్నారు. ఏదైనా సంస్థలో పని చేసే ఉద్యోగి వేతనంలో నుంచి 12 శాతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఖాతాలో జమ చేస్తారు. ఆ ఉద్యోగి పని చేస్తున్న సంస్థ కూడా అంతే మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేయాలి. ఇకపై ఏ ఉద్యోగం చేయని వారు సైతం పీఎఫ్ ఖాతాలో పెన్షన్ కోసం ప్రతి నెలా కొంత మొత్తాన్ని జమ చేసి 60 ఏళ్ల తర్వాత పెన్షన్ పొందొచ్చు. ఇప్పటికే అమల్లో ఉన్న అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ దాన్ యోజన్, ప్రధాన మంత్రి కిసాన్ మాన్ దాన్ యోజన లాంటి పెన్షన్ పథకాలన్ని కలిపి ఒకే పెన్షన్ స్కీంగా తీసుకువచ్చే ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇందులో సాధారణ పౌరులు తమ వాటా నిధిని చెల్లిస్తే ప్రభుత్వం అంతే మొత్తం జమ చేస్తుందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్తున్నాయి. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత విధివిధానాలు ప్రకటించే అవకాశముంది.