ప్రపంచంలోనే తొలి ప్లెక్స్ ఫ్యుయల్ కారు ఇదే.. నేడే కేంద్ర మంత్రి గడ్కరీ లాంచింగ్..!
పూర్తిగా 100% ఇథనాల్ ఇంధనంగా నడిచే కారు `ఇన్నోవా`ను టయోటా కిర్లోస్కర్ రూపొందించింది. ఇది పూర్తిగా 100 శాతం ఇథనాల్‌తోనే నడుస్తుంది.
కర్బన ఉద్గారాలతో భూతాపం పెరిగిపోతున్నది. మరోవైపు క్రూడాయిల్.. అదీ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఫలితంగా పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ గ్యాస్ ధరలు అధికం..రోజురోజుకు పెరిగిపోతున్న ధరలూ.. భూతాప నివారణకు యావత్ ప్రపంచ దేశాలు ఆల్టర్నేటివ్ ఇంధన ఉత్పత్తులపై దృష్టి పెట్టాయి. ఆ క్రమంలో సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటం తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్స్.. హైడ్రోజన్, ఫ్లెక్సీ ఫ్యుయల్, బయో ఫ్యూయల్ తదితర ఆధారిత వాహనాల తయారీపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో దశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ప్రపంచంలోనే రూపుదిద్దుకున్న తొలి ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఫ్యుయల్ కారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఆవిష్కరించనున్నారు.
పూర్తిగా 100% ఇథనాల్ ఇంధనంగా నడిచే కారు `ఇన్నోవా`ను టయోటా కిర్లోస్కర్ రూపొందించింది. ఇది పూర్తిగా 100 శాతం ఇథనాల్‌తోనే నడుస్తుంది. టయోటా అధునాతనంగా రూపొందించిన ఫ్లెక్స్ ఫ్యుయల్ వెహికల్ (ఎలక్ట్రికిఫికేషన్ అండ్ ఇథనాల్) ఇన్నోవా. 40 శాతం ఎలక్ట్రికిసిటీ ఉత్పత్తి చేస్తుంది. ఇథనాల్‌తో ధర తగ్గుతుంది. హైడ్రోజన్ పవర్డ్ కారు `టయోటా మిరాయి ఈవీ`ని గతేడాది గడ్కరీ ఆవిష్కరించారు. భారత్‌లో గ్రీన్ హైడ్రోజన్ బేస్డ్ ఎకోసిస్టమ్ సృష్టించే లక్ష్యంతో పైలట్ ప్రాజెక్టుగా టయోటా మిరాయి ఈవీ కారును ఆవిష్కరించారు. టయోటా మిరాయి ఈవీ కారు గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఫ్యుయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ (ఎఫ్‌సీఈవీ) టెక్నాలజీతో రూపుదిద్దుకున్నది.
బయో ఫ్యుయల్ తయారీ ఆధారిత వాహనాలను ముందుకు తీసుకు రావడంతో పెట్రోలియం దిగుమతులపై భారీగా నిధులు ఖర్చు చేయడం తగ్గడంతోపాటు ఇంధన రంగంలో స్వావలంభన సాధించడమే లక్ష్యం. ఏటా దేశీయ పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి విలువ సుమారు రూ.16 లక్షల కోట్లు.
ఫ్లెక్సి ఫ్యుయల్ కార్లు ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ కలిగి ఉంటాయి. పెట్రోల్‌తోపాటు 83 శాతం వరకు ఇథనాల్ మిక్స్ చేసిన ఇంధనంతో నడిచే వాహనాలే ఫ్లెక్సీ ఫ్యుయల్ వెహికల్స్. 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ కలగలిపిన ఫ్లెక్స్ ఫ్యుయల్ వెహికల్‌ను `ఈ85` అని పిలుస్తారు. చెరుకు నుంచి చక్కర ఉత్పత్తి చేస్తున్న సమయంలో వచ్చే బై ప్రొడక్ట్ ఇథనాల్. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ అత్యంత చౌక. దేశీయంగా పండించే పంటల నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేయొచ్చు.
ఇప్పటికే భారత్‌లోని పలు కార్ల తయారీ సంస్థలు ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యుయల్ వెహికల్స్ తయారీ వైపు దృష్టి మళ్లించాయి. ఆ జాబితాలో మారుతి సుజుకి, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్, హోండా కార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా నిలిచాయి. ఫ్లెక్స్ ఫ్యుయల్ ఇంజిన్ కార్లు బ్రెజిల్, అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనా వంటి దేశాల్లో ఇప్పటికే పాపులర్ అయ్యాయి.
ప్రపంచదేశాల్లో ఇథనాల్ తయారీలో భారత్‌ది ఐదో స్థానం. అమెరికా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, చైనా తర్వాత ఇథనాల్ తయారీలో భారత్ నిలుస్తుంది. మక్కలు, చెరకు, జనపనార, బంగాళ దుంపలు, బియ్యం నుంచి ఇథనాల్ తయారు చేయొచ్చు.