Telugu Global
Business

వరల్డ్ కప్ ఎఫెక్ట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వాటికి భారీ డిమాండ్!

క్రికెట్ పండుగను కొన్ని సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా దసరా, దిపావళి ఆఫర్లను ముందుగానే ప్రకటించి తమ సేల్స్ పెంచుకుంటున్నాయి.

వరల్డ్ కప్ ఎఫెక్ట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వాటికి భారీ డిమాండ్!
X

ఇండియాలో క్రికెట్ ఒక మతం అయితే ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ ఒక కుంభమేళా అని తాజాగా జరిగిన ఒక మ్యాచ్ సందర్భంగా ఓ టీవీ వ్యాఖ్యాత చెప్పారు. 12 ఏళ్ల తర్వాత ఇండియాలో వన్డే వరల్డ్ కప్ నిర్వహిస్తుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లన్నింటిలో పరుగుల వరద పారింది. ప్రతీ మ్యాచ్‌లో సెంచరీలు నమోదవుతుండటంతో ఫ్యాన్స్ మస్తు ఖుషీలో ఉన్నారు. ఈ క్రికెట్ పండుగను కొన్ని సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా దసరా, దీపావళి ఆఫర్లను ముందుగానే ప్రకటించి తమ సేల్స్ పెంచుకుంటున్నాయి.

ఇంటిలోనే స్టేడియంను తలపించేలా భారీ టీవీలు, ప్రొజెక్టర్ స్క్రీన్లు పెట్టుకొని చూడటానికి చాలా మంది అభిమానులు ఇష్టపడుతున్నారు. క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభానికి వారం రోజుల ముందు నుంచి దేశంలో బిగ్ స్క్రీన్ టీవీలు, ప్రొజెక్టర్ల అమ్మకాలు భారీగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండు రోజుల్లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఉండటంతో గత రెండు రోజుల్లోనే టీవీల అమ్మకాలు తారా స్థాయికి చేరినట్లు తెలుస్తున్నది. శాంసంగ్, షావోమీ, సోనీ, ఎల్జీ, పానసోనిక్ వంటి కంపెనీలు తమ సేల్స్ పెరిగినట్లు చెబుతున్నాయి.

ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వేదికలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. ఈ క్రమంలో ఎక్కువగా సేల్ అవుతున్నవి టీవీలే అని గుర్తించారు. ఫెస్టివెల్ సేల్స్‌లో బట్టలకు సమానంగా టీవీల విక్రయాల విలువ ఉండటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. దీనికి తోడు క్లియర్ పిక్చర్, సౌండ్ కోసం డీటీహెచ్ కనెక్షన్లను కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది.

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన ప్రతీ సారి భారీ టీవీలు, ప్రొజెక్టర్లకు డిమాండ్ పెరుగుతున్నదని.. ఈ సారి వరల్డ్ కప్ మ్యాచ్‌కు కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు ఎల్జీ ఇండియా బిజినెస్ హెడ్ గిరీశన్ గోపి ఒక ఆంగ్ల పత్రికతో చెప్పారు. ధంతెరాస్ రోజు చాలా మంది కొత్త వస్తువులు కొంటుంటారు. ప్రతీ ఏడాది ఆ రోజు టీవీల సేల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ గత శని, ఆదివారాల్లో ధంతెరాస్‌ను మించిన సేల్స్ జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.

55 ఇంచుల కంటే పెద్దవైన టీవీలు గతంలో కంటే రెండున్నర రెట్లు ఎక్కువగా అమ్ముడు పోయినట్లు తెలిపారు. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు నుంచే తమ టీవీ సేల్స్ క్రమంగా పెరుగుతూ వచ్చాయి. గత వీకెండ్‌లో భారీ డిమాండ్‌ను తట్టుకోలేక పోయామని.. ప్రస్తుతం తమ స్టాక్ మొత్తం ఖాళీ అయినట్లు శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ దీప్ సింగ్ చెప్పారు.

ఇక భారీ టీవీలకు పెట్టింది పేరైన సోనీ కంపెనీ కూడా 75 ఇంచెస్, 85 ఇంచెస్ టీవీల సేల్స్ గణనీయంగా పెరిగినట్లు చెప్పింది. ఈ రెండు రోజులు కూడా సేల్స్ భారీగానే ఉంటాయనే అంచనాతో స్టాక్ సిద్ధం చేసినట్లు సోని ఇండియా ఎండీ సునిల్ నయ్యర్ తెలిపారు.

First Published:  12 Oct 2023 3:30 AM GMT
Next Story