వారానికి 70 గంటలు పని.. సంతోషానికి శాశ్వతంగా సెలవుచీటీయే!
భారతీయ యువత వారానికి 70 గంటలు పని చేయాలన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వ్యాఖ్యలు యువతలో ప్రకంపనలు రేపుతున్నాయి.
భారతీయ యువత వారానికి 70 గంటలు పని చేయాలన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వ్యాఖ్యలు యువతలో ప్రకంపనలు రేపుతున్నాయి. వారానికి 5 రోజుల్లో 40 గంటల పని పేరుతో పెడుతున్న ఒత్తిడికే వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ జీవితం రెండూ కోల్పోతున్నామని యువత ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడిక ఈ 70 గంటల పని అంటే వారంలో ఏడు రోజులు పని చేసేవాళ్లు రోజుకు 10 గంటలు, 5 గంటలు పని చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఎన్ఎంసీ ఉద్యోగులు రోజుకు 14 గంటల పాటు పని చేయాలా అని వారు నిలదీస్తున్నారు. అన్నేసి గంటలు పని చేశాక తమ ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు అనేవి ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు.
నారాయణమూర్తి చెబుతున్నట్లు పాశ్చాత్య దేశాల్లో ఈ స్థాయి పని చేస్తున్నారంటే అక్కడి వాతావరణ పరిస్థితులు, పనికి తగ్గ ఆదాయం అన్నీ అందుకు అనుకూలిస్తూ ఉండొచ్చు. కానీ రోజుకు 8 గంటల పనికే విపరీతంగా అలసిపోయే ఒత్తిడి, వాతావరణ పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. దీనికితోడు పని ప్రదేశంలో సౌకర్యాలూ అంతంతమాత్రమే. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం ఇచ్చిన కంపెనీలు ఉద్యోగులతో రెట్టింపు పని గంటలు పని చేయించుకున్నది కళ్లారా చూశాం. అయినా కూడా వర్క్ ఫ్రం హోంతో ఉద్యోగులు సుఖపడిపోతున్నారన్నట్లుగా కంపెనీలు కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని హుకుం జారీ చేశాయి. రోజుకు 8 గంటల పనికి ఉద్దేశించిన మన కార్మిక చట్టాలు నారాయణమూర్తి చెబుతున్నట్లు 70 గంటల పనికి ఎలా ఒప్పుకుంటాయన్నదీ ప్రశ్నే.
నిపుణులదీ అదే మాట
ఎసైన్‌మెంట్లు సకాలంలో పూర్తి చేయాలన్న ఒత్తిడి, భారీ లక్ష్యాలను చేధించాల్సిన అవసరం, పనిలో ఎప్పటికప్పుడు నిరూపించుకోకపోతే యాజమాన్యాల నుంచి వచ్చే సతాయింపులు వీటితో రోజుకు 8 గంటల పనికే భారతీయులు అలసిపోతున్నారు. ముఖ్యంగా సాధారణ పనులతో పోల్చితే ఎక్కువ జీతాలొచ్చే సాఫ్ట్‌వేర్ కొలువులు, ఎంఎన్‌సీ ఉద్యోగాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువ. దీంతో వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు తలెత్తడం సంసార జీవితంలో కలతలు కుటుంబ సంబంధాలను బీటలు వారుస్తున్నాయి. కొన్ని వేల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సంతానలేమితో బాధపడుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారానికి 70 గంటల పని అంటే ఇక ఉద్యోగి జీవితం ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
తక్కువ జీతాలకు చాకిరీ
ఇప్పటికే భారతీయ యువత తక్కువ జీతాలతో గొడ్డుచాకిరీ చేస్తున్నారని నివేదికలు ఘోషిస్తున్నాయి.. అత్యధిక పనిగంటల విషయంలో ఇండియా 187 దేశాల్లో 136వ స్థానంలో నిలిచిందంటే ఇక్కడ పనిచేస్తున్నవారు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో అర్థమవుతోంది. ఇంత చేసినా వారికి వచ్చే ఆదాయం అరకొరేననీ నివేదికలు కుండబద్దలు కొడుతున్నాయి. ఒక దేశ సంపదను కొలిచే ప్రమాణం జీడీపీ పర్ క్యాపిటీ. అంటే ఒక వ్యక్తి ఏడాదికి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)కి అందించగలిగే ఆదాయం అన్నమాట. మనదేశంలో ఏడాదికి సగటున 1660 గంటలు పని చేసే వ్యక్తి పర్ క్యాపిటా జీడీపీ జస్ట్ 1 లక్షా 90 వేల రూపాయలు. ఆస్ట్రేలియాలో ఏడాదికి సగటున 1683 గంటలు పని చేసే వ్యక్తి అందించేది 52 లక్షల 83 వేల రూపాయలు. అంతెందుకు మనకంటే చిన్న దేశమైన ఇండోనేషియాలో కూడా ఇది 3 లక్షల 57 వేల రూపాయలు. దీన్ని బట్టి మన ఉద్యోగుల ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సూపర్ పవర్ కాదు.. సంతోష భారత్ కావాలన్న జేఆర్‌డీ టాటా
భారతీయ పారిశ్రామిక విప్లవ పితామహుడిగా చెప్పుకునే జేఆర్‌డీ టాటా అన్న మాటలు ఇప్పటి సందర్భంలో ఓ సారి గుర్తు చేసుకోవాలి. నా దేశం సూపర్ పవర్ కానక్కర్లేదు. కానీ సంతోషమైన ప్రజలున్న దేశంగా ఉంటే చాలు అని ఆయన అన్నారు. కానీ ఆ విషయంలో మనం ఇప్పటికే ఎంతో ఎంతో వెనకబడిపోయాం. 2023లో ప్రపంచ సంతోష సూచీ (హ్యాపీనెస్ ఇండెక్స్)లో కేవలం 4 శాతం స్కోరుతో మన స్థానం 126. పదేళ్ల కిందట 2013లో 111 వ స్థానంలో ఉంటే ఇప్పుడు 15 స్థానాలు దిగజారి 126వ స్థానానికి పడిపోయాం. ఇక నారాయణమూర్తిగారు ఆశపడ్డట్టు వారానికి 70 గంటల పని చేస్తే సంతోషానికి శాశ్వతంగా సెలవుచీటీ ఇచ్చేసినట్లే. అప్పుడు హ్యాపీనెస్ ఇండెక్స్‌లో మనమే చిట్టచివరి స్థానంలో మిగులుతాం.