Telugu Global
Business

రిలయన్స్ కొనబోతున్న ఆ చాక్లెట్ కంపెనీ సినీ నటి శారదదేనా!

లోటస్-రిలయన్స్ డీల్ గురించి గురువారం మాత్రమే ప్రకటన వెలువడింది. కానీ, లోటస్ షేర్లు మాత్రం సోమవారం నుంచి వరుసగా అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అవడం చూస్తే.. ఈ డీల్ గురించి కొంత మందికి ముందే సమాచారం అందినట్లు తెలుస్తున్నది.

రిలయన్స్ కొనబోతున్న ఆ చాక్లెట్ కంపెనీ సినీ నటి శారదదేనా!
X

బాంబే స్టాక్ ఎక్ఛేంజ్‌ (బీఎస్ఈ)లో ఒక అనామక చాక్లెట్ కంపెనీ షేర్ ఈ వారం భారీగా పెరిగింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి ఒక్క రోజులోనే 5 శాతం మేర పెరిగింది. రూ.5.85 పెరిగిన షేర్ ధర రూ.122.95 వద్ద ఫ్రీజ్ అయ్యింది. ఈ కంపెనీని రిలయన్స్ కొనబోతోందనే వార్తలతో మార్కెట్‌లో అప్పర్ సర్క్యూట్ వద్ద షేర్ ముగియడం గమనార్హం. హైదరాబాద్ బేస్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లోటస్ చాకొలెట్ కంపెనీలో మెజార్టీ వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్‌వీఎల్) రూ.74 కోట్లకు కొనబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే రెండు కంపెనీల మధ్య అంగీకారం కూడా కుదిరినట్లు తెలుస్తున్నది.

వాస్తవానికి లోటస్-రిలయన్స్ డీల్ గురించి గురువారం మాత్రమే ప్రకటన వెలువడింది. కానీ, లోటస్ షేర్లు మాత్రం సోమవారం నుంచి వరుసగా అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అవడం చూస్తే.. ఈ డీల్ గురించి కొంత మందికి ముందే సమాచారం అందినట్లు తెలుస్తున్నది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో లోటస్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఉండగా.. దీనికి సంబంధించిన ఫ్యాక్టరీ మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాద్‌లో ఉన్నది.

ప్రముఖ సినీనటి 'ఊర్వశి' శారద, విజయరాఘవన్ నంబియార్‌తో కలిసి 1988లో లోటచ్ చాకొలేట్ కంపెనీని ప్రారంభించారు. 1991లో తొలి సారిగా ఈ కంపెనీ ఐపీవోకు వెళ్లింది. కోకో మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మిషనరీ కొనుగోలుకు రూ.8.4 కోట్ల అవసరం రాగా.. ఐపీవో ద్వారా రూ.2.2 కోట్ల మేర అప్పట్లో సమీకరించింది. చాకోలేట్స్‌తో పాటు, కొకో ప్రొడక్ట్స్‌ (Cocoa products), కొకోవా అనుబంధ ఉత్పత్తులను లోటస్‌ చాకోలేట్‌ కంపెనీ తయారు చేసి విక్రయిస్తోంది. అయితే ఆ తర్వాత కాలంలో ఈ కంపెనీలో మెజార్టీ వాటాను ప్రమోటర్లు అయిన శారద, నంబియార్‌లు సింగపూర్‌కు చెందిన సన్‌షైన్ అల్లయిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అమ్మేశారు.

ఈ కంపెనీలో బల్క్‌గా ఉత్పత్తి అయ్యే కోకా పౌడర్‌ను అమెరికాతో పాటు నైజీరియాకు ఎగుమతి చేస్తుంటారు. అంతే కాకుండా దేశీయంగా పలు చాక్లెట్ ఉత్పత్తులను కూడా మార్కెట్ చేస్తోంది. అయితే ముఖ్యంగా చాక్లెట్ సంబంధిత ప్రొడక్టుల ఉత్పత్తికే ప్రాధాన్యత ఇస్తోంది.

First Published:  30 Dec 2022 5:16 PM IST
Next Story