Telugu Global
Business

మెటాకు షాక్.. వాట్సప్ ఇండియా హెడ్ రాజీనామా

మెటా బ్రాండ్స్ అయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌కు పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన థుక్రాల్.. గతంలో ఓ టెలివిజన్ జర్నలిస్టుగా పని చేశారు.

మెటాకు షాక్.. వాట్సప్ ఇండియా హెడ్ రాజీనామా
X

ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా తమ ఉద్యోగులను భారీగా ఇంటికి పంపిస్తున్న సమయంలో.. ఓ ఉన్నతోద్యోగి షాక్ ఇచ్చారు. వాట్సప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు. ఇది ఇండియాలో మెటా సంస్థకు పెద్ద ఎదురు దెబ్బగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వాట్సప్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌ శివాంత్ థుక్రాల్‌ను ప్రస్తుతం మెటా బ్రాండ్స్ అన్నింటికీ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఇండియాలో వాట్సప్ అభివృద్ధికి అభిజిత్ బోస్ తన వంతు పాత్రను పోషించారని, ఆయన దేశంలో వాట్సప్ సంస్థకు తొలి హెడ్‌గా విస్తృత సేవలు అందించారని వాట్సప్ గ్లోబల్ హెడ్ విల్ కాచ్‌కార్ట్ పేర్కొన్నారు. వాట్సప్ కొత్త సర్వీసులు అందించడంలో అభిజిత్ అండ్ టీమ్ చేసిన కృషి మరువలేనిదని ఆయన అభినందించారు. మిలియన్ల కొద్దీ ప్రజలు, వ్యాపారులకు వాట్సప్‌ను చేరువ చేయడంలో ఎంతో తోడ్పాటును అందించారని వివరించారు. ఇండియాలో వాట్సప్ మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని.. దేశం డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ వైపు వెళ్తున్న సమయంలో మరింత నిబద్ధతగా పని చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ నెల మొదటి వారంలో మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ కూడా రాజీనామా చేశారు. మెటా ప్రత్యర్థి కంపెనీ స్నాప్‌లో ఆసియా-పసిఫిక్ ప్రెసిడెంట్‌గా ఆయన చేరారు. ఇక రాజీవ్ అగర్వాల్‌కు వేరే కంపెనీలో అవకాశం రావడంతో మెటాను వదిలి వెళ్లినట్లు సంస్థ పేర్కొన్నది. ఇండియాలో మెటా పాలసీలపై గత ఏడాదిగా చర్చ జరుగుతున్నది. ఆ సమయంలో రాజీవ్ అందించిన సేవను మరువలేమని పేర్కొంది. యూసర్ సేఫ్టీ, ప్రైవసీ‌కి ప్రాధాన్యత ఇవ్వడంతో మెటా ఎప్పుడూ ముందుంటుందని సంస్థ పేర్కొన్నది. క్లిష్ట సమయంలో రాజీవ్ ఎనలేని కృషి చేశారని తెలిపింది.

ప్రస్తుతం మెటా బ్రాండ్స్ అయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌కు పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన థుక్రాల్.. గతంలో ఓ టెలివిజన్ జర్నలిస్టుగా పని చేశారు. కొత్త రోల్‌లో థుక్రాల్ మరింత సమర్థవంతంగా పని చేస్తారని వాట్సప్ డైరెక్టర్ (పార్ట్‌నర్‌షిప్స్) మనీశ్ చోప్రా ఆశాభావం వ్యక్తం చేశారు.

First Published:  15 Nov 2022 6:59 PM IST
Next Story